ఆంధ్ర ఎన్నికల మీద చంద్రబాబు మనుసులో మాట…

ఆంధ్రలో తెలుగుదేశం రావడం, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పోవడం రెండు ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

ఎన్నికలయ్యాక టిడిపి ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ ఈ సారి ఎన్నికలు ఎలా జరిగాయో, కేంద్రం దేశాన్ని ఎలా నడిపిస్తున్నదో తనమనసులోని మాట వెల్లడించారు . ప్రతివ్యవస్థను నాశనం చేసిన మోదీ ప్రభుత్వం ఇపుడు సుప్రీంకోర్టును కూడా వదలడం లేదని వ్యాఖ్యానించారు.

ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ ఎందుకు అధికారంలోకి వస్తున్నదో ఆయన వివరించారు.

ఎన్నికల ప్రాసెస్ ను చెడగొట్టి లబ్ది పొందాలనుకున్న మోదీకి ప్రజలు తగిన గుణ పాఠం చెప్పబోతున్నారని ఆయన అన్నారు.

మోదీ మోసాలు తెలిసే, ఎన్నడూ లేని విధంగా మహిళలు, వృద్ధులు తమ వోటు హక్కు వినియోగించుకునేందుకు పోరాడారని , ఇలాంటి మార్పు తానెపుడూ చూల్లేదని అన్నారు. ఓటేసేందుకు జనంవిరగబడి వచ్చారని ఆయన అన్నారు. పోలింగ్ స్టేషన్ల దగ్గిర అలాంటి క్యూలు తానెపు చూడలేదని అన్నారు.

“తిరుమలలో స్వామివారి దర్శనానికి మాత్రమే అలాంటి క్యూలుంటాయి. కాని పోలింగ్ రోజున మహిళలు గంటల తరబడి క్యూలో ఓపికగా నిలబడి ఇది తమ బాధ్యత అనుకుని ఓట్లు వేశారు. ఆఖరి ఓటు తెల్లవారుజామున 4.30 గంటలకు పడిందంటే ఈ సారి వోటు ఎంత విలువ ఇచ్చారో అర్థమవుతుంది. ీనివెనక బలీయమయిన కారణం ఉండాలి. మహిళలు ఎవరి కోసం వచ్చి ఓట్లు వేశారు? ఎవరి కోసం అంత బాధ్యతాయుతంగా వోటేశారు. పోలింగ్‌ అధికారులు త్వరగా పని ముగించుకొని వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తే వాళ్లు పోకుండా పోరాడి తాము ఓటు వేసేవరకూ పోలింగ్‌ కేంద్రం పని చేసేలా సాధించేకున్నారు. ఇది అసాధారరణం,’ అని ఆయన అన్నారు.

అంతేకాదు,వోటేసేందుకు ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారు కూడా అలాగే ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో వచ్చారు.

“ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్లు వెల్లువలా వచ్చి ఓటు వేశారు. పక్కనున్న తెలంగాణ నుంచి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. బెంగుళూరు, చెన్నై, పుణె వంటి నగరాల నుంచి కూడా వేలసంఖ్యలో వోటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. ఎందుకు వచ్చారు, ఈ రాష్ట్రంలో మంచి పాలన ఉందిని, అది కొనసాగాలని రాష్ట్రానికి ప్రజకుల మంచి భవిష్యత్తు ఉండాలని వారంతా ఆశిస్తున్నారు. అందుకు అంత బాధ్యతతో వోటేయడానికి వచ్చారు.వోటేయకుండా వెళ్ల కూడదని నిర్ణయించుకున్నారు. టిడిపి గెలుస్తుందనేందుకు ఇంతకంటే మంచి ఇండికేటర్స్ అవసరమా?,’ అని ముఖ్యమంత్రి వివరించారు.

ఇది మోదీకి షాక్ అని ఆయన అన్నారు.

ఎన్నికల ప్రకటన తీరును ఆయన తప్పుపట్టారు. ‘మోదీ దృష్టింతా తెలుగుదేశాన్ని దెబ్బతీయాలనే దాని మీదే ఉంది. ఎన్నికలు ఎదుర్కొనేందుకు తగిన సమయం కూడా ఇవ్వ లేదు. సమయం ఇవ్వకుండా చేసి తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయవచ్చని ప్రధాని మోదీ భ్రమపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను ఒక సారి మొదటి దశ పోలింగ్‌ లో చేర్చారు . అదే టీడీపీకి మేలు చేసింద. ప్రజలు ఈ కుట్రని గ్రహించారు. ఎన్నికల కోడ్ పేరుతో ప్రజలకు సంక్షేమం అందకుండా చేయాలని చూశారు”.

అయితే, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, రైతుల రుణ మాఫీ చెల్లింపులు పూర్తయ్యేలా ఎన్నికల షెడ్యూల్‌ కంటే ముందే పూర్తి చేసి మోదీ ఎత్తును చిత్తు చేశాం. ఆ చెల్లింపులు ఎన్నికలయ్యే లోపే పూర్తి చేశాం. దీనిని గుర్తించిన ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత తమ మీద ఉందని గ్రహించారు. ఇలా పెద్ద ఎత్తున వోటేయడానికి వచ్చారు,’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *