రేపు నామినేషన్ వేయనున్న కర్నూలు ‘రెండు రుపాయల డాక్టర్’

(నీలి మహబూబ్ బాష)

ప్రముఖ సంఘ సేవకుడు, ‘రెండు రుపాయల డాక్టర్’ గా పేరున్న వైద్యుడు, వెనకబడినవర్గాలలో రాజకీయ చైతన్యం కోసం క్యాంపెయిన్ చేస్తున్న డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్ ఇపుడు జనం మధ్యకు వచ్చారు.

కర్నూలు లోక్ సభ స్థానానికి ఆయన శుక్రవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేస్తున్నారు. ఇంతవరకు ఆయన సంఘసేవ కార్యక్రమాలు నిశబ్దంగా సాగుతూ వచ్చాయి. చేనేత కార్మికులకు జీవనోపాధి పటిష్టంచేసేందుకు, పేదలకు మెరుగైన వైద్యసదుపాయం చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు, పేద విద్యార్థులకు ఆదుకునేందుకు  మాత్రమే పరిమితమయిన ఉండేవి. ఇపుడాయన ప్రజారాజకీయాల్లోకి వస్తున్నాడు. ఆయన నిస్వార్థ సేవలు, సలహాలు ఇక ముందు కర్నూలు లోక్ సభ నియోజకవర్గంలోని లక్షలాది మందికి అందుబాటులోకి రానున్నాయి. ఎంబిబిఎస్, ఎంఎస్, ఎంసిహెచ్ లతో పేరుపొందిన ఒక ఉన్నత విద్యావంతుడు రాయలసీమ లో ప్రత్యక్షరాజకీయల్లోకి రావడం ఇదే మొదటిసారి.

పార్లమెంటులో మాట్లాడాలంటే ఇంగ్లీష్, హిందీ తెలుసుండాలి. ఈ భాషలు తెలిసిన వాళ్లే రాణిస్తారు. ఈ రెండింటిలో ధారాళంగా డాక్టర్ సంజీవ్ మాట్లాడతాడు. అందువల్ల ఆయన పార్లమెంటులో వెనకబెంచీలో కూర్చుని పది నిమిషాల్లో బయటకు పోయే బాపతు కాదని ధైర్యంగా చెప్పవచ్చు. పార్లమెంటులో కర్నూులు గొంతు ఎపుడూ వినబడిందో ఎవరికీ గుర్తులేదు.గత 30 సంవత్సరాలలో నయితే వినిపించలేదు. డాక్టర్ సంజీవ్ వెళితో పార్లమెంటునుంచి కర్నూలు మంచి వార్తలు వింటూ వుంటుంది.

పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు, కర్నూల్ తప్పకుండా గుర్తింపు వస్తుందన వచ్చు. 80 శాతం మంది మన ఎంపిలు పార్లమెంటులో మౌనంగా కూర్చోవడ లేదంటే గొడవలపుడు కేకలేయడం తప్ప మరొకపని చేయరు. డాక్టర్ సంజీవ్ ఈ క్యాటగరి మనిషికాదు.

టికెట్ కోసం అంతా వెంపర్లాడుతున్నపుడు టికెటే డాక్టర్ సంజీవ్ ను వెదుక్కుంటూ వచ్చింది. సాధ్యమయినంత వరకు కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు, మేధావులను పార్లమెంటుకు పంపేందుకు చేస్తున్న తన ప్రయోగంలో భాగంగా జనం డాక్టర్ సంజీవ్ ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లోక్ సభకు పంపిస్తున్నారు.

డాక్టర్ సంజీవ్ ని కర్నూలు వంటి కీలకమయిన లోక్ సభ స్థానానికి ఎంపిక చేయడంలో జగన్ కుశాగ్రబుద్ధి అర్థమవుతుంది. తొలిపరిచయంలోనే డాక్టర్ సంజీవ్ జగన్ ను ఆకట్టుకుంటే, తొలి సంభాషణలోనే డాక్టర్ సంజీవే కర్నూలు కు సరయిన అభ్యర్థిని జగన్ గుర్తించారు.

గత 27 సంవత్సరాలుగా వైద్య సంఘ లతో  వేల మంది నిరుపేదల గుండె చప్పుళ్లను వింటూ,  రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనే లేని డాక్టర్ సంజీవ్ ను జనం ముందుకు తెచ్చిన ఘనత జగన్ ది.

3-1-1967 న కర్నూలు నగరంలో సంజీవ్ కుమార్ చేనేత కుటుంబంలో జన్మించాడు. 1971 – 1982 మధ్యకాలంలో కర్నూలు సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదవతరగతి వరకు చదువుకున్నాడు.

1982 – 1984 కర్నూలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియేట్, కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీనుండి 1990 లో MBBS గోల్డ్ మెడల్ తో పూర్తి చేశారు. 1995 లో MS జనరల్ సర్జరీ, ఇక, 2000 సం. లో MCh యూరాలజీ లో హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి సూపర్ స్పెషాలిటీ పట్టాను పొందారు. ఆయన డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి సింగరి శ్రీరంగం బట్టలవ్యాపారి అయినా ఆయన ఇంటినిండా డాక్టర్లే. ముగ్గురు కుమార్తెలు డాక్టర్లు. అంతేగాక కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మానవరాండ్లు కూడా డాక్టర్లే. వారి కుటుంబం 21 మంది డాక్టర్లను సమాజానికి అందించింది.

సంజీవ్ కుమార్ భార్య డాక్టర్ వసుంధర స్త్రీ వ్యాధి నిపుణురాలు. కూతురు సౌమ్య కర్నూలు గవర్నమెంట్ కాలేజీ లో MBBS పూర్తి చేశారు. 1995 నుండి 1998 వరకు కర్నూలు నరసింగరావు పేటలో “బెంగళూరు హాస్పిటల్” ను నిర్వహించారు. కేవలం రెండు వేల రూపాయలకే ఆపరేషన్లు చేసి “పేదల డాక్టరు”గా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. MCh యూరాలజీ సూపర్ స్పెషాలిటీ పట్టా పొందిన అనంతరం కర్నూల్ జిప్సన్ కాలనీలో “బెంగుళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్”ను పునః ప్రారంభించారు. యూరాలజీ మరియు ల్యాపరోస్కోపీ విభాగాలలో ప్రఖ్యాతి పొందారు. 2006లో వెంకటరమణ కాలనీలో అత్యాధునిక వసతులతో “ఆయుష్మాన్ ది ఫామిలీ హాస్పిటల్”ను స్థాపించారు. ఇది కార్పొరేట్ ఆస్పత్రి, కానీ ఫీజులు మాత్రం అందరికి అందుబాటులో ఉంటాయి. అదే ఈ ఆసుపత్రి ప్రత్యేకత.
పత్తికొండలో పాతపేటలో 7 ఎకరాల పెద్దల ఆస్తిని తండ్రి శ్రీ రంగం తన సోదరులతో కలిసి దాదాపు 150 నిరుపేద కుటుంబాలకు “భూదానం ” చేశారు. అలా ఏర్పాటైన ఆ కాలనీ ప్రస్తుతం “ఆంజనేయనగర్ ” గా అభివృద్ధి చెందింది. వెనుకబడిన వర్గాలను ఆదుకోని ఆదరించడంలో సంజీవ్ కుటుంబం ఎపుడు ముందుంటుంది.

డాక్టర్ సంజీవ్ కుమార్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు :
i. మిత్రులతో కలిసి గత 3 సం.లుగా అనాధ నిరాశ్రయ వృద్ధులకు నెలనెలా ఉచితంగా మందులు పంచడమే కాకా, 30 మంది అర్హులను గుర్తించి వారికీ నెలకు రూ. 1000/- చొప్పున పెన్షన్లు అందజేస్తున్నారు.

ii. గ్రామీణ వైద్యం కుంటుబడిన ప్రస్తుత పరిస్థితులలో విరివిగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ పలువురి ప్రశంసలందుకున్నారు. 2006 సం. నుండి జిల్లా వ్యాప్తంగా 416 ఉచిత మెడికల్ క్యాంపులలో, లక్షలాది రూపాయల ఖరీదు చేసే మందులను ఉచితంగా పంపిణి చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్బంగా తేదీ :02-10-2016 న కర్నూలు, కల్లూరు , కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ మరియు పత్తికొండలలో ఒకే రోజున 7 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుల ద్వారా సుమారు 7520 మందికి ఉచితవైద్యం అందించి రికార్డు నెలకొల్పారు.
iii. తేదీ : 15-08-2018న 72 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ” ఆనంద జ్యోతి సేవ ట్రస్ట్ ” ఆధ్వర్యంలో ” 100 ఉచిత క్యాంపులు – 500 ఉచిత ఆపరేషన్లు” అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంత వరకు 62 ఉచిత మెడికల్ క్యాంపులు ద్వారా 375 ఉచిత ఆపరేషన్లుచేసి పేదల గుండెల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించని వ్యాధులకు కూడా ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. ఈ పథకం ఇంకా కొనసాగిస్తున్నారు.

iv. మనిషిలో దాగిన శక్తిని వెలికి తీయటకు గల ఏకైక మార్గం ప్రోత్సాహకాలివ్వడం. ప్రతి సంవత్సరం పదవ తరగతి, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కోర్సులలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సహకాలు అందిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు. 2016 MBBS ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించిన మాచాని హేమలత గారికి మిత్రులతో కలిసి పౌర సన్మానం జరిపి ప్రతిభకు పట్టం కట్టారు.

v. నీటి వసతి లేక, తయారీ కర్మాగారాలు రాక, నిరుద్యోగం పట్టి పీడిస్తున్న కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతములో పలు ఉద్యోగ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు బాసటగా నిలిచారు.
vi. ప్రతిభావంతులైన విద్యార్థులకు బ్యాంకింగ్ మరియు సివిల్స్ ప్రవేశ పరీక్షల కొరకు కోచింగ్ ఇప్పిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.
vii. కర్నూలు వరదల సమయములో వందల మందికి ఆయుష్మాన్ ఆసుపత్రిలో ఆశ్రయం కల్పించి భోజన వసతి సమకూర్చారు. ఉచిత వైద్య సేవలు అందించారు. “ఆపద సమయాలలో వెన్ను తట్టి నిలిచి ఆదుకున్న వాడే నిజమైన మిత్రుడ”ని నిరూపించారు.
viii. కుల సంఘాలలో మరియు బలహీన వర్గాలలో ఐకమత్యం సాధించేందుకు ఆంధ్ర ప్రదేశ్ అంతటా పర్యటించి సంఘీయులను విశేషంగా చైతన్య పరిచారు.
ix. గత మూడు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వివాహ పరిచయ వేదికలు నిర్వహిస్తున్నారు.
x. కర్నూలు ఫోర్ట్ లయిన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. తన చుట్టూ ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలన్న మనస్తత్వం వారిది. కుల మతాలు, ఆర్ధిక స్తోమతలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు లలిత కళలలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. జిల్లా స్థాయి ఉద్యోగస్తుల పిల్లలు ఈ శిక్షణా తరగతులకు వస్తున్నారంటే శిక్షణా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇట్లాంటి సంఘసేవా నేపథ్యం ఉన్న వ్యక్తి కర్నూలు చరిత్రలో రాజకీయాల్లోకి రాలేదు. డాక్టర్ సంజీవ్ కు సేవాతత్పరత తప్పమరొక వ్యాపకం లేదు.

 

(నీలి మహబూబ్ బాష, సీనియర్ జర్నలిస్టు, కర్నూలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *