పోగాలం దాపురించింది, అందుకే కళా వెంకట్రావు అరెస్ట్: చంద్రబాబు

టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావును అరెస్ట్ చేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.కొన్ని రోజులు కిందట వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రామతీర్థం సందర్శించినపుడు ఆయన కారు మీద దాడి జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర అని వైసిపి విమర్శిస్తూ వస్తున్నది. ఈ దాడికి సంబంధించిన కేసులోనే ఈ రాత్రి మాజీ హోం మంత్రి అయిన కళా వెంకట్రావ్ ను పోలీపులు అరెస్టు చేశారు. ఆయననుచీపుర్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు.

ఆయన వ్యాఖ్యలు:

వివాద రహితుడు, సౌమ్యుడు అజాతశత్రువు కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ నిర్బంధం ఆటవిక చర్య.

రాత్రి 9గంకు 65ఏళ్లు పైబడిన నాయకుడిని అరెస్ట్ చేయడం రాక్షస చర్య.

ఏ నేరం చేశాడని మాజీ హోం మంత్రి కళా వెంకట్రావును అరెస్ట్ చేశారు..? రామతీర్థంలో రాముడి తల నరికివేస్తే, చూడటానికి వెళ్లడమే నేరమా..? దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల విధ్వంసాన్ని ఖండించడం ఆయన చేసిన తప్పా?

కళా వెంకట్రావు అరెస్ట్, వైసిపి కక్ష సాధింపునకు పరాకాష్ట. జగన్ రెడ్డి ఉన్మాదం పరాకాష్టకు చేరింది.

పోగాలం దాపురించింది కాబట్టే ఇలాంటి సైకో చేష్టలకు, కిరాతక చర్యలకు జగన్ రెడ్డి పాల్పడుతున్నారు.

రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, ప్రాధమిక హక్కులను యధేచ్చగా కాలరాస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో ఏపిని జంగిల్ రాజ్ గా మార్చారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఫాసిస్ట్ పాలనలో ఉన్నామా..?
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి 83రోజులు జైల్లో పెట్టారు. మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి 54రోజులు జైల్లో పెట్టారు. యనమల రామకృష్ణుడిపై తప్పుడు కేసు పెట్టారు. అయ్యన్నపాత్రుడిపై తప్పుడు కేసు పెట్టారు. రాష్ట్రంలో బిసి నాయకత్వాన్ని లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారు.

అవినీతి కుంభకోణాల్లో తాను జైలుకు వెళ్లాను కాబట్టి, ఏదో ఒక తప్పుడు కేసులో ఇరికించి టిడిపి వాళ్లను కూడా జైళ్లకు పంపాలని చూడటం జగన్ రెడ్డి సైకో మనస్తత్వానికి అద్దం పడుతోంది.

జగన్ రెడ్డి చేస్తున్న రాక్షస చర్యలకు రాష్ట్ర ప్రజలే బుద్ది చెబుతారు. బిసిలంతా ఏకమై వైసిపికి తగిన గుణపాఠం చెబుతారు.
తక్షణమే కళా వెంకట్రావును బేషరతుగా విడుదల చేయాలి. ఆయనపై తప్పుడు కేసులను వెంటనే ఎత్తేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *