“మోసగాళ్ళకి మోసగాడు” కి 50 ఏళ్లు!

(CS Saleem Basha)
ఆగస్టు 27, 1971 తేదీ తెలుగు సినిమా చరిత్రలో ఒక నూతన శకానికి ఆరంభం జరిగింది. ఆరోజు ” మోసగాళ్ల కి మోసగాడు”, అనే సినిమా రిలీజ్ అయింది. అయితే ఏంటి? అని మనం అనుకోవచ్చు. కానీ అప్పటికే సంవత్సరానికి పదిహేను సినిమాలు పైన చేస్తూ వచ్చిన, కృష్ణ అనబడే ఘట్టమనేని శివరామ కృష్ణ ఒక వెస్ట్రన్ కౌబాయ్ సినిమా తీశాడు. అది అంతవరకు ఎవరు చేయని సాహసం. ఈ సినిమాతో కృష్ణకు ఆంధ్ర జేమ్స్ బాండ్ అని పేరు పెట్టారు, ప్రేక్షకులు. ఒక తెలుగు సినిమా ఇంగ్లీష్ లోకి డబ్ కావడం, ఇదే మొదటిసారి. “ది ట్రెజర్ హంట్” పేరుతో ఈ సినిమా 56 దేశాల్లో విడుదలైంది.
poster/wikimedia
ఈ సినిమాతో కృష్ణ కూడా తన సినిమాలతో ” అరకోటి” కలెక్షన్లు సాధించే హీరోగా మారిపోయాడు. అంతవరకూ ఎన్టీఆర్ ఏఎన్నార్ మాత్రమే ఈ ఘనత సాధించారు. కేవలం ఆరున్నర లక్షల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం 50 లక్షల పైచిలుకు కలెక్షన్లు సాధించడం అప్పట్లో ఒక సంచలనం.
పద్మాలయా స్టూడియోస్ స్థాపించబడిన తర్వాత కృష్ణ తీసిన రెండో సినిమా ఇది. తెలుగులో మొదటి కలర్ చిత్రం కూడా. అంతకుముందు, తనే హీరోగా  అగ్నిపరీక్ష సినిమా తీశాడు. ఇది పద్మాలయ సంస్థకు  మొదటి సినిమా.ఫెయిలంది. అయితే, కౌబాయ్ చిత్రాలు బాగా అచ్చాయి.మోసగాళ్లకు మోసగాడు తో ఆ వైఫల్యం నుంచి ఈ సంస్థ బయటపడింది. ఈ సక్సెస్ తో ఏకంగా దొంగలదోపిడి, మంచివాళ్లకు మంచివాడు వంటి కౌబాయ్ సినిమాలు ఆరింటిని తీసేశారు.
  మొదటి సారి ఈ సినిమా థార్ ఎడారి తో పాటు సట్లేజ్ నదీ ప్రాంతాల్లో, పాండిచ్చేరి, తదితర చోట్ల షూట్ చేశారు. ఇంతవరకూ ఏ తెలుగు సినిమా తీయని ప్రాంతాల్లో దీన్ని తీయడం వల్ల సినిమాకి freshness వచ్చింది. ఈ సినిమా దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ కృష్ణకు సన్నిహితుడు. కృష్ణ ద్విపాత్రాభినయంతో తీసిన “టక్కరి దొంగ చక్కని చుక్క” హిట్ అయింది.
అంతవరకు సాధారణ ప్రేమకథ లు, సాంఘిక డ్రామా లు, జానపదాలు చూసిన ప్రేక్షకులు ఈ సినిమా చూసి థ్రిల్లయిపోయారు. గుర్రాలు, గన్స్, ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు, ఉత్కంఠకు గురిచేసే పోరాటాలు, ఎన్నడూ చూడని ప్రదేశాల్లో పాటలు.
సినిమా చూస్తున్నంత సేపు ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్న భావన ప్రేక్షకుల్లో కలగడం, దాంతో మరోసారి సినిమా చూద్దామని ప్రేక్షకులు అనుకోవటం, ఇవన్నీ ఈ సినిమాతో జరిగాయి.
ఈ సినిమా హాలీవుడ్ లో అప్పట్లోనే కౌబాయ్ గా విశ్వరూపం చూపిస్తున్న Clint Eastwood ది గుడ్ ది బ్యాడ్ అండ్ ది అగ్లీ, ఫర్ అ ఫ్యూ డాలర్స్ మోర్, సినిమాల ప్రభావంతో తీయడం వల్ల థ్రిల్లింగ్ తయారైంది. అయితే ఈ సినిమా Gregory Peck నటించిన హాలీవుడ్ చిత్రం మెకన్నాస్ గోల్డ్ (Mackenna’s Gold) కు దగ్గరగా ఉంటుంది.
ఎప్పుడో ఒక చోట దాచేసిన నిధిని చేజిక్కించుకోవడం కోసం, హీరో తో సహా కొంతమంది ప్రయత్నించడం ఈ సినిమా కథ. ఆ ఇంగ్లీష్ సినిమాలు పెద్దగా ఎవరూ చూడలేదు కాబట్టి, మోసగాళ్లకు మోసగాడు ఒక ట్రెండ్ సెట్టర్ (trend setter) అయ్యింది. పైగా ఈ సినిమాలో ఎంతో మంది నటీనటులు ఉన్నారు. తెలుగు నేటివిటికి అనుగుణంగా చేసిన మార్పుల వల్ల ఈ సినిమా ఒక కొత్త సినిమా గానే ఉంది.దీనికి ప్రముఖ కవి, రచయిత ఆరుద్రని ప్రశసించాలి. తెలుగు సంస్కృతిలో కౌబాయ్ లు లేరు. ఇలాంటి సాంస్కృతిక నేపథ్యంలోకి కౌబాయ్ ని తీసుకురావాలి.ఆరుద్ర అసాధారణ విజ్ఞానం ఉన్న చరిత్రకారుడు. ఆయన సమగ్రాంధ్రసాహిత్యం ఆయన చారిత్రక దృక్పథానికి నిదర్శనం. అందుకే మోసగాళ్లకు మోసగాడు ను బొబ్బిలియుద్ధం జరిగిన కాలం, అంటే భారతదేశం మీద పట్టుకోసం ఫ్రెంచ్ వాళ్లు, బ్రిటిష్ వాళ్లు తెగ పోరాడుతున్నరోజులనాటికి (1757) కథ ను తీసుకెళ్లారు.
సినిమా తమిళ్ డబ్బింగ్ దాదాపు ఏడు లక్షల రూపాయలు వసూలు చేసింది. ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం 1972లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారత దేశం నుంచి ప్రదర్శించబడిన మొట్టమొదటి సినిమా! ఆ సినిమా చూసి ఎన్టీ రామారావు కృష్ణకు ఒక ఉత్తరం కూడా రాయడం విశేషం!
నాకు బాగా గుర్తుంది. ఈ సినిమా నేను మొదటి రోజే కొంత మంది తో కలిసి మా కర్నూలు  విక్టరీ టాకీస్ లో మధ్యాహ్నం ఆట మ్యాటినీ చూశాను.
ఆ తర్వాత చాలాసార్లు సినిమా చూశాను(స్కూల్ ఎగ్గొట్టి). అన్నిటికన్నా విశేషం ఏంటంటే మెకన్నాస్ గోల్డ్, ది గుడ్ ది బ్యాడ్ అండ్ ది అగ్లీ, ఫర్ అ ఫ్యూ డాలర్స్ మోర్, సినిమాలు కూడా నేను ఇదే టాకీస్ లో చూశాను.
అప్పట్లో పూర్తి ఇంగ్లీష్ సినిమా చూసే అవకాశం ఉండేది కాదు. ఇంటర్వెల్ తర్వాత మాత్రమే చూడగలిగే వాళ్ళం. ఎందుకంటే ఇంటర్వెల్ తర్వాత సినిమా రీళ్లు మాత్రమే వచ్చేవి. ఇంటర్వెల్ ముందు ఒక సినిమా, ఇంటర్వెల్ తర్వాత ఒక సినిమా వేసేవాళ్లు. సాధారణంగా రెండూ ఇంగ్లీష్ సినిమాలే ఉండేవి.
ఈ సినిమాలో ఎంతోమంది నటీనటులు ఉన్నారు. జ్యోతిలక్ష్మి కి సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర దొరికింది. అంత వరకు ఇటువంటి పాత్ర జ్యోతిలక్ష్మి కి లేదు. ఈ సినిమాలో మరో ముఖ్యమైన అంశం నాగభూషణం ఎపిసోడ్లు. అంత సీరియస్ సినిమాకు కామెడీ టచ్ నివ్వడం వల్ల కొంచెం కొత్తదనం కనిపించింది.
మ్యూజిక్ డైరెక్టర్ గా ఆదినారాయణ రావు చక్కటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ” కోరినది నెరవేరినది” ఈ పాట చిత్రీకరణ బావుంది.

మోసగాళ్లకు మోసగాడు తర్వాత కౌబాయ్ చిత్రాల పరంపర మొదలైంది. మంచివాళ్ళకు మంచివాడు, నిజం నిరూపిస్తా, మెరుపు దాడి, టక్కరి దొంగ లాంటి సినిమాలు వచ్చాయి. కానీ మోసగాళ్లకు మోసగాడు ఒక ప్రత్యేక చిత్రంగానే మిగిలిపోయింది. 50 ఏళ్ల తర్వాత కూడా ఆ సినిమా గురించి ఆ తరం ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.
కర్నూల్ విక్టరీ టాకీస్ లో ఈ సినిమా 50 రోజులు ఆడినట్లు గుర్తు. మొన్న ఒక సారి ఆ టాకీస్ కి వెళ్లాను. అప్పట్లో ఆ టాకీస్ లో పనిచేసిన వ్యక్తి కనపడ్డాడు. నేను అప్పట్లో ఏ సినిమా ఎక్కువ రోజులు ఆడింది అని అడిగితే ” మోసగాళ్లకు మోసగాడు” అని చెప్పడం విశేషం.
కొసమెరుపు ఏంటంటే అప్పట్లో ఆ సినిమా బ్లాక్ టికెట్లు అమ్మిన వాళ్ళు బాగానే డబ్బులు సంపాదించారట. యాభై ఐదు పైసలు టికెట్టు అప్పట్లో బ్లాక్ లో 75 పైసలకు అమ్మారట! ఈ సినిమాకు బ్లాక్ టికెట్లు అమ్మగా వచ్చిన లాభంతో ఒకడు సైకిల్ కూడా కొనుక్కున్నాడు అని అప్పట్లో మా మిత్రులు చెప్పుకొనేవారు.
Saleem Basha CS

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)