హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు

 తుని మండలం సీతారాంపురం జాతీయ రహదారి పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్ట్ చేశారు.   విశాఖ పట్నం  వైపు వెళ్తున్న కొల్లు రవీంద్రను  మప్టీలో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు మార్గమధ్యంలోన ఆపి అరెస్ట్ చేశారు ఆయనను  తుని నుండి విజయవాడకు తరలిస్తున్నారు.  మచిలీపట్నం వైఎస్సార్ సిపి నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందని సమాచారం అందడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
మరొక వైపు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతో నే హత్య చేశామని ప్రధాన నిందితుల వాంగ్మూలమిచ్చినట్లు  డిఎస్పీ మహబూబ్ బాషా వెల్లడించారు. ఈరోజు  మచిలీపట్నం లో వైఎస్సార్ సిపి నేత మోకా భాస్కరరావు హత్య కేసులో సహకరించిన నిందితులను ఆర పేట పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. భాస్కరరావు హత్య కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని  అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర పై 302,109 సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు నోటీసులు ఇచ్చేందుకు కొల్లు ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయితే  కొల్లు లేకపోవడంతో కొల్లు రవీంద్ర ఆచూకి కోసం 3 బృందాలను నియమించారు. ఈ బృందమే కొల్లును అదుపులోకి తీసుకుంది.
అరెస్టు ఖండించిన చంద్రబాబు నాయుడు

కనీసం ప్రాథమిక విచారణ చేయకుండా కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం వైసిపి కక్ష సాధింపునకు నిదర్శనం. కావాలనే కక్షసాధింపుతోనే ఈ కేసులో రవీంద్రను ఇరికించారని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాఖ్యానించారు.
‘ఎమర్జెన్సీలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు. ఇంతమందిని తప్పుడు కేసులలో ఇరికించలేదు. ప్రతిపక్షాలను ఇంతగా టార్గెట్ చేయలేదు. ఇంతమంది నాయకులను జైళ్లకు పంపలేదు.
‘బీసిలంటేనే వైసిపి పగబట్టింది. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. ప్రతీకారేచ్ఛతో చేస్తున్న ఈ అరెస్ట్ లను ప్రతిఒక్కరూ ఖండించాలి, అని చంద్రబాబు నాయుడు అన్నారు.
కొల్లు రవీంద్ర మీద కేసు కుట్ర
యనమల రామకృష్ణుడు
మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై హత్యానేరాన్ని నమోదు చేయడంపై శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.
ఎన్నడూ ఎటువంటి వివాదాల్లో లేని రవీంద్రను హత్యానేరంలో ఇరికించడం వైసిపి కుటిల రాజకీయానికి నిదర్శనమని రాష్ట్రంలో బీసి నాయకత్వాన్ని లేకుండా చేయాలని వైసిపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
‘‘టిడిపి బీసి నాయకులపై కక్ష సాధింపే ధ్యేయంగా పెట్టుకుంది. అచ్చెన్నాయుడిపై, అయ్యన్నపాత్రుడిపై,తనపై పెట్టిన తప్పుడు కేసులు, కౌన్సిల్ లో బీదా రవిచంద్రపై దాడి అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు.
కేసులు పెడితే బిసి నాయకత్వం బలహీన పడుతుంది అనుకోవడం భ్రమ. కేసులు పెట్టిన కొద్దీ బీసి నాయకత్వం రాటుదేలుతుంది అనేది గుర్తుంచుకోవాలి. బీసిలను టిడిపికి దూరం చేయడం అసాధ్యం. వైసిపి ఎంత కక్ష సాధిస్తే బీసీలు టిడిపికి అంత దగ్గర అవుతారు అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. టిడిపి నాయకులు, కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తేయాలి,’ అని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.