కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సోనియాగాంధీ వ్యక్తిగత రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆయన కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున 3:30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఫైజల్ పటేల్ వెల్లడించారు.
ఆధునిక చికిత్స అందించినా..
ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ తెల్లవారు జామున తన తండ్రి తుదిశ్వాస విడిచాడని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా అహ్మద్ పటేల్ గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 1వ తేదీన ఆయన ఆసుపత్రిలో చేరారు.

 

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 15వ తేదన ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. అత్యాధునిక వైద్య చికిత్సను అందించినప్పటికీ.. ఉపయోగం లేకుండాపోయింది. శరీర అవయవాలేవీ పనిచేయకపోవడం వల్ల ఆయన మరణించినట్లు కుమారుడు ఫైజల్ అహ్మద్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతల దిగ్భ్రాంతి..
ఈ సమాచారం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏఐసీసీ కోశాధికారిగా పనిచేస్తోన్న అహ్మద్ పటేల్‌కు గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అత్యంత కీలక నేతగా గుర్తింపు పొందారు అహ్మద్ పటేల్. ఆయన స్వరాష్ట్రం గుజరాత్. రాజీవ్ గాంధీ హయాం నుంచి ఆయన కాంగ్రెస్‌తో ఉన్నారు. గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు. ఏఐసీసీ కోశాధికారిగా పని చేశారు. మూడుసార్లు లోక్‌సభ ఎన్నికయ్యారు. అయిదుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు.

 

 

 

26 ఏళ్ల వయస్సులోనే లోక్‌సభకు..
అత్యంత చిన్న వయస్సులో లోక్‌సభలో అడుగు పెట్టిన నేతల్లో అహ్మద్ పటేల్ ఒకరు. 26 సంవత్సరాల వయస్సులోనే ఆయన లోక్‌సభు ఎన్నికయ్యారు. 1977లో తాను ఎదుర్కొన్న తొలి లోక్‌సభ ఎన్నికలోనే ఘన విజయాన్ని అందుకున్నారు. గుజరాత్‌లోని భరూచ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అహ్మద్ పటేల్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా అయిదుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తల్లో ఒకరిగా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *