ఒక ఉద్యమకారుడి భార్య కన్నీటి సందేశం…

(ఇఫ్టూ ప్రసాద్ పిపి)

గౌతమ్ మృతి వార్తపై నిన్న రాత్రి మిత్రలోకానికి తెలిపిన సంతాప వర్తమానం తెలిసిందే.

గౌతమ్ మృతి సమయంలో విజయవాడకి 120 కిలో మీటర్ల దూరంలో పార్టీ సంస్థాగత పని మీద ప.గో. జిల్లాలో వున్నాం. పై విషాదవార్తకి ప్రతిస్పందించి, పార్టీ రాష్ట్రకమిటీ ప్రతినిధివర్గం గా ఏర్పడి ఈరోజు ఉదయం 8గంటల లోపు విజయవాడ చేరింది.

గౌతమ్ భౌతికకాయం వద్ద నివాళులు అర్పించింది. ఈ కరోనా కాలంలో సైతం సుమారు 200 మందితో ఓ సంతాప సమావేశం జరిగింది. ఈ కాలంలో అదో అసాధారణ సభయే! అనేక సంస్థలు, సంఘాలు హాజరై సంతాప సందేశాలు ఇచ్చారు. పొలారి లేదా మరొకరు వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయొచ్చు. వాటిలోకి నేను వెళ్లడం లేదని స్పష్టం చేస్తున్నా.

ఈ రోజు భర్త భౌతికకాయం ఎదుట శోకతప్తురాలైన “దుర్గ” ఏడుస్తూ ఆయాచితంగా మాట్లాడిన మాటల్లో ఓ నిగూఢ సందేశం దాగివుంది. అది గ్రహించడంతో పాటు, గ్రహింపజేయాల్సిన సందేశమని భావించాను. ఈ ముఖ్యాంశాన్ని (catching point) నలుగురికి వెల్లడించే ఏకైక ఉద్దేశ్యంతో ఈ చిన్న పోస్ట్ ని పెడుతున్నాను.

గౌతమ్ భౌతికకాయం పై మా ప్రతినిధివర్గం దండలువేసి నివాళులు అర్పించే సమయం లో అక్కడే ఇంటి మెట్ల మీద కూర్చొని గౌతమ్ భార్య దుర్గ నీరసించిన స్థితిలో వెక్కివెక్కి ఏడుస్తోంది. మా నివాళుల కార్యక్రమం పూర్తి అయ్యాక ఓదార్పు కోసం దుర్గ దగ్గరకు వెళ్ళాను.

దుర్గతో నా గత నలభై ఏళ్ల సుదీర్ఘ ఆత్మీయ అనుబంధం గుర్తుకు వచ్చింది. బహుశా దుర్గకు కూడా ఈ ప్రసాదన్నయ్యతో గత నలభై ఏళ్ల ఆత్మీయ అనుబంధం గుర్తుకొచ్చి ఉంటుంది కాబోలు! అంతవరకూ వెక్కివెక్కి ఏడ్చే దుర్గలో ఒక్కసారిగా దుఃఖం కట్టలు తెంచుకుంది. తాను బావురుమంటూ భోరున విలపించింది.

యాంత్రికంగా ఓదార్పడం నా అభిమతం కాదు. “ఏడవవద్దు దుర్గా” అనడం అన్యాయమని నా మనసుకు ఆ క్షణంలో తోచింది. భర్తతో 43 ఏళ్ల తన జీవిత అనుబంధం మిగిలించిన ఎన్నో, ఎన్నెన్నో తియ్యటి జ్ఞాపకాలను గుర్తుచేసుకునే ఉద్విగ్నభరిత క్షణాలవి. వాటిని బయటకు వ్యక్తీకరించడానికి ఇంతకంటే మించిన సరైన సమయం దుర్గకు దొరుకుతుందా? అట్టి న్యాయమైన కన్నీళ్లు కళ్ళ నుండి కార్చవద్దని చెప్పే హక్కు నాకు ఉందా? ఆ సమయంలో అవి “ప్రజాస్వామిక కన్నీళ్లు” గా నా మనసుకు అనిపించాయి.

“ఏడవవద్దు దుర్గా, కన్నీళ్లు కార్చొద్దు దుర్గా” అంటూ ఓదార్చ జూడటం “అప్రజాస్వామిక చర్య” గా అనిపించింది. ఓదార్పు యాంత్రికంగా కాకుండా, సజీవంగా ఉండాలి కదా! కొద్దిసేపు దుర్గను కన్నీళ్లు కార్చనివ్వాల్సిందే! అవి బయటకు రావాల్సిందే! అప్పుడే కదా, హృదయభారం తగ్గి తేలికపడేది. ఆ క్షణాల్లో ఈ అన్నయ్య బాధ్యత దుర్గను తేలికపరచడమే కదా!

తన మనస్సుకు కిటికీలు బంద్ చేస్తే, ఓదార్పు ఎలా అవుతుంది? ఆ క్షణాల్లో మనస్సును లాకౌట్ చేయడం కాకుండా, దానికి వెంటిలేషన్ కోసం కిటికీలు, గవాక్షాలు ఉండాల్సిందే! దుర్గ మనస్సుకు ఉక్కపోత స్థితి నుంచి అప్పుడు ఉపశమనం కలిగించాల్సిందే!

కన్నీళ్లు కేవలం బలహీనతకు మాత్రమే నిదర్శనం కాదు. అవి కొన్నిసార్లు మానసిక బలాన్ని ఇస్తాయి. మనస్సులో కుమిలి కుమిలి ఏడ్చి బాధను లోపల అణిచిపెట్టుకోవడం ద్వారా పాందే మానసిక వత్తిడిని దింపుకొని, కొత్తగా మానసిక స్థిరత్వాన్ని పొందే బలవర్ధక సాధనంగా కూడా కన్నీళ్లు పని చేస్తాయి. శోకతప్తులకు ఒక స్వేచ్ఛ ఉండాల్సిందే! తమ ప్రియతమ ఆప్తుల ఎదుట తృప్తితీరా ఏడ్చేందుకు కొంత సేపు స్వేచ్ఛ ఉండాల్సిందే! 43 ఏళ్ల జీవిత అనుబంధాన్ని కోల్పోయిన సమయం దుర్గది. ఆమె మనస్సుని కకావికలం చేసే సమయమది. రోగులు, దుర్బలులకు పోషకాహారం ఎలాంటిదో, దుర్గ వ్యక్తీకరించే కన్నీళ్లు కూడా అలాంటివే!

ఈ క్షణాన ఆప్తులు, ఆత్మీయుల ఎదుట కన్నీళ్లు కార్చే అవకాశం కొద్దిసేపు ఇవ్వడమే దుర్గకు ఓ బలవర్ధక ఆహారాన్ని ఇవ్వడం! అందుకే “దుర్గా ఏడవకు” అనే ఓదార్పు మాటలు అనకుండా ఏడవడానికి స్వేచ్ఛ కల్పించాను. ఆ స్వేచ్ఛతో దుర్గ బొటబొట రాల్చే కన్నీటి బొట్ల మధ్య తన మనస్సులో దాగిన మాటలెన్నో నా ఎదుట మాట్లాడగలిగింది. అందులోని ఓ క్యాచింగ్ అంశం గూర్చి పేర్కొనడానికే ఈ రైటప్!

“నేను మన పార్టీ పని పూర్తిగా చేయలేక పోయినా, నీవైనా చేయాలి దుర్గా అని గౌతమ్ ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేవాడని నీకు తెలుసు అన్నయ్యా! పొద్దున్నే ఇంటి నుండి వెళ్లి, ఒక్కోసారి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి అయ్యేది అన్నయ్యా! ఐనా ఒక్కరోజు కూడా గౌతమ్ నిరుత్సాహ పరచలేదన్నయ్యా! మహిళా సంఘం (POW-నా జోడింపు) మీటింగ్ కై ఏఊరు వెళ్లినా, ఎన్నిరోజులు ఉండాల్సి వచ్చినా, ఎందుకనే మాట గౌతమ్ నోటి నుంచి ఒక్క రోజు కూడా రాలేదన్నయ్యా! గౌతం నోటి నుండి పార్టీ పని చెయ్యి చెయ్యు అనే మాటలు తప్ప, వద్దువద్దు అనే మాటలు ఒక్క రోజు కూడా రాలేదన్నయ్యా”!

దుర్గను ప్రశ్నలు అడిగితే ఇచ్చిన జవాబు కాదిది. లేదా భర్త మరణం తర్వాత భర్తతో జ్ఞాపకాలను గూర్చి చేసిన ఇంటర్వ్యూ వంటిది కాదు. ఇది ఆయాచితంగా శోకంతో వ్యక్తం చేసిన మాటలివి. నేడు దుర్గ కనుకొలుకుల నుండి జలజలా రాలిపడుతోన్న కన్నీటి భాష్పాలు చెప్పిన మాటలివి. పై వాక్యాల్లో ఒక గొప్ప నిగూఢ రాజకీయ సందేశం దాగి ఉంది. అదేమిటంటే, గౌతం రక్తంలో పితృస్వామ్య ఆధిక్యతా భావజాలం లేదనేదే! స్త్రీలపై పెత్తనం చేసే పురుషాధిక్యత ఏ కోశానా లేదనేదే! దుర్గ కన్నీటి చుక్కల మధ్య నోటి నుంచి ఆయాచితంగా పలికిన పలుకులే అందుకు ప్రబల నిదర్శనం.

నేటి పితృస్వామ్య సామాజిక వ్యవస్థలో పురుషుల భావాలు, ఆలోచనలు కమ్యూనిస్టులపై కూడా ఎంతో కొంత ప్రభావం పడతాయి. తాము పార్టీలో, ఉద్యమాలలో పనిచేస్తూ, తమ భార్యల్ని, కూతుర్లను పార్టీ పనికి ప్రోత్సహించలేని కోవ లోని వాళ్ళు కొందరుంటారు. తాము పూర్తి స్థాయిలో పార్టీ లో ఫుల్ టైమర్లుగా పని చేస్తూ, తమ ఇళ్లల్లో స్త్రీలను పాక్షికంగా పని చేసే స్థాయికి ప్రోత్సహించే కోవలోని వాళ్ళు మరికొందరు వుంటారు. ఈ రెండూ కాకుండా ఇద్దరూ కలిసి ఉద్యమాల్లో పని చేసే వాళ్ళు కూడా అరుదుగా వుంటారు. ఇవన్నీ కాకుండా తాము పార్టీలో ఫుల్ టైమర్లుగా పని చేయకుండా, తమ భార్యలను ఫుల్ టైమర్లుగా పనిచేయడానికి ప్రోత్సహించే కామ్రడ్స్ అత్యంత అరుదుగా వుంటారు. అట్టి అరుదుల్లో అరుదైన (Rarest rare) కామ్రడ్స్ కోవలోకి కామ్రడ్ గౌతమ్ వస్తాడు. కామ్రడ్ గౌతం కమ్యూనిస్టు ఉద్యమ లక్ష్యంతో హేతువాద ఉద్యమ ప్రచారాన్ని జోడించి, తనకు ఇష్టమైన మేజీషియన్ వృత్తిని అందుకు ఓ సాధనంగా ఎంచుకున్నాడు. అదేసమయంలో దుర్గను సీపీఐ ఎం.ఎల్. పార్టీలో పూర్తి స్థాయి లో పని చేయమని ప్రోత్సాహం ఇస్తూ వచ్చాడు. ఆయన ఇచ్చే ప్రోత్సాహంతో నిరాటంకంగా దుర్గ ఒకకాలంలో పార్టీ ఫుల్ టైమర్ గా పనిచేసింది. పార్టీ రాష్ట్ర కమిటీ 1992 తర్వాత కామ్రడ్ రమను విజయవాడ కి కేటాయించింది. ఆ నేపద్యంలో దుర్గ పార్టీ ఫుల్ టైమర్ గా చాలా ఏళ్ళ పాటు పని చేసింది. అది గుర్తుకొచ్చి ఈరోజు దుర్గ ఆయాచితంగా మాట్లాడటం గమనార్హం.

గత నాలుగేళ్లుగా తాను అనారోగ్య స్థితిలో వుండి కూడా దుర్గను పార్టీ మరియు POW కార్యక్రమాలకు ప్రోత్సహించే వాడు. గత నాలుగు నెలలుగా మంచం మీద నుండి కదలలేని నిస్సహాయస్థితిలో ఉండి కూడా కార్యక్రమాలకు వెళ్లాల్సిందిగా ప్రోత్సహించాడు. ఆ జ్ఞాపకాలు దుర్గ మదిలో మెదిలి పై మాటలు పలికి ఉంటుంది.

నేటి పురుషాధిక్యత, పితృస్వామ్య భావజాలాల్ని అధిగమించి ముందడుగు వేసిన గౌతం ఆదర్శాల్ని ప్రచారం చేద్దాం. వాటిని కన్నీటి చుక్కలు రాల్చుతూ దుర్గ ఆయాచితంగా ఇచ్చిన సందేశ ప్రాధాన్యతను ప్రాచుర్యం కల్పిద్దాం.

ఇది కూడా చదవండి

 

https://trendingtelugunews.com/top-stories/breaking/magician-gowtha-aks-gurunaidu-iftu-passes-away/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *