Home Entertainment “లతా” పాడకపోవడం “ఆశా” కు కలిసొచ్చిందా!

“లతా” పాడకపోవడం “ఆశా” కు కలిసొచ్చిందా!

66
0
SHARE
Asha Bhosle (Credits: Wikpedia/Firoze Edassery)

(CS Saleem Basha)

లతా మంగేష్కర్ లాంటి మహా వృక్షం నీడలో కొన్ని సంవత్సరాలు గుర్తింపు లేకపోయిన ఆశా భోస్లే, ఓపికతో పట్టుదలతో, కాలక్రమేణా ఎదిగి, తనకంటూ ఒక శాశ్వత గుర్తింపును తెచ్చుకుంది. కొన్ని పాటలు లతా మంగేష్కర్ పాడడానికి నిరాకరించడం వల్ల, ఆ అవకాశాలు ఆశాకు వచ్చాయి. అయినప్పటికీ తన ప్రతిభాపాఠవాలతోనే ఆశా భోస్లే హిందీ చిత్రసీమలో ప్రముఖ స్థానం పొందింది. ఎప్పుడూ రెండో స్థానంలో ఉన్న ఆశా భోస్లే, ఇప్పుడు కూడా రెండో స్థానం లోనే ఉంది, కాకపోతే మొదటి స్థానంలో ఎవరు లేరు! నేటితో (8 సెప్టెంబర్) 87 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆశా భోస్లే పాటల గురించి, రోలర్ కోస్టర్ లాంటి ఆమె చలనచిత్ర జీవితం గురించి చూద్దాం.
లతా కు ఆశా కు మధ్య sibling rivalry (అంటే అక్క చెల్లెళ్ల మధ్య సహజంగా ఉండే స్పర్ధ, పోటీ) ఉన్నప్పటికీ పబ్లిక్ గా ఎప్పటికీ బయటపడలేదు. కొంతకాలం క్రితం వచ్చిన ఇంటర్వ్యూలో, “లతా దీదీ(అక్క) తనకు పెద్దగా సాయి పడలేదని, అయినా మా సంగీతకారుల కుటుంబంలో ఇది మామూలే” అని మాత్రం ఆశా చెప్పింది.
పైగా పాటలు పాడింది 60వ దశకం లో శంషాద్ బేగం, గీతా దత్, లతా మంగేష్కర్ లాంటి హేమాహేమీలు సినీరంగంలో రాజ్యమేలుతున్నప్పుడు. ఆశా భోస్లే బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాలకు పాటలు పాడింది. నిజానికి ఆ సమయంలో అందరికన్నా ఎక్కువ పాటలు పాడిన నేపథ్య గాయని ఆశా భోస్లే నే! కానీ పెద్దగా ఉపయోగం లేదు .ఎందుకంటే ఆ సినిమాలో ఎవరూ పెద్దగా చూడరు. పైగా పాటలు పాడింది ముఖ్య పాత్రల కు కాదు, చిన్నచిన్న పాత్రలకు. ఆ సమయంలో ఆశాభోంస్లే ఎక్కువగా పాటలు పాడింది నర్తకి హెలెన్ కు. అయినా పెద్దగా గుర్తింపు లేకుండా పోయింది.

ఆశా భోస్లే స్వర స్థాయి తో పాటు పాటల రేంజ్ కూడా చాలా ఎక్కువ. ఆమె స్వరం నచ్చి ప్రముఖ సంగీత దర్శకుడు ఓ పీ నయ్యర్ ఆమెతో జతకట్టాడు. వీరిద్దరి కాంబినేషన్ లో అనేక హిట్ సాంగ్స్ రూపుదిద్దుకున్నాయి. ఆమె టాలెంట్ ను మొట్టమొదటగా గుర్తించింది సంగీత దర్శకుడు ఓ పీ నయ్యర్. సిఐడి(1956) సినిమాలో అవకాశం ఇచ్చాడు. దాని తర్వాత వచ్చిన సూపర్ హిట్ సినిమా నయా దౌర్(1957) తో ఆశ తనేంటో అందరికీ తెలియజేసింది. ఆ సినిమాలో రఫీ తో కలిసి పాడిన “”మాంగ్ కే సాథ్ తుమారా” పాట సెన్సేషనల్ హిట్.
అదే సినిమాలో మొహమ్మద్ రఫీ తో కలిసి
పాడిన “ఉడె జబ్ జబ్ జుల్ఫే తేరి”, “సాథీ హాథ్ బఢానా” అనే రెండు పాటలు కూడా హిట్ అయ్యాయి. ఈ సినిమాలో ” రేష్మి సల్వార్, కుర్తా జాలీ కా” అనే పాటను ప్రముఖ గాయని శంషాద్ బేగం తో కలిసి పాడటం విశేషం! ఆశా కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఓపీ నయ్యర్ సంగీత సారథ్యంలో మూడు వందలకు పైగా పాటలు పాడిన ఆశ తన ప్రతిభను నిరూపించుకుంది.
ఇక్కడ ఆశా కు కలిసి వచ్చిన అంశం ఇంకోటి ఉంది. ఓ.పీ.నయ్యర్ అప్పటికే సూపర్ హిట్ గాయని లతా కు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు. దానికి కారణం ఆయన మాటల్లోనే చెప్పాలంటే” లతా గొంతు సన్నని దారం లాంటిది. అది నా సంగీతానికి సరిపోదు. నాకు కావలసింది శక్తివంతమైన, చాలా ఎక్కువ స్థాయి ఉన్న గొంతు. అందుకే నేను లతా మంగేష్కర్ తో ఎప్పుడూ పాటించలేదు. ఆశా స్వర స్థాయి నా స్టైల్ కి సరిపోతుంది”. అది విషయం! 1957 నుంచి దాదాపు రెండు దశాబ్దాల వరకు ఎన్నో సినిమాల్లో ఓ.పీ.నయ్యర్ సంగీత దర్శకత్వంలో ఆశ పాటలు పాడింది. 1974 లో వచ్చిన ” pran jaye par vachan na jaye” సినిమా లో చివరిసారిగా ఓ.పీ.నయ్యర్ కోసం ఆశా పాడింది. ఈ సినిమాలో ఆశా పాడిన “చైన్ సే హం కో కభీ ” పాట ఆశా కు ఫిలింఫేర్ అవార్డ్ సాధించిపెట్టింది. తమాషా ఏంటంటే ఈ పాట సినిమాలో లేదు.
ఓపీ నయ్యర్ తర్వాత ఆశా, ఆర్.డి.బర్మన్ జోడి ఎన్నో సూపర్ హిట్ పాటలు ఇచ్చింది. ఆర్.డి.బర్మన్ సంగీత దర్శకత్వంలో లో “తీస్రీ మంజిల్” సినిమాలో ఆశా పాడిన ” ఆజా ఆజా” పాట అమె శైలికి తగిన పాట. అలాంటి పాటే కార్వాన్ సినిమాలో పాడిన ” పియ తూ అబ్ తో ఆజా”. డాన్ సినిమా లో ” ఏ మేర దిల్”, పాట కూడా అలాంటిదే. ఇవన్నీఆశా భోస్లే మార్క్ పాటలు. ఆశా భోస్లే, ఆర్.డి.బర్మన్ ప్రేమ, పెళ్లి కథ అందరికీ తెలిసిందే.

 

ఆశా భోస్లే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కోసం మూండ్రం పిరయ్ (తెలుగులో వసంత కోకిల, హిందీలో సద్మా) సినిమాలో పాడింది. కమల్ హాసన్ తమిళ్ సినిమా ” హే రామ్” లో కూడా పాడింది. తెలుగు సినిమా ” చందమామ”(2007 ) లో ” నాలో ఊహలకు” అన్న పాట పాడింది.
ఆశా భోస్లే కు ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ, రెండుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా ఎన్నికవడం ప్రత్యేకమైనవి. 1981 లో “ఉమ్రావ్ జాన్” సినిమాలో పాడిన ” “దిల్ చీజ్ క్యా హై” , 1986 లో ” ఇజాజత్ ” సినిమాలో పాడిన ” “మెర కుచ్ సామా” ” పాటలకు జాతీయ అవార్డు వచ్చింది. 2001 లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య అవార్డు కూడా ఆమె అవార్డుల జాబితాలో ఉంది.

పదేళ్ల వయసులో పాడటం మొదలు పెట్టి, దాదాపు 70 ఏళ్ల పాటు తన గానాన్ని కొనసాగించిన ఆశా భోస్లే దాదాపు 20 భాషల్లో, 11 వేలకు పైగా పాటలు పాడినట్లు రికార్డు ఉంది. ఓపీ నయ్యర్ నుంచి సందీప్ చౌతా(సత్య సినిమాలో “సప్నేమే మిల్తీ హై”) దాకా వివిధ రకాల పాటలు పాడడం ఆమెకే చెల్లింది. ఆశా భోస్లే కె ప్రత్యేకమైన ” దమ్ మారో దమ్” లాంటి పాటలతో పాటు, మెలోడీ సాంగ్స్ కూడా ఎన్నో పాడిన ఆశాబోంస్లే, 87 ఏళ్ల వయసులో కూడా చలాకీగా ఉండడం విశేషం.
Saleem Basha CS

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)