విశాఖపట్నమే ఇక రాజధాని .. ఇదే ఫైనల్

(కోపల్లె ఫణికుమార్)
జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.అనుమానాలకు తావులేకుండా విశాఖయే రాజధాని అని ప్రకటించింది.
జగన్ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగానే ముందుగా క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రైతులకు ఊరటగా రెండు మూడు నిర్ణయాలు కూడా తీసుకుంది. పనిలో పనిగా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్ రాజధానిగా జగన్ చేసిన ప్రతిపాదననే క్యాబినెట్ ఆమోదించింది.
రైతులకు ఉపయోగపడటమంటే చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏడాదికి జరీబు రైతులకు రూ. 50 వేలు, మిగిలిన రైతులకు రూ. 30 వేలు కౌలును పదేళ్ళ పాటు చెల్లించాలని డిసైడ్ చేసింది. ఆ కౌలు కాలపరిమితిని 15 ఏళ్ళకు పెంచేందుకు డిసైడ్ చేసింది. అలాగే రైతుల సంక్షేమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 11 వేల రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
సరే క్యాబినెట్ నిర్ణయాలన్నది జగన్ ఆలోచనల ప్రకారమే జరిగిందని అర్ధమైపోతోంది. అలాగే తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా క్యాబినెట్ ఆమోదించినట్లే సిఆర్డీఏ చట్టం రద్దు, రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విడదీయటం, విశాఖపట్నం, అమరావతి, కర్నూలును మూడు రాజధానులుగా ప్రతిపాదిస్తు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి బిల్లులను ప్రవేశపెట్టారు.
సరే అసెంబ్లీలో అధికారపార్టీ అనుకున్నట్లుగానే ప్రతి వ్యవహారం జరుగుతుందని కొత్తగా చెప్పక్కర్లేదు. అధికార పార్టీ చేసే ప్రతి వ్యవహారాన్ని ప్రతిపక్షం వ్యతిరేకిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు బుగ్గన ప్రవేశపెట్టిన బిల్లుల విషయంలో టిడిపి కూడా ఇదే చేస్తోంది.