అనుకున్నదంతా అయ్యింది …. రెండు సంవత్సరాలుగా అనేక వార్తలతో చిన్న చిన్న వీడియో బిట్ల తో ఎంతో హైప్ క్రియేట్ చేసి ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా కవరేజ్ లతో ఊరించిన సాహో చివరికి నిరాశ పరిచింది. ‘యాంటీ క్లైమాక్స్” అంటే ఇదే!
సినిమా చూసిన తర్వాత గౌతమ బుద్ధుడు చెప్పిన ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. “ ఆశించడం ఎప్పుడూ నిరాశకు కారణం అవుతుంది!”. దర్శక,నిర్మాతలు (హీరో కూడా?!), ప్రేక్షకులు ఎన్నో అశలు పెట్టుకున్న సాహో సినిమా ఇటు ప్రేక్షకుల ను,సినిమా తీసిన వాళ్లను నిరాశపరిచే అవకాశాలే ఎక్కువ! దానికి తోడు బాహుబలి అఖండ విజయంతో ప్రభాస్ కు ఏర్పడిన ఒక ఇమేజ్ కూడా ఉంది. ప్రేక్షకుల నిరాశకు ఇవి ముఖ్యమైన కారణాలు కావచ్చు.
” రన్ రాజా రన్” అని చిన్న(ఖర్చు, కాస్టింగ్ పరంగా) సినిమాని పెద్దగా తీసిన సుజిత్ ” సాహో” లాంటి పెద్ద (మళ్ళీ ఖర్చు, కాస్టింగ్ పరంగా నే) సినిమాను చిన్నగా తీశాడు అనిపిస్తుంది. ప్రభాస్ కు ఈ కథ బాహుబలి టైం లో నే బాగా నచ్చిందట! అందుకే రెండేళ్ల తర్వాత సినిమా తీయటం జరిగింది. కథా పరంగా చూస్తే అంత అద్భుతమైనదేమి కాదు. పోనీ కథనం, లేదా స్క్రిప్ట్ పక్కాగా ఉందా అంటే అదీ లేదు. దర్శకుడు బాగా అనుభవమున్నవాడ అంటే, అదీ లేదు. ఒక్క సినిమా అదీ రొమాంటిక్ థ్రిల్లర్. (దాదాపు 4 కోట్ల బడ్జెట్ తో తీసిన “రన్ రాజా రన్ ” 20 కోట్ల దాకా వసూలు చేసింది!!) వయసు కూడా పాతిక పైన, అంతే! (సినిమా మొదలు పెట్టినప్పుడు). మొదటి సినిమా 2014 లో వచ్చింది. రెండో సినిమా సాగదీయబడి 2019 లో వచ్చింది. మరి అంత సమయం తీసుకున్న సుజిత్ సినిమాను ఇలా తీయటం విచిత్రమే! అందరికి ఇదో పజిల్!
సినిమాలో ఒక చోట ప్రభాస్ తో శ్రద్ధ “అన్నిప్రశ్నలకు జవాబులు నీ దగ్గర ఉన్నాయి” అంటుంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత వివిధ వర్గాల నుంచి వచ్చే చాలా ప్రశ్నలకు ప్రభాస్ దగ్గర కాని దర్శకుడు సుజిత్ దగ్గర గాని ఉండే అవకాశాలు తక్కువ! ఒక ముఖ్యమైన ప్రశ్న ఇలాంటి సినిమాకు 350 కోట్లు అవసరమా? అన్నది.
కాసిన్ని కోట్ల ఖర్చుతో పెళ్లి చూపులు, గీత గోవిందం, జెర్సీ, మజిలీ, ఓ బేబీ సినిమాలు తీసి విజయవంతమైన నేపథ్యంలో ఇంత ఖర్చు పెట్టి ఒక్క సినిమా తీయడం అవసరమా? అన్నది. ఏమాటకామాట చెప్పుకోవాలంటే 350 కోట్లతో ఒక సంవత్సరం అంతా ఎన్నో చిన్న సినిమాలు తీయవచ్చు. మరొక ప్రశ్న ఏంటంటే పెద్ద సినిమాలు తీసి, థియేటర్లన్నీ ఒక్క సినిమా కే ఇచ్చేస్తే చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? అన్నది. ఇంకా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఫలితానికి నేరుగా దర్శకుడు సుజితే కారణం! ఒక సాధారణమైన (అజ్ఞాతవాసి చాయలు ఉన్న) కథకి ఇంటర్వెల్ ట్విస్ట్, మధ్య మధ్యలో కొన్ని ట్విస్టులను జోడించి భారీ ఖర్చుతో సినిమా తీయడం ప్రేక్షకుల ఊహా శక్తిని, తెలివి తేటలను తక్కువ అంచనా వేయటమే! ఈ మధ్యకాలంలో వచ్చిన అనేక థ్రిల్లర్లు ప్రేక్షకులను బాగా ఎడ్యుకేట్ చేశాయి. పైగా అందులో కొన్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్లు ఉన్నాయి. ఈ సినిమాలో ట్విస్ట్ లు, మలుపులు చాలా సాధరణమైనవి, సగటు ప్రేక్షకులు కళ్ళు మూసుకుని చెప్పగలిగేవి.
ఈ సినిమాలో కనిపించినన్ని కార్లు ఇంతవరకు ఏ తెలుగు సినిమాలోనూ కనిపించి వుండవు. అలాగే ధ్వంసం చేయబడిన కార్లు కూడా! నిజానికి సినిమాకు అయిన ఖర్చు లో ఎక్కువ భాగం వీటి కోసమేనట.. ఇక సినిమా మొత్తం చిత్రీకరించిన ప్రదేశాలు అందమైన లొకేషన్ లే అయినప్పటికీ బాగా ఖర్చు పెట్టించినవి. ఈ సినిమాలో ఉన్న నటీనటుల పారితోషికం కూడా ఖర్చును బాగా పెంచి ఉండవచ్చు.
ఈ సినిమా మొత్తం ఎంతోమంది హిందీ నటులు ఒకరిద్దరు తమిళ నటుల తో నిండిపోయింది. అసలు ఈమధ్య సినిమాల్లో నే కనిపించని హిందీ నటుడు” చుంకీ పాండే” ను మెయిన్ విలన్ గా తీసుకోవడం ఒకింత ఆశ్చర్యమే! ఇంకా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్ ,మహేష్ మంజ్రేకర్, టిను ఆనంద్ లాంటి వారు కూడా ఉన్నారు. మరో సర్ ప్రైజ్ ఏంటంటే యాంకర్ గా, దూరదర్శన్ ఒకప్పటి సీరియల్ ” శాంతి” లో ప్రధాన పాత్రధారి మందిరా బేడి! ఇక హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ఎలాగూ ఉంది. అలాగే నవాబ్ (మణిరత్నం సినిమా) సినిమాలో మెరిసిన తమిళ నటుడు అరుణ్ విజయ్. ఇక జూనియర్ ఆర్టిస్టులు 90 శాతం విదేశీయులే!
ఈ సినిమాలో హిందీ నటుల్లో కొంతమంది బాగానే చేసినప్పటికీ ప్రభాస్ శ్రద్ధ ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. ఇక కథను నడిపించిన విధానం కూడా గందరగోళం సృష్టించింది తప్ప సాఫీగా సాగలేదు. కొన్ని సన్నివేశాలు లేకుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తాయి. మరికొన్ని సాగదీసినట్లు కనిపిస్తాయి. శ్రద్ధా వల్ల ఈ సినిమాకు ఒరిగిందేమి లేదు. ఒకట్రెండు పాటల్లో కొంత ఇబ్బంది కరమైన దుస్తులు ధరించింది. అనవసరమైన చోట్ల పాటలు ఉండటం వల్ల కొంత టెంపో పోయింది. జాక్వెలిన్ ఫెర్నాన్డ్ జ్ ఐటం సాంగ్ కు పెట్టిన ఖర్చు దండగే! పైగా కొంత వల్గర్ గా కూడా ఉంది ఆ పాట చిత్రీకరణ.
సినిమాలో గ్రాఫిక్స్ కూడా అంత గొప్పగా ఏం లేవు. దానికి కారణం విజువల్స్ లో ఒరిజినల్ కి ప్రాధాన్యతనివ్వటం. నిజమైన కార్లు వాడటం వల్ల అలా అనిపిస్తుంది.
సస్పెన్స్ పోతుందని కాదు కానీ, కథ గురించి చెప్పాల్సింది ఏమి లేదు. అప్పటికప్పుడు రాసుకున్నట్లు (కొన్ని సినిమాల కలయికతో) అనిపిస్తుంది. దర్శకుడి ప్రతిభ గురించి చెప్పటానికి కూడా ఏమి లేదు. ఎందుకంటే సినిమా మొత్తం ఛేజ్ లు, ఫైట్లు, పాటలు ఉన్నాయి. ప్రభాస్ కు ఇలాంటి పాత్రలు (రొమాంటిక్, కామెడీ షేడ్స్ ఉన్నవి) అంతగా సరిపోవు. ఫైట్ల వరకు ఓకే. బాహుబలి లో ప్రభాస్ తప్ప మరెవరు సరిపోరు అన్నది నిజం. ఆ సినిమా వేరు. కానీ ఇక్కడ వేరు. ఆ ఇమేజ్ కూడా ప్రభాస్ ను ఇబ్బంది పెట్టిందనవచ్చు.
ఈ మధ్య (సినిమా విడుదలకు ముందు) ప్రభాస్, శ్రద్ధా, నీల్ తదితరులు సినిమా ప్రమోషన్ కోసం “ది కపిల్ శర్మ షో” లో వచ్చారు. ఒక సందర్భంలో కపిల్ ప్రభాస్ ను కొన్ని ప్రశ్నలు అడిగి ” నేను ప్రభాస్ సార్ తో నాలుగు డైలాగులు చెప్పించాను” అని అన్నాడు. ఎందుకంటే ప్రభాస్ తక్కువగా మాట్లాడతాడని (బయట) ప్రచారంలో ఉంది. ప్రభాస్ నటన గురించి పెద్దగా చెప్పటానికి ఏమి లేదు. ఎందుకంటే ఆ పాత్రను దర్శకుడు సరిగ్గా తీర్చి దిద్దలేదు. అయితే ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ అభిమానులకు కొంత ఊరట. అలాంటి సీన్లు కొన్ని ఉన్నాయి. అంతకు మించి ప్రభాస్ గురించి చెప్పుకునేంతగా (బాహుబలి లో లా) ఆ పాత్రను మల్చకపోవటం దర్శకుడి అనుభవరాహిత్యాన్ని సూచిస్తుంది. ఈ సినిమా మరో రెండు అంశాలను తెరమీదికి తీసుకొస్తుంది. ఒకటి టికెట్ల ధర పెంచడం. రెండు పైరసి. ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమా కావడం వల్ల ఆ మాత్రం ధర లేకపోతే ఎలా అని సమర్థించుకున్న ప్పటికీ అది పైరసీ కి దారి తీస్తుందని నిర్మాతలు, దర్శకులు అర్థం చేసుకోవాలి.
ప్రపంచంలో అతి ఎక్కువ సినిమాలు తీసి విడుదల చేసే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి జాతీయ స్థాయి సినిమాలు, నాణ్యమైన సినిమాలు ఎక్కువగా ఎందుకు రావడం లేదు? అన్నది. మరి ఇంత ఖర్చు పెట్టి సినిమాలు తీసినా అవి ఆడకపోతే ఎలా? అన్నది. సినిమా కూడా కళాత్మక వ్యాపారమే. సినిమా సరిగ్గా ఆడకపోతే ఎంతోమంది ఇబ్బంది పడతారు.
బాహుబలి లాంటి సినిమాలు వేరు, సాహో లు వేరు అని ప్రేక్షకులకు అర్థం అయ్యింది.. తీసేవాళ్ళకే అర్థ కాలేదని తెలియ చేసిన సినిమా సాహో … సారీ సా… హా!