KCR అనే మూడక్షరాలకు కొత్త అర్థం చెప్పిన KTR

తెలంగాణ ఐటీ,మునిసిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు (కెటిఆర్‌) కేసీఆర్‌కు కొత్త నిర్వచనమిచ్చారు.దీనిని ఆయన ట్వీట్ చేశారు. కే అంటే కాల్వలు, సీ అంటే చెరువులు, ఆర్‌ అంటే రిజర్వాయర్లు అని కేటీఆర్‌ వివరించారు.
తెలంగాణ ఇపుడు కాల్వల, చెరువుల, రిజర్వాయర్ల నీటితో కళకళలాడుతుండటంతో కేసీఆర్‌ పేరు సార్థకమైందని అన్నారు‌.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను తరలించడం ఇపుడు జరిగిందని, సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను ఎత్తిపోయడం వల్ల ఇది సాధ్యమయిందని కెటిఆర్ అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరాన్ని యువ తెలంగాణ రాష్ర్టం కేవలం మూడేళ్లలోనే పూర్తి చేయడం అద్భుతమని కెటిఆర్ వ్యాఖ్యానించారు.
కొండపోచమ్మ సాగర్‌ కింద 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు కేశావపురం రిజర్వాయర్‌ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో హైదరాబాద్‌ ప్రజల తాగునీటి కష్టాలు శాశ్వత పరిష్కారమవుతాయని అన్నారు.