ప్రతి చిన్న పనికి రోజూ పోరాటమే చేస్తున్నా: కోటంరెడ్డి

ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రతీ సమస్య పరిష్కారానికి నిరంతరం పోరాటం చేయాల్సి వస్తున్నదని, దీనికి బెదిరేది లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

శ్రీధర్ రెడ్డి నేడు నియోజకవర్గంలోని కొత్తూరు, మన్సూర్ నగర్లో పర్యటించారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన  20 మంచినీటి బోర్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మంచినీళ్ల సమస్య ఉపశమనానికి ఆయన శ్రీకారం చుట్టారు. కొత్తూరు, శ్రీలంక కాలనీ, మన్సూర్ నగర్, అంబాపురం అరుంధతీయవాడలో 4 మంచి నీటి బోర్లను ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యేలకు ఒక్క పైసా గ్రాంటు లేదు. ఆఫీసర్లు నుంచి సహకారం అందదు.ప్రతి పనికి అధికారుల చుట్టూ అటెండర్ లాగా తిరుగుతున్నా. అయినా సరే ప్రజల కోసం పోరాడతాను

ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి గ్రాంటు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేల పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉందని అంటూగా అధికారులనుండి తమకు  ఆశించిన సహకారం అందడం లేదని, చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కూడా అధికారుల చుట్టూ అటెండర్ లాగా  తిరగాల్సి వస్తుందని శ్రీధర్ రెడ్డి అన్నారు. అందుకే నిరంతరం పోరాడాల్సి వస్తున్నదని ఆయన చెప్పారు.

రూరల్ నియోజకవర్గంలోని విలీన గ్రామాలు, శివారు కాలనీలలో కనీస వసతుల కల్పనకు వివిధ వర్గాల ద్వారా శక్తికి మించి పోరాడుతున్నానని చెప్పారు. శివారు కాలనీలలో రాబోయే వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని 20 చోట్ల మంచినీటి బోర్లు దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని, అడిగిన వెంటనే స్పందించిన దాతలకు ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.

ప్రభుత్వం ఉండగా, ప్రజలకు అత్యవసరమయిన మంచినీటి సమస్యను తీర్చేందుకు దాతలను ఆశ్రయించాల్సి రావడం దురదృష్టమని ఆయన అన్నారు. ఈ పరిస్థితి పోవాలని, పోతుందని ఆయన హామీ ఇచ్చారు.

వేసవి దృష్టిలో పెట్టుకుని మంచినీటి సమస్య  ఉపశమనానికి తీవ్రంగా కృశిచేస్తున్నందుకు, గతంలో తమకు ఇచ్చిన మాట నిలుపుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని  స్థానికులు అభినందించారు.
‘మన ఎమ్మెల్యే – మన ఇంటికి’ 105 రోజుల ప్రజా బాటలో భాగంగా ప్రజల కోరిక మేరకు మార్చిలోపు మంచినీటి బోర్లు వేయిస్తామని ఆయన  మాట ఇచ్చారు.  నాడు  ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా స్నేహితులు, శ్రేయోభిలాషుల సహకారంతో  బోర్లు వేయించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కాలనీ వాసులు  అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *