ఏకగ్రీవ ఎన్నికల్లో ప్రభుత్వం జోక్యమెందుకు?: ఇఎఎస్ శర్మ ప్రశ్న

(డాక్టర్ ఇఎఎస్ శర్మ)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయత్ ఎన్నికలలో, గ్రామాలు ఏకగ్రీవంగా తమ ప్రతినిధులను ఎన్ను కోవడాన్ని ప్రోత్సహిస్తున్నదనే వార్తను చూసాను.  ఈ విషయంలో ఈ క్రింద సూచించినట్లు నా అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాను.

పంచాయతీ ఎన్నికలలో తమ తమ ప్రతినిధులను ఎంచుకునే  విషయంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్య విధానాలను అనుసరించి జరగాలి.  వారి వారి ప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రజలు, తమ ఓటుహక్కును ఎటువంటి భయం లేకుండా ఉపయోగించుకోవాలి. ప్రతి గ్రామంలో తమ తమ సమస్యలను గుర్తించి, విపులంగా చర్చించి, ఆ సమస్యలకు ఎవరైతే సంతృప్తికరమైన పరిష్కారాలను కలిగిస్తారో, వారికే ప్రజలు తమ ఓట్లను ఇవ్వాలి.

అవకాశం ఉంటే, ఎన్నికలలో ఓట్లు అడిగే అభ్యర్థులు, రాతపూర్వకంగా, ఆ సమస్యల మీద  చిత్త శుద్ధితో పనిచేసి, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చినప్పుడే, ఓటర్లు వారికి తమ ఓట్లను ఇవ్వాలి.

ఇది రాజ్యాంగం కలిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజలకు ఉన్న ప్రాధమిక హక్కు. అటువంటి అమూల్యమైన హక్కును ఓటర్లు సక్రమంగా వినియోగించుకోవాలి.

గ్రామసభలు,  పంచాయతీ  సంస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు. ఈ సంస్థలకు రాజ్యాంగం ప్రత్యేకత కలిగించిన విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ,

గత ఆరేళ్లుగా, మేము కొంతమంది,  ‘జాతీయ ఎన్నికల ఫోరమ్’ ను స్థాపించి, ‘ప్రజా మేనిఫెస్టో’ ల ద్వారా, మీద సూచించినట్లు, ఓటర్లలో చైతన్యం కలిగించడానికి ప్రయత్నాలు చేయడం ఈ ప్రాంతంలో, గ్రామాలలో, నగరాలలో చాలామందికి తెలిసిన విషయం. ప్రలోభాలకు లొంగకుండా, ప్రజలు ఎన్నికలో బాధ్యతతో పాల్గొన్నప్పుడే, ప్రజాస్వామ్యం బలపడుతుంది.

ప్రజలకు ఎన్నికల సందర్భంగా చేస్తున్న ఈ విజ్ఞప్తిని పత్రికలు విస్తృతంగా ప్రచురిస్తారని ఆశిస్తున్నాను.

 

(డాక్టర్ ఇఎఎస్ శర్మ, భారతప్రభుత్వ మాజీ కార్యదర్శి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *