మంత్రివర్గ విస్తరణలో అనూహ్య నిర్ణయం తీసుకున్న జగన్

అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడు నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం మంత్రివర్గ విస్తరణ. జగన్ క్యాబినెట్ లో అడుగుపెట్టే అదృష్టవంతులు ఎవరో అంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే క్యాబినెట్ లో మంత్రులు వీరేనంటూ సోషల్ మీడియాల్లో కొన్ని పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా రెండుసార్లు వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన నేతకు జగన్ మంత్రి పదవి ఫిక్స్ చేసినట్టు పార్టీ అంతర్గత సమాచారం. ఇప్పటికే రెండుసార్లు పరాజయం పొందిన ఆ నేతను ఎమ్మెల్సీ పదవి కల్పించి మంత్రిత్వశాఖలోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ నేత ఎవరంటే దివంగత సీఎం వైఎస్సార్ కి సన్నిహిత శిష్యుడైన మోపిదేవి వెంకట రమణ.

మోపిదేవి వెంకట రమణ రేపల్లె నియోజకవర్గం నుండి వైసీపీ తరపున గత రెండు ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓటమి చవి చూసారు. వైఎస్సార్ హయాంలో 2009 లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో ఈయన కూడా ఆరోపణలు ఎదుర్కొని పదహారు నెలలు జైలు జీవితం గడిపారు. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుపై దుష్ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఎంతలా అంటే ఆయన సొంత ఊరులో కూడా ఆయనపై వ్యతిరేకత నెలకొంది.
అయితే పాదయాత్ర సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తే మోపిదేవికి రాజకీయంగా పునర్వైభవం కల్పిస్తానని జగన్ మాట ఇచ్చినట్టు సమాచారం. ఈ కారణంతోనే జగన్ ఆయనకు క్యాబినెట్ లో చోటు కల్పించారని తెలుస్తోంది. అంతేకాదు, వైఎస్సార్ హయాంలో గ్రూపు రాజకీయాల జోలికి పోకుండా, ఆయనకు నమ్మకమైన శిష్యుడిలా వ్యవహరించేవారు మోపిదేవి. అందుకే వైఎస్సార్ కూడా బీసీ నేతలు ఎందరు ఉన్నప్పటికీ మోపిదేవికి ప్రత్యేక స్థానం కల్పించారు.