దేశమంతా ‘పుల్వామా…పుల్వామా’ వినిపిస్తుంది, పుల్వామాలో మాత్రం…

బ్యానర్లు లేవు, హోర్డింగులు లేవు, పోస్టర్లు లేవు, ర్యాలీలు, సభలు సమావేశాలు కనిపించవు. నినాదలేవీ వినిపించవు. ఎన్నికల ప్రచారం ఎక్కడా జరగడం లేదు.

సాధారణంగా ఎన్నికలపుడు ఉండే సందడి పుల్వామా  రోడ్ల మీద లేనే లేదు. నిజానికి రోడ్లమీద ప్రయివేటు వాహానాలకంటే బుల్లెట్ ప్రూఫ్, యాంటి మైనింగ్ సైన్యం వాహనాలే ఎక్కువగా ఉన్నాయని ది హిందూ రాసింది.

ఎన్నికల కార్యక్రమం కేవలం పార్టీల కార్యాలయాలకే పరిమితం అయింది. అది కూడా చాలా మెుక్కుబడిగా ఉంది. మే ఆరోతేదీన పోలింగ్ కు పోతున్న పుల్వామా జిల్లా పరిస్థితి ఇది. ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగాలలో తరచూ వినపడే మాటల్లో పుల్వామా మొదటిది, ఆ తర్వాత వచ్చేది బాలకోట్.

ఈ రెండు మాటలను క్యాంపెయిన్ లో ప్రయోగించరాదని సుప్రీంకోర్టు స్సష్టం చేసినా ప్రధాని మోదీ, బిజెపిఅధ్యక్షుడు షా ఇద్దరు ఈ మాటలను మంత్రాల్లా ప్రయోగిస్తూనే ఉన్నారంటే అవి ఎంత శక్తి వంతమయిన శబ్దాలో అర్థం చేసుకోవచ్చు.

దేశమంతా పుల్వామా పూనకం తెచ్చేందుకు ప్రధాని మోదీ, షా ప్రయత్నిస్తున్నారు. ఈ ధోరణికి ఎన్నికల కమిషన్ దాదాపు వత్తాసు పలికింది. పుల్వామా బాలాకోట్ మాటలను వాడటం ఏమంత పెద్ద తప్పుకాదు, ఎన్నికల నియమాలను ఉల్లంఘించడం కాదని ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది.

క్యాంపెయిన్ లో బిజెపినేతలు బహిరంగంగా చెప్పినా, చెప్పకపోయినా, దేశమంతా ఈసారి జరుగుతున్నవి పుల్వామా ఎన్నికలే.

అయితే, కాశ్మీర్ అనంత్ నాగ్ లోక్ సభ నియోజకవర్గంలో భాగమయిన పుల్వామా మాత్రం నిశబ్దంగా ఉంది. ఎన్నికలతో తన కేమీ సంబంధం లేదన్నట్లు పుల్వామా నిర్లిప్తంగా ఉంది. ఈ నియోజకవర్గంలో పోలింగ్ మూడు దఫాలుగా జరపాలని నిర్ణయించారు.

దేశంలో ఒక లోక్ససభ నియోజకవర్గంలో మూడు దఫాల పోలింగ్ జరుగుతున్నది అనంత్ నాగ్ జిల్లాలోనే. మే ఆరున మూడో దఫా పోలింగ్ పుల్వామా ప్రాంతంలో జరుగుతున్నది.

తమాషా ఏమిటంటే  పుల్వామాలో  బిజెపి ఉనికి నామమాత్రంగానే ఉంది.సోఫీ యూసఫ్ అనే వ్యక్తిని  అభ్యర్థిగా నిలబెట్టినా పోటీలో లేని పార్టీ బిజెపియే. దేశమంతా పుల్వామారంగు పులుముతున్న పార్టీకి పుల్వామాలో చోటే లేదు.

ఈ ఏడాది మిలిటెంట్ కార్యకలాపాల వల్ల ఈ ప్రాంతంలో 169 మంది చనిపోయారు. ఇందులో సైనికులున్నారు, మిలిటెంట్లున్నారు, పౌరులున్నారు. వారంతా కుల్గామ్, పుల్వామా, ఫోసియాన్,అనంత్ నాగ్ జిల్లాల వారే. ఈ జిల్లాలన్నీ అనంత్ నాగ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి.

అనంత నాగ్ జిల్లా మూడు దశల పోలింగ్ లో  ఏప్రిల్ 23న మొదటి దఫా పోలింగ్ ముగిసింది. ఏప్రిల్ 29 కుల్గామ్ లో రెండో దఫా పోలింగ్ జరిగింది. ఇపుడు మే 6న షోపియాన్,పుల్వామా జిల్లాలలో పోలింగ్ జరుగుతూ ఉంది.

అనంత్ నాగ్ నడుస్తున్నది ముక్కోణపు పోటీ. ఈ  పోటీలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, కాంగ్రెస్ తరఫున గులామ్ అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున హస్నెయిన్ మసూది అనే మాజీ హైకోర్టు జడ్జి ఉన్నారు. పోటీ వీరి మధ్యే నని మీడియా రాస్తున్నది ఉంటున్నది.  బిజెపి తరఫున సోఫీ యూసఫ్ పోటీలో ఉన్నా అది లెక్కలో లేదని డిఎన్ ఎ అంటున్నది.

అనంత్ నాగ్ లోక్ సభ నియోజకవర్గంలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో 11 పిడిపి చేతిలో ఉన్నాయి. 2014 ఎన్నికల్లో లోక్ సభ స్థానం కూడా పిడిపికే దక్కింది. మిగతా అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ చెరో రెండు స్థానాలు గెల్చుకున్నాయి. ఒక స్థానంల్ సిపిఎం అభ్యర్థి గెలిచాడు.

ఫుల్వామాలో ఫిబ్రవరి 14 సైన్యం కాన్వాయ్ మీద టెర్రరిస్టు దాడి జరిగిందాకా పుల్వామా అనే మాట ఎవరికీ బయట తెలియదు. ఈదాడిలో 40 మంది సిఆర్ పిఎఫ్ జవాన్లు మృతిచెందారు. తర్వాత ప్రతీకారంగా భారత దేశం పాక్ లోని బాలాకోట్ మీద దాడి జరిపింది. రెండు దేశాలమధ్య యుద్ధవాతావరణ నెలకొంది. ఈ సంఘటన తర్వాత వచ్చిన ఎన్నికల్లో పుల్వామా కేంద్రబిందువయింది.

అయితే, పుల్వామా మాత్రం ఎన్నికల వాతావరణ కాదు, ప్రశాతత కోరుకుంటున్నది. ప్రజలెవరీకీ వోటింగ్ మీద పెద్దగా ఆసక్తి లేదు. పుల్వామా ఏరియాలో వోటింగ్ శాతం బాగా పడిపోతుందని రాజకీయ పార్టీల కార్యకర్తలే చెబుతున్నారు.

‘‘ ఎన్నికలంటే ప్రజల్లో ఉదాసీనత కనబడుతూ ఉంది. రాజకీయ పార్టీలకు తెలుసు. అందుకే వాళ్లెవరు పోలింగ్ రెండంకెల స్థాయికిచేరుకుంటుందని అనుకోవడంలేదు. ఇక్కడ ఇంత హింస చెలరేగింది. ఇక్కడ వోటింగ్ జరుగుతుందని అనుకోవడం లేదు. పుల్వామా బయట భారతదేశంలో జాతీయ సమస్య కావచ్చు. ఇక్కడ మాకు కాశ్మీరే సమస్య. దీనికి పరిష్కారం కావాలి,’అని తారిక్ అహ్మద్ అనే వ్యక్తి చెప్పినట్లు ది ట్రిబ్యూన్ రాసింది.
పోలింగ్ 5 శాతం దాటదని అంతా చెబుతున్నారు. ఇక్కడ పిడిపి తరఫున  పోటీ చేస్తున్నమాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముప్తి  పుల్వామా నుంచే క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించనే లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *