పార్లమెంటు పోటీపై రేవంత్ రెడ్డి క్లారిటీ

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు, ప్రజలు ఉహించినదానికి భిన్నంగా వెలువడ్డాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలు పరాజయం పాలవడం ఆ పార్టీ శ్రేణుల్ని, నేతల అభిమానుల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఓటమి అందరిని షాక్ కి గురి చేసింది. ఇటు తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లోని రేవంత్ అభిమానులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

దీనిపై పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఇక రేవంత్ కూడా ఈవీఎం టాంపరింగ్ జరిగిందని, టీఆరెస్ పార్టీ ఎన్నికల ముందు అక్రమాలకు పాల్పడిందని, తన ప్రత్యర్థి పట్నం నరేందర్ రెడ్డి పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రేవంత్ రెడ్డి కొద్దిరోజులు మౌనం వహించారు. ఆయన మౌనం కాంగ్రెస్ శ్రేణులను, అనుచరులను, అభిమానులను ఆందోళనకు గురి చేసింది. రేవంత్ రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా చర్చలు సాగాయి. రేవంత్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటూ ఆయన తదుపరి కార్యాచరణ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారింది.

రేవంత్ అనుచరులు, సన్నిహితులు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని రేవంత్ పై ఒత్తిడి కూడా తెచ్చారు. రేవంత్ ఎంపీ గా పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడి నుండి ఎన్నికల బరిలోకి దిగుతారు? అనే ప్రశ్నలపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ అంశాలపై తాజాగా క్లారిటీ వచ్చినట్టు కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి అందుతున్న సమాచారం.

రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం అయిందని ఆయన సన్నిహితులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయమై ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయనకీ క్లారిటీ ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల టాక్. మొదట  రేవంత్ మహబూబ్ నగర్ లో పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారని చర్చ నడిచింది. కానీ ఆయనను మల్కాజిగిరి లేదా ఖమ్మం స్థానాల్లో ఏదో ఒకచోట పోటీ చేయించే యోచనలో హై కమాండ్ ఉన్నట్టు రేవంత్ సన్నిహితులు చెబుతున్న మాట.

ఈ విషయమై ఇప్పటికే అధిష్టానం పెద్దలు రేవంత్ తో ప్రాధమిక చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. రేవంత్ పోటీ పై పూర్తి స్థాయిలో క్లారిటీ రాకపోయినా అధిష్టానం ఆదేశిస్తే తాను ఖచ్చితంగా పోటీలో ఉంటానని, లేని పక్షంలో రాష్ట్రం వ్యాప్తంగా పార్టీ తరపున ప్రచారం చేస్తానని రేవంత్ అధిష్టానానికి తెలిపినట్టు సమాచారం. ఖచ్చితంగా పోటీ చేయాలి అంటే ఖమ్మం పార్లమెంటు బరిలో దిగడానికి రేవంత్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికల్లో టీఆరెస్ ప్రభంజనానికి ఖమ్మం జిల్లా అడ్డుకట్ట వేసింది. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఒక స్థానానికే టీఆరెస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లాలో ఖమ్మం పార్లమెంటులో రేవంత్ రెడ్డి పోటీ చేస్తే సునాయాసంగా గెలవొచ్చని ఆయన అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు రేవంత్ అభిమానులు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *