కంచె ఐలయ్య శూద్రుల పుస్తకం అమెజాన్ ‘బెస్ట్ సెల్లర్’

హైదరాబాద్ కు చెందిన పోలిటికల్ సైంటిస్టు ప్రొఫెసర్ కంచె ఐలయ్య, కార్తిక్ కరుప్పుసామి సంపాదకత్వంలో శూద్రుల మీద వచ్చిన   పుస్తకం The Shudras: Vision for a New Path అమెజాన్ లో  సివిల్ రైట్స్ విభాగంలో బెస్ట్ సెల్లర్ గా నిలించింది.

ఈ రోజే విడులయిన ఈ పుస్తకం నెంబర్ వన్ గా నిలబడితే, రెండో స్థానంలో Autobiography of Malcolm X ఉంది. ఇక మూడో స్థానంలోొ నెల్సన్ మండేలా Long Walk To Freedom ఉంది.

కంచె ఐలయ్య శూద్ర కులాల తాత్వికుడిగా. శూద్ర కులాలా సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, అధ్యాత్మిక పతనానికి కారణాలను అన్వేషించి, వాటి భవిష్యత్తు కార్యక్రమం ఎలా ఉండాలో చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు.

హిందూత్వ భావజాలంగా ఉధృతంగా విస్తరించడానికి గల కారణాలను సమగ్రంగా ఆయన విశ్లేషిస్తూ వస్తున్నారు. ఈ పరంపరంలో వచ్చిన పుస్తకమే The Shudras

ఎప్పటిలాగే ఈ పుస్తకంలో కూడా ఫ్రొఫెసర్ ఐలయ్య రాస్తూ శూద్రుల గురించి  చాలా విప్లవాత్మక ప్రతిపాదన చేశారు.

ఇంతకీ శూద్రులెవరు? చాతుర్వర్ణ వ్యవస్థలో నాలుగో పాదానికి వాళ్లెలా చేరుకున్నారు?  అనేవి చాలా కాలంగా నానుతున్న ప్రశ్నలు

ఈ ప్రశ్నలు 70 సంవత్సరాల కిందటమొదలయ్యాయి. మొదట ఈ ప్రశ్నలు వేసిందెవరో కాదు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ . 1946లో ఆయన Who are the Sudras? పేరుతో పుస్తకం రాశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెెప్పారు. శూద్రులకు, బ్రాహ్మణులకు మధ్య వైరుధ్యం చాలా పురాతనమయిందని, దీని వల్లే బ్రాహ్మణలు ఆగ్రహించి శూద్రుల హోదా తగ్గించి, కులవ్యవస్థలో అట్టడుకు ఈడ్చి పడేశారని  ఆయన వాదించారు.

తర్వాత మళ్లీ ఈ ప్రశ్నలను ప్రొఫెసర్ ఐలయ్య చర్చలోకి తీసుకువచ్చారు. ఈసారి చాలా విపులంగా వాటిని తర్కించారు. సమాధానం చెప్పారు.  70 సంవత్సరాల  తర్వాత ఐలయ్య  మళ్లీ శూద్ర గొంతుకు వినిపించారని ప్రఖ్యాత పొలిటికల్ సైంటిస్టు క్రిష్టాఫ్ జెఫెరెలాట్ ఈ పుస్తకం గురించి వ్యాఖ్యానించారు.

“The Shudras echoes Dr Ambedkar’s question in Who Were the Shudras? That he asked in 1946.  More than 70 years later, Kancha Ilaiah and his team of authors revisit the issue to give Shudras a voice Again.”అని జెఫెరెలాట్ అన్నారు.

ఐలయ్య, కరుప్పుసామి ఈ పుస్తకంలో చేసిన ఆసక్తి కరమయిన  ప్రతిపాదన శూద్రుల ప్రాంతీయ రాజకీయాల గురించినది.  ఇటీవలి కాలంలో శుద్రనేతలు ప్రాంతీయ రాజకీయాలకు పరిమితమయి పోతున్నారని, దీనితో హిందూత్వాన్ని భుజానేసుకుని బ్రాహ్మణ కులాలు(ద్విజులు)జాతీయ రాజకీయాల్లో స్థిరపడుతున్నాయనే వాదనను ఈ పుస్తకం బలంగా ముందుకు తీసుకువచ్చింది. ఈ పరిణామాన్ని ఐలయ్య చాలా చక్కగా వివరించారు.

ఉదాహరణకు తెలుగుదేశం  పార్టీ, వైఎస్ ఆర్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి, జనతా దళ్ (ఎస్), సమాజ్ వాది పార్టీ,  డిఎంకె, ఎఐఎడిఎంకె, ఆర్జెడి, ఎన్ సిపి లన్నీ కూడా శుద్ర నేతలు ప్రారంభించిన పార్టీలే. ఇవన్నీ ఒకపుడు కేంద్రంలో బలంగా ఉన్న జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ని బాగా దెబ్బతీశాయి. ఫలితంగా 1990 దశకంలో బిజెపి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది.

శూద్ర యువకులు బిజెపి వైపు మళ్లిన వైనం గురించి ఈ పుస్తకంలో చాలా సమగ్రంగా వివరించారు.

జవహర్ లాల్ నెహ్రూ కాలంలో శూద్రులంతా కాంగ్రెస్ తో ఉన్నారు. పెట్టుబడిదారి వ్యవస్థ అంత బలంగా లేని రోజులవి. 1970 దాకా ఇదే పరిస్థితి. అందువల్ల శూద్ర భూస్వాములంతా కాంగ్రె స్ తో ఉంటూ గ్రామాల్లో తమదే పెత్తనమని భావించారు.

1990 దాకా దేశం  వ్యావసాయిక ఆర్థిక వ్యవస్థయే. గ్రామం నుంచి జిల్లా స్థాయి దాకా శూద్రభూ స్వాములే పెత్తనం వెలగబెట్టారు. ఏవో అక్కడక్కడ కొన్ని మూలల్లో మాత్రమే బ్రాహ్మణులు, ముస్లింలు అధికారం చలాయించే వారు.

అయితే, 1970 ఉత్తరార్ధం నుంచి మెల్లిగా పెట్టుబడి దారి వ్యవస్థ వైపు ఆర్థిక వ్యవస్థ మరలడం మొదయింది.  1971లో ఇందిరా గాంధీ శూద్ర నాయకులను కాదని దళితులనే నేరుగా చేరుకోవడం మొదలు పెట్టారు. ఆమెకు   ఈ వర్గాలనుంచి  బాగా మద్దతు లభించింది. ఇది శూద్రభూస్వాములకు రుచించలేదు.  బెల్చి(బీహార్), కారంచేడు (ఆంధ్రప్రదేశ్ )లలో దళితుల మీద  శూద్ర భూస్వాములు చేసిన దాడులు దీని పర్యవసానమే.

ఈ సమయంలో  ఇందిరా గాంధీని బలహీన పరిచేందుకు  కాంగ్రెస్ శూద్ర భూస్వాములంతా పనిచేశారు.  కాంగ్రెస్ సిండికేట్ నిండా శూద్ర నాయకులే ఉన్నారు. ఈ కసితోనే వారు శూద్ర రెడ్డి భూస్వామ్య కులానికి చెందిన నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి చేసి ఇందిరా గాంధీకి కళ్లెం వేయాలనుకున్నారు. అయితే, దేశంలో పెరుగుతున్న పారిశ్రామిక సంపన్న వర్గం శూద్రుల ప్రయత్నాలకు గండికొట్టింది.  శూద్ర నేత సంజీవరెడ్డి రాష్ట్రపతి కాలేక పోయారు.  ఇందిరాగాంధీ మద్దతు తెలిపిన బ్రాహ్మణ అభ్యర్థి వివి గిరి రాష్ట్రపతి అయ్యారు.

తర్వాత  శూద్రనేతలు   ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్  ఏర్పాటు చేసిన జనతా పార్టీలో చేరారు. వీళ్ల కృషి ఫలితమే మండల్ కమిషన్. అపుడు బ్రాహ్మణుల పార్టీ అయిన జనసంఘ్ జనతా లో భాగమయినా మండల్ కమిషన్ ను కు మద్దతు నీయకతప్పలేదు. ఎపుడైతే జనతా పార్టీ చీలిపోయిందో జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా కొత్త అవతారమెత్తింది. తొలినాళ్లలో బిజెపి శూద్ర అనుకూల విధానమే అనుసరించింది.   అపుడు శూద్రులలో ఉన్న ముస్లిం వ్యతిరేక, దళిత వ్యతిరేక శక్తులు శూద్రులలోకి   హిందూత్వ భావజాలాన్ని మోసుకుపోయేందుకు బిజెపికి సహకరించారు. దీనివల్లే  ఒబిసి హిందూత్వీకరించేందుకు బిజెపి తీవ్రంగా కృషి చేయడం మొదలుపెట్టింది.

దీనికి బాబ్రి మసీద్, రామాలయం వివాదాన్ని చాలా బాగా బిజెపి తెలివిగా వాడుకుంది. ఆర్ ఎస్ ఎస్ , బిజెపి రెండుకలసి  చదువురాని శూద్ర యువకులను బాబ్రి మసీద్, రామాలయం చుట్టూ సమీకరించాయి.  బాబ్రి మసీదును కూల్చేసిన విజయ గర్వాన్ని ఈ వర్గాలకు అందించాయి. ఈ వర్గాలకు జై శ్రీరాం అనే నినాదం కూడా ఇచ్చాయి. ఇదంతా చివరకు 2014లో బిజెపి అఖండ విజయంతో అధికారంలోకి వచ్చేందుకు దోహద పడింది. ఇపుడు శూద్ర పార్టీలన్నీ రాష్ట్రాలకు పరిమితమయిపోతే, బ్రాహ్మణలు హిందూత్వ పార్టీ దేశం మీద పట్టు సంపాదించింది.  ఇదీ ఐలయ్య  చేసిన వాదన. భారతరాజకీయాల పరిణామాలను గమనిస్తున్న వాళ్లంతా తప్పక చదవాల్సిన పుస్తకం.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *