ఊరేదయినా కళకళలాడాలనే ఈ ఒంగోలు అమ్మాయి గురించి విన్నారా?

ఆ మధ్య ఒరిస్సా కలెక్టరొకాయన వార్త లకెక్కారు.
చాలా మంది కలెక్టర్ల లాగా తన విధులు తాను చక్కగా నిర్వర్తించడానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతల మీద ఆసక్తి చూపడం మొదలుపెట్టారు.
ఆయనలో ఉన్న మంచి మనిషి ఆయన్ని కలెక్టారాఫీసుకు, పేరుకు పోయిన ఫైళ్లకు, రివ్యూ మీటింగ్ లకు,సైట్ విజిట్ లకు పరిమితం చేయకుండా ఆయన్ని వీధిలోకి, జనం మధ్యకు,పొలాల్లో నాట్లేసే కూలీల మధ్య కు లాక్కెళ్లాడు .
మన తెలుగు వాళ్లెక్కువగా ఉండే బరంపురంలో ఆయన గోడలను చూసి బాధపడ్డారు. వూరంటే సుందరంగా ఉండాలి, నాలుగు రోడ్ల పొడవునా అటూ ఇటూ చూసుకుంటూ నడుచుకుంటూ పోవాలనిపించాలి.
కాని బరంపురంవీధుల్లో గోడలన్నీ పోస్టర్లతో నిండిపోయి వూరుని వికారంగా మార్చాయి. ఇది ఆయన్ని బాధించింది. అదేవూర్లో టీమ్ క్లీన్ సిటి (TCC) అనే పేరుతో కొంత మంది కుర్రవాళ్లు ఈ పోస్టర్లను పీకేసి వూరిని సుందరంగా కాకపోయినా, శుభ్రంగా ఉంచేందుకు కష్టపడుతున్నారని తెలిసింది.
ఎస్, ఇదే ఇపుడు చేయాల్సిన పని అని కలెక్టర్ విజయ్ కులంగే  అనుకున్నారు.
ఇది కూడా చదవండి:సౌదీ మహిళలు ఇక సొంతంగా ట్రావెల్ చేయవచ్చు, కొత్త చట్టం
వెంటనే ఆ టీమ్ తో కలసి వీధుల్లో దూకి గోడల మీద ఉన్న పోస్టర్లను పెరికేయడం మొదలుపెట్టారు. చాలా రోజులు ఆయన పొద్దునే మార్నింగ్ వాక్ లో ఉన్నపుడు పోస్టర్లు చించేయడం ఒక అలవాటు చేసుకున్నారు. కలెక్టరే ఈ పని చేస్తూండటంతో చాలా మంది సిగ్గుతో బిక్కచచ్చి టిసిసి ఉద్యమంలో చేరక తప్పలేదు.
కాని మన తెలుగమ్మాయి ‘తేజస్వి పొడపాటి’ మొదలు పెట్టిన ఉద్యమం అలా పూలబాటలాగా సాగ లేదు.
అవినీతి, అక్రమాలు, క్రమశిక్షణారాహిత్యం, సివిక్ సెన్స్ లేకపోవడం వంటి రుగ్మతలు  ముదిరిన సమాజంలో మంచిపని చేయడం కూడా కష్టమే అని ఆమె అనుభవం చెబుతుంది.
అందునా పవర్ లెస్ మనిషి మంచిపని చేయడానికి కూడా అనర్హుడే.దీనికి చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఎంతో తెగింపు ఉండాలి, నిబ్బరం ఉండాలి. ఓపిక ఉండాలి. చుట్టూర వెనక్కులాగే వాతావరణమే ఉంటుంది.
ఈ ఓపిక,నిదానం,నిబ్బరం, కమిట్ మెంట్, పోరాట పటిమ,పట్టుదల…అన్నింటినిక ఒక చోట కుప్పపోస్తే చక్కని  తేజస్వి లాగా అవుతుంది.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన తేజస్వి చక్కగా హైదరాబాద్ హైటెక్ సిటీలో తిరుగుతూ సాయంకాలాల్లో ఏ జిమ్ లోనో, పబ్ లోనో, పార్కల్లోనో,అదీ  కాకపోతే లెక్కలేకుండా పుట్టుకొచ్చిన మాల్స్ లో తిరుగుతూ కాలక్షేపం చేస్తూ హయిగా ఉండవచ్చు.
అయితే, ఒంగోలుకు చెందిన తేజస్వికి ఒడిషా కలెక్టర్ కు వచ్చిన ఆలోచనే వచ్చింది. ఏమిటీ వూరు? ఈ  రోడ్లేమిటి?  ఎటూ చూసినా ఈ చెత్త ఏమిటి?   వూర్లోని గోడలన్నీ పోస్టర్లతోఎందుకిలా  అందవికారంగా మారిపోయాయని   ఆమె ముందు ఒక ప్రశ్నార్థకం నిలబడింది.
తన శక్తి మేరకు వూరుని రూపుదిద్దే పని చేస్తే ఎలా ఉంటుందో చూద్దామనుకుంది. అంతే మొదట సొంతవూరు ఒంగోలులో ఈ పని మొదలుపెట్టింది.
అయితే, ‘పవర్ లెస్’ మనిషికి మంచిపని చేయడం కూడా ఎంతకష్టమని తెలిసొచ్చెందుకు ఎంతో కాలం పట్టలేదు.
ఆమె సొంత డబ్బులతో వూరును శుభ్రం చేసేందుకు పూనుకుంటే అడ్డంకులు, డిస్కరేజింగ్ మాటలు… సహాయనిరాకరణ.. అన్నీ అమెకు అడ్డొచ్చాయి.
అయినా తేజస్వి వెనకంజవేసే రకమే కాదు. వూర్లోని గోడల మీద ఫంగస్ లాగా దట్టంగా పేరుకు పోయిన పోస్టర్లను సొంతఖర్చుతో చించేసి వాటి మీద అందమయిన చిత్రాలు గీసే పనికి పూనుకుంది.
ఆమెకు ఒక టీమ్ తయారయింది.
హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నా వారాంతంలో మూడువందల కి.మీ దూరాన ఉన్న ఒంగోలుకు వెళ్లి తన కార్యక్రమంలో మునిగిపోయేది. దీనికోసం ‘భూమి పౌండేషన్’ అని ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసింది. దీని రిజస్ట్రేషన్ కు ఆమె పడరానిపాట్లు పడ్డారు.
” I thought I was doing a good job, performing my duties as a conscious citizen.I hoped everything would be perfect with Bhoomi. But, corruption at every level of governance proved to be a huge hindrance for us,” అని తేజస్వి తన యాత్ర ఎంత గతకుల రోడ్డు మీద సాగుతూఉందో effortsforgood.org చెప్పారు.
తన జీతంలో 70 శాతం ఆమె పని కోసం కేటాయించిన అడ్డంకులు తప్పలేదు.
భూమి ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ అంత సాఫీగా సాగలేదు. రిజిస్ట్రేషన్ పేపర్ వర్క్ మాగ్జిమమ్ ఒకటి రెండు రోజులు కంటే ఎక్కువ పట్టకూడదు. అయితే, రిజస్ట్రేషన్ ఆఫీసు వాళ్లు మూడు నెలలు తిప్పుకున్నారు. ఎందుకో అర్థమయిదిగా. అయినా సరే తేజస్వి నిరుత్సాహ పడలేదు. అవినీతి మార్గంలో వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించాలనుకోలేదు. ఎంతజాప్యమయినా సరే వేచిచూడాలనుకున్నారు.
ఇది  ఆమెకెదురయిన పాలనా అవ్యవస్థ సమస్యయితే, సమాజంలో కూడా ఆమె ఇలాగా ఛేదు అనుభవాలే ఎదురయ్యాయి.
తేజస్వి తన టీమ్ తో ఒంగోలులో  పార్క్ ముందున్న చెత్తను ఎత్తేయడం, గోడలమీద పోస్టర్లు చించేసి ఆక్కడ కుడ్య చిత్రాలను గీయడం చేస్తుంటే… మొదట్లో స్పందన రాలేదు.
ఆమె ఒక మంచి పని మొదలు పెట్టింది, అందులోచేరలేకపోయినా నిరుత్సాహపరిచేలా ‘అబ్బే దీంతో ఏం లాభం లేదండి,’ అనేవాళ్లు తయారయ్యారు.
అందరి కళ్లెదుటే పార్కుముందున్న చెత్తని వాళ్లు ఎత్తేసి శుభ్రం చేస్తే, వెంటనే మళ్లీ పోగయ్యేది. తేజస్వి బృందం చేస్తున్న పని చూశాక కూడా చట్టుపక్కల ఉండే మనుషుల్లోసివిక్ సెన్స్ మొలకెత్తలేదు. మనసంత మరుభూమిగా మారిపోయిందన్నమాట.

https://trendingtelugunews.com/gold-facts-what-is-negative-tolerance-in-purity-of-gold-fineness/

అయినా సరే, తెజస్విటీమ్ జంకలేదు. వాళ్లూ చెత్త వేస్తూంటే వీళ్లు తీసే వాళ్లు.
ఈ దాగుడుమూతలు జనాలకు విసుగొచ్చి చెత్తవేయడం మానేసే దాకా కొనసాగాయి.
వూరినంతాఇలా తేజస్వి అనే టెకీ పిల్ల  సొంత ఆర్మీ తయారుచేసుకుని శుభ్రం చేయడమేమిటో అని  సేవాభావం అంటే చిన్నచూపుండే కార్పొరేషన్ కు అర్థమయ్యేది కాదు.
చదవుకున్నమ్మాయి ఇలా చేస్తుంటే కార్పొరేషన్ వాళ్లకు కళ్లుపోయాయా అని ఎవరైనా అంటారేమోననే భయమేమో తెలియదు, మొదట్లో వీరి కృషి పట్ల వాళ్లకెవరి సానుభూతిలేకుండా ఉండింది.
నిజానికి భూమి ఫౌండేషన్ లో చిందులేస్తూ చేతులుకలిపి, ఇంకా ప్రజలనుకూడా ఆహ్వానించి కార్పొరేషన్అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంగా తీర్చి దిద్ది ఉండాలి. అయితే దానికి  బదులు తేజస్వి బ‌ృందం వేసిన కుడ్య చిత్రాల మీద సున్నం కొట్టి  కనిపించకుండా చెరిపేసి ఆనందం పొందేవారు.  గోడలమీద మునిసిపాలిటీ సున్నం పడగానే  దాని మీద మళ్లీ పోస్టర్లు రావడం మొదలయింది.
ఏ మాత్రం సహకరించని వీళ్లని దారికి తెచ్చుకునేందుకు తేజస్వి చాలా కష్టపడ్డారు.
మందుబాబుల్తో కూడా సమస్యే…
ఒక సారి ఏమయిందంటే…తాము చేస్తున్న పనికి మరింత మెరుగుదిద్దేందుకు తేజస్వి ప్రయత్నించారు. శిల్పారామంలో ఆకృతుల ప్రేరణతో తేజస్వీ అందమయిన మొక్కలున్న భారీ పూలకుండీలను హైదరాబాద్ లో కొని ఒంగోలుకు తీసుకు వెళ్లి అక్కడ బాగా రద్దీ గా ఉండే రోడ్డులో అమర్చి కళకళలాడించాలనుకుంది.
అయితే, ఆమె ఉత్సాహం ఎంతో కాలం నిలవలేదు. కొత్త సంవత్సరం కాటేసింది. న్యూయర్ పార్టీ పేరుతో తెగ తాగేసిన జులాయీలు మైకంలో వాటన్నింటిని ధ్వంసం చేసిపోయారు  ఈ విషయం గుండెల్ని పిండేసే ఆవేదన మిగిలించింది మన వాళ్లకి.
అయినాసరే, ఈ దారిన  దూసుకుపోవడమే తప్ప వెనక్కురాకూడాదని తేజస్వి ఎపుడో నిర్ణయించుకుంది.
ఇపుడు ఆమె టీం హైదరాబాద్ లో కూడా కార్యక్రమాలు చేపట్టింది.
టీమ్ తేజస్వి!  కంగ్రాట్స్.
ఆమె కృషి అందరిలో మంచి పౌరుని మేల్కొల్పాలని, అమె ఆశయం ప్రజాఉద్యమంగా సాగాలని కోరుకుందాం.