బిజెపి రాబడి బాగా పెరిగింది, 2018-19 ఆదాయం రు. 2410 కోట్లు

కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన  భారతీయ జనతా పార్టీ  దేశ రాజకీయ పార్టీలో అత్యంత సంపన్నమయిన పార్టీగా ఎదిగింది. ఈ పార్టీ  2018-2019 లో రు. 2410.08 కోట్ల ఆదాయం చూపించింది. ఇందులో రు.1,005.33 కోట్ల ఖర్చు చేసింది. అంటే 41.71 శాతం మాత్రమే ఖర్చయిందన్నమాట.
ఇది బిజెపి ఎన్నికల కమిషన్ కు సమర్పించిన ఆడిటెడ్ రిపోర్టులోని సమాచారం. ఆరు జాతీయ పార్టీలు, బిజెపి, కాంగ్రెస్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ వాది పార్టీ, సిపిఐ, సిపిఎంలు తమ ఆడిటెడ్ నివేదికలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రఫార్మ్స్ (ADR) విశ్లేషించింది. ఈ సంస్థ పూర్తి నివేదిక ఇక్కడ ఉంది.
ఇక కాంగ్రెస్ పార్టీ రు. 918.03 కోట్ల ఆదాయంతో రెండోస్థానంలో నిలబడింది. వసూలు చేసిన మొత్తంలో కాంగ్రెస్ పార్టీ రు. 469.92 కోట్లు (51.10శాతం) మాత్రం ఖర్చు చేసింది. బెంగాల్ కు చెందిన ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వార్షికాదాయం రు.192.65 కోట్ల. ఈ పార్టీ ఖర్చ చేసింది కేవలం 11.50 కోట్లు (5.97 శాతం) మాత్రమే.
సిపిఎం రాబడి 2018-19 సంవత్సరంలో 100.96కోట్లు. ఇందులో రు.76.14 కోట్లు ( 75.43 శాతం) ఖర్చు చేసింది.
బిజెపి, కాంగ్రెస్, సిపిఎం, బిఎస్ పి, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐల మొత్తం రాబడి రు. 3,698.66కోట్లు. ఈ మొత్తాన్ని దేశమంతా చందాల రూపంలో సేకరించారు. ఇందులో ఒక్క బిజెపి వాటయే 65.16 శాతం (రు.2410.08 కోట్లు) కాంగ్రెస్ వాట 24.82 శాతం ( రు.918.03 కోట్లు)
2017-18, 2018-19 మధ్య భారతీయ జనతా పార్టీ విరాళాలు 134.59శాతం (రు.1382.03కోట్లు)పెరిగాయి.
కాంగ్రెస్ విరాళాలు 360.97 శాతం (రు.718.88 కోట్లు ) పెరిగాయి. 199.15 కోట్ల ఉన్న రాబడి 2018-19లో రు.918.03 కోట్ల రుపాయలకు పెరిగింది.
ఇదే కాలంలో తృణమూల్ కాంగ్రెస్ అదాయం విపరీతంగా పెరిగింది. 2017-18లో ఈ పార్టీ అధాయం కేవలం రు.5.16కోట్లు మాత్రమే. ఇది 2018619లో అమాంతం అంటే 3628.47 శాతం రు.192.65 కోట్లకు పెరిగింది. సిపిఐ రాబడి 361.29 శాతం పెరిగింది. 2017-18లో ఈ పార్టీ రాబడి రు.1.55 కోట్లు మాత్రమే. 2018-19లో ఇది 7.15 కోట్ల కు పెరిగింది.
భారతీయ జనతా పార్టీ పెట్టిన ఖర్చులో అత్యధిక భాగం రు. 792.39 కోట్లు ఎన్నికలకు, ప్రచారానికి పోయింది. పార్టీ అడ్మినిస్ట్రేషన్ కు రు. 178.35 కోట్లు ఖర్చయ్యాయని ఈ పార్టీ ఆడిట్ నివేదికలో పేర్కొంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రు. 308.96 కోట్లు ఖర్చు చేసింది. పార్టీ నిర్వహణకు రు. 125.80 కోట్లు ఖర్చయ్యాయి. సిపిఎం పార్టీ నిర్వహణకు రు.35.04 కోట్లు ఖర్చు చేస్తే, బిఎస్ పి రు. 33.11 కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేసింది.
రాజకీయ పార్టీలు విరాళాలను, స్వచ్ఛంద విరాళాలను అందుకుంటూ ఉంటాయి. ఇందులో ఎక్కువ మొత్తం విరాళాల రూపంలోనే వచ్చింది.