Home Uncategorized గంటా మార్కు రాజకీయాలే వేరు…

గంటా మార్కు రాజకీయాలే వేరు…

178
0
SHARE

ఆంధ్రా మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజకీయ పసరువేది విద్య బాగా తెలుసు. రాజకీయాల్లో దేన్ని ముట్టుకుంటే బంగారవుతుందో,ఎవరిని పట్టుకుంటే పంటపండుతుందో బాగా తెలిసినోడు. పట్టువిడుపులు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పట్టుకున్నదంతా బంగారు కాప్తే, బంగారు కొనేయ గల సత్తావున్నోడు. అలాగే వదిలస్తే ఆయన వైజాగ్ లో మరొక టి.సుబ్బరామిరెడ్డి కాగలడు. అన్నట్లు వీరిద్దరు ఒకే జిల్లానుంచి వైజాగ్ వెళ్లి తిష్టవేసిన పోలిక  కూడా ఉంది.  ఈ మధ్య ఆయనేదో అలిగాడని, బాధపడ్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ సారి బీమ్లీలో గంట మోగకపోవచ్చని ఆంధ్రజ్యోతి, లగడపాటి సర్వేలో బయటపడిందని, ఇలాంటి నిజం రాసినందుకు ఆయన నిప్పులు గక్కుతున్నాడని ఏవేవో వార్తలొస్తున్నాయి. ఆయన తెలుగుదేశానికి వీరాభిమాని అన్నట్లుగా,  అదే పార్టీలో ఉంటూ కష్టాలు నష్టాలు పడేందుకు పూనుకున్న విధేయుడునట్లు, అలాంటి వ్యక్తి ఓడిపోతాడని రాసినందుకు బాధపడ్తున్నాడని రాసేశారు. ఇలాంటివాటికి ఆయన భయపడేవాడు కాదు. ఉన్న పార్టీలో తనకు గెలుపు రాదని తెలితే, మరొక పార్టీకి వెళ్తాడు. అక్కడ నుంచి గెలుస్తాడు. ఆయనను తీసుకోవడానికి రాష్ట్రంలో సిద్ధంగా లేని పార్టీ ఏది? అందువల్ల సర్వే గిర్వే అనేది నిజంగా జరిగింటే ఒకవిధంగా ఆయనకు మేలు చేసిందేమో. ఆయన కొత్త అడ్రసు వెదుక్కునేందుకు చాలా టైం కూడా ఉంది.

రాజకీయాల్లో ఆయన దూకుడు టిడిపి అభ్యర్థిగా  ‘అనకాపల్లి’ ఎంపీ సీటు ను గెల్చుకోవడంతో మొదలయింది. ఆ తర్వాత  పలుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నమొనగాడయ్యాడు.టిడిపి నుంచికాపు నేతగా మారి  ప్రజారాజ్యం వెళ్లాడు. టిడిపి ఇక గెలవదేమో అనుకుంటున్నపుడు ఆయన చిరంజీవివైపు వెళ్లాడు. చిరంజీవితో ఎక్కువకాలం ఉంటే  బండినడవదని తెలుసుకున్నవిజ్ఞాని. అందుకే కంపెనీ మెర్జర్ ప్రపోజల్ పెట్టి, చిరంజీవికి, తనకు,సి రామచంద్రయ్యకు లాభసాటిగా ఉండేలా బేరం పెట్టి విజయవంతమయ్యాడు. కాంగ్రెస్ లో కలిసిపోయాడు.  మంత్రయ్యాడు.  2014లో కాంగ్రెస్ పరిస్థితి కూడా బాగా లేకపోవడంతో  ఎటువోవాలో చిక్కు  సమస్య వచ్చింది. వైసిపిలోకా, టిడిపిలోకా… చక్కగా బేరీజు వేసుకుని తెలివిగా టిడిపిలోకి దూకి ఎమ్మెల్యే అయిన ఘనుడు.  ఆపై మంత్రి అయ్యాడు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు పొందాడు. అయితే, ఇపుడు టిడిపికి రాష్ట్రమంతా ఎదురుగాలి వీస్తున్నదని అర్జీసర్వేకి భిన్నంగా వైసిపి సర్వేలు చెబుతున్నాయి. అయితే, పరిస్థితి ఏమిటో గంటాకు బాగా తెలుసు. బీమిలిలో గంటా వోడిపోతాడని అంటే, టిడిపి వోడిపోతుందనే గా. సర్వే అసలు అర్థం తెలుసుకోలేనంత అమాయకుడు కాదు గంటా.   భీమిలిలో  ఒక్క 2004 లో తప్ప 1983 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలన్నింటా  టిడిపియే గెలుపొందింది.  2009లో మాత్రం ఇక్కడ ప్రజారాజ్యం గెలిచింది. ఆ ప్రాంతంలో కాపు వోట్లు బాగానే ఉన్నాయి. గంటా రూపంలో టిడిపి వోడిపోయే పరిస్థితి అంటే  2019నాటికి జాగ్రత్త పడండనే హెచ్చరిక. ఆయనకు చాలా దారులున్నాయి.కాపుల వోట్లకోసం జనసేనలోకి వెళ్ల వచ్చు. లేదా కాపులు అభిమానించే వైసిపిలోకి వెళ్లవచ్చు. అయితే, గంటలాంటి ధనబలం, కులజనబలం ఉన్నవాడు బయటకు వెళితే, కష్టకాలంలో టిడిపికి పెద్ద దెబ్బే అవుతుంది.  సాధారణంగా రాజకీయా నాయకులు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని దాన్ని పెట్టని కోటగా చేసుకుంటుంటారు. పులివెందుల, కుప్పం లాగా. కాని ఏం కారణమో కాని,  గంటా ఒక సారి పోటీచేశాక ఆ నియోజకవర్గం వదిలేస్తాడు. అదే రహస్యం. ఎపుడు ఫ్రెష్ గా కనిపించడం ఆయనకు ఇష్టం.