కోటి రుపాయలు ఖర్చు చేసి ఇలా నేల మీద పడుకున్న సిఎం

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన ముద్దుల కార్యక్రమం (గ్రామ వాస్తవ్య, జనతా దర్శనం) కొనసాగిస్తే, రాష్ట్రం దివాళా తీస్తుంది.
ఈ కార్యక్రమం కింద ఆయన యాద్గిర్ జిల్లా లోని చందర్కి గ్రామంలో ఒక రోజు రాత్రి బస చేశారు. ఒక రోజు గ్రామ వాస్తవ్యుడిగా జనం మధ్య గడిపితే జనం సాదక బాధకాలు తెలుస్తాయని ముఖ్యమంత్రి భావించారు.
అంతే, ఆఫీసర్లు ముఖ్యమంత్రి అంతటి వాడు ఒక రోజు ఒక పల్లెటూర్లో ఎలా బతకాలో అలా ఏర్పాట్లు చేశారు.
గత శుక్రవారం నాడు ఆయన చందర్కిలో ఒకపూట గడిపారు. దీనికయిన ఖర్చు చూస్తే, ఇక ఈ కార్యక్రమం వద్దు బాబోయ్ అనే పరిస్థితి ఉంది.
ఎందుకంటే, ఆ రాత్రి ఆయన బస కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం కోటి రుపాయలు. గ్రామంలో వాటర్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటుచేసేందుకు అయిన ఖర్చు రు. 35 లక్షలు.
అంతకు ముందు ఆయన కలబుర్గి తాలూకాలో హేరూర్ గ్రామంలో బస చేయాలనుకున్నారు. అక్కడ కూడా రు. 32 లక్షలు ఖర్చు చేసి ఒక వాటర్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటుచేశారు. అయితే, వర్షం రావడంతో ఆయన ఆ టెంటులో ఉంటూ హేరూర్ వాస్తవ్యుడి ఒక పూట గడిపే అవకాశం కోల్పోయారు.
ఈ సారి మరొక మూడు లక్షలు ఎక్కువ ఖర్చు చేసి చందర్కిలో టెంట్ పకడ్బందీగా వేశారు. 30 వేలమందికి మంచి భోజనాలు 21, 22 తేదీలలో రెండు సార్లు పెట్టారు. భోజనం చేస్తే మంచినీళ్లు కావాలిగా, జిల్లా యంత్రాంగం 75 వేల నీళ్ల పాకెట్లు కొనింది.
ఈ కార్యక్రమం కలర్ ఫుల్ గా ఉండాలి కాబట్టి , ఇది ఏర్పాటుచేసిన స్కూల్ కు మరమ్మతులు చేసి కొత్తగా కలర్ వేశారు. మాంచి టాయిలెట్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమం పల్లెటూర్లో జరిగినా జనం కావాలిగా. అక్కడున్న జనంతోనే సర్దుకుంటామంటే కుదరదు. అందువల్ల యాద్గిర్ జిల్లా కేంద్రం నుంచి కెఎస్ అర్టీసి బస్సులలో వేలాాదిగా తోలారు. భోజనాలకు వచ్చిన 30 వేల మంది ఈ బాపతే.
దీనికంతా అయిన ఖర్చు కోటి రుపాయలు. తమాషా ఏమంటే, ఈ కోటి రుపాయలతో చందర్కి నీళ్ల సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేది. ఎందుకంటే, చందర్కి వచ్చందే సమస్య లేవో తెలుసుకుని పరిష్కరించేందుకు.
జరిగిందేమిటీ, ముఖ్యమంత్రి వనబోజనం లాగా ఈ కార్యక్రమం సాగింది. ముఖ్యమంత్రి వచ్చారు పోయారు. చందర్కి నీళ్ల సమస్య గురించి ముఖ్యమంత్రి తెలుసుకున్నారో లేదో తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి టూర్లో నీళ్ల సమస్య కనిపించకుండా ఉండేందుకు అధికారులు ఫుల్ గా నీళ్లు సప్లయ్ చేశారు.
ఇక రద్దయిన హేరూర్ ప్రోగ్రాం గురించి కూడా రెండు ముక్కలు తెలుసుకోవాలి. హేరూర్ లో ముఖ్యమంత్రి కోసం వేసిన రు. 32 లక్షల టెంట్ గాలివానలో చిరిగిపోయింది. దాని ఖరీదును ప్రభుత్వమే చెల్లించాలి. అక్కడొక పదివేల మందికి భోజనాలు ఏర్పాటుచేశారు. దీని కోసం తెచ్చిన బియ్యం, పప్పులు, నూనె,రవ, సిలిండర్లు గాలివానలో కొట్టుకు పోయాయి. టెంట్ కింద పరిచేందుకు 60 చదరపు అడుగుల కార్పెట్ తీసుకువచ్చారు. అది వానలో పాడయిపోయింది. దాని కాస్ట్ నష్టపరిహారంగా ప్రభుత్వమే చెల్లించాలి.
ఇవి కుమారస్వామి కష్టాలు…
(ఫోటో:  ఇండియా టుడే)