Home Breaking వరంగల్ పోరడి స్టార్టప్ స్టోరీ…దునియాలో మొట్టమొదటి ‘స్మార్ట్ జాకెట్’

వరంగల్ పోరడి స్టార్టప్ స్టోరీ…దునియాలో మొట్టమొదటి ‘స్మార్ట్ జాకెట్’

373
0

మనకి చాలా సమస్యలున్నాయి. చిన్నవి, పట్టించుకోనవసరం లేనివి, ఒక మాదిరి సమస్యలు, పెద్ద సమస్యలు, జటిలసమస్యలు. సమస్యలు చిన్నవయినా పెద్దవయినా చీకాకు పెట్టేవే. ఏ సమస్యలేదిపుడు, జీవితం హాయిగా నడుస్తున్నదనుకుంటున్నపుడు చిన్నఏకు లాంటి సమస్య మేకై కూర్చుంటుంది. అందుకే, పురసతే లేని ఈ రోజుల్లో సమస్యలకు మనమే తీరుబడిగా పరిష్కారం కనుక్కోలేం. అందుకే ఈ సమస్యల పరిష్కార మార్గాల్లోకి స్టార్టప్ లు ప్రవేశిసున్నాయి.

ఈ మధ్య జపాన్ పోలీసులు మహిళల భద్రతకోసం ‘డిజిపోలీస్’ యాప్ ను తయారు చేశారు. లోకల్ రైళ్లలో, సిటిబస్సుల్లో, క్యూలో నిలబడుకున్నపుడో అమ్మాయిలను  ఎవరయిన అసహజంగా ముట్టుకుంటే యాక్టివేట్ అయ్యేయాప్ ఇది. మహిళలకు రద్దీ నతరాలలో నిరంతరం ఎదురయ్యే చాలా సీరియస్ సమస్య ఇది. డిజియాప్ కేవలం సమస్యను ఒక కోణంలోనుంచే పరిష్కరించింది. సమస్యకు చాలా కోణాలుంటాయి.

ఉదాహరణకు ఒక అమ్మాయిని ఎవరయిన ఫాలొ చేస్తుంటారు. దాడిచేసేందుకు వస్తుంటారు.డిజి యాప్ ఇలాంటపుడు మహిళను అప్రమత్తం చేయలేదు. మనల్ని అనుసరిస్తున్నవాడవరో తెలుసుకోవడం ఎలా?

దీనికి ఒక పరిష్కారం కనుగొన్నాడు వరంగల్ కు చెందిన పవన్ కుమార్ ఇరుకుళ్ల. పవన్ ఒక స్మార్ట్ జాకెట్ తయారు చేశాడు. ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా తయారు కాని జాకెట్. ఫ్యాషనబుల్ గా తొడుక్కోవచ్చు. పైకి మామూలు జాకెట్ లాగా కనిపించినా ఇది టెక్నాలజీ దట్టించిన స్మార్ట్ జాకెట్. దీనిని టచ్ చేస్తే కరెంట్ షాక్ కొడుతుంది.టచ్ చేసిన వాడి ప్రాణానికి ముప్పు ఉండదు గాని, తాకిన వాడు ఎగిరి అవతలపడిపోతాడు. ఈ జాకెట్ మూడు రకాలుగా పనికొస్తుందని పవన్ ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్ ’ కు చెప్పాడు. 1. ఈ జాకెట్ ఎలెక్ట్రిక్ కవచం లాగా పనిచేస్తుంది అంటే తాకితే షాక్ కొడుతుంది . 2. మీరెక్కడున్నారో మీఇంట్లో వాళ్లకి తెలియచేస్తూ ఉంటుంది. 3. మిమ్మల్నెవరయినా ఫోలో చేస్తుంటే అలర్ట్ చేస్తుంది.

మహిళలకు అభదత్ర పెరిగిపోతున్న ఈ రోజుల్లో వారికి  బాగా పనికొస్తుందీ జాకెట్. ముఖ్యంగా రాత్రి పూట్ వంటరిగా వస్తున్నపుడు మహిళలను ఎవరైనా పాలో చేస్తుంటే పట్టిస్తుందని పవన్ చెప్పాడు. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో నైట్ షిప్ట్ లలో పనిచేసే మహిళలకు ఇలాంటి జాకెట్ చాలా అవసరం మని పవన్ అభిప్రాయపడుతున్నాడు. అంతేకాదు, ఒంటరిగా వెళ్లున్న మహిళల మీద చాలా రకాలుగా దాడులు జరుగుతుంటాయి. వీటిని నివారించేందుకు ఈ జాకెట్ బాగా పనికొస్తుంది.

సినీతారలకు,రాజకీయనాయకులకు,ఇతర సెలెబ్రిటీలకు జనంలోకి వెళ్లినపుడు భద్రత సమస్య వస్తూ ఉంటుంది. అభిమానులు మీద పడుతూ ఉంటారు. ఇందులోఅల్లరి మూకలు కూడా చేరి ప్రాణహాని కల్పించే ప్రమాదం ఉంది. ఇలా జనం మధ్య కు వెళ్లినపుడు ఈ జాకెట్ ధరిస్తే  ఎవరూ మీద పడి పడి పరామర్శించేందుకు వీలుండదు.

ఇలాంటి ఫ్యాబ్రిక్ తయారు చేయాలన్న ఆలోచన రావడం వెనక  ఢిల్లీ నిర్భయ ట్రాజెడీ ఉంది. యావద్భారతాన్ని కుదిపేసిన ఈ దారుణం పవన్ ని కూడా బాగా క్రుంగదీసింది. మహిళలకు రక్షణ కల్పించే వస్త్రాలు రూపొందించ వచ్చా అని ఆలోచించాడు. దాదాపు రెండేళ్లు మేదోమధనం జరిగింది. నిజానికి అప్పటికి పవన్ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. ఇంజనీరింగ్ చదవడం కంటే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం ముఖ్యమని పవన్ ఇంజనీరింగ్ ఆపేసి రక్షణ కల్పించే వస్త్రాల గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు. దీన్నుంచి వచ్చిందే స్మార్ట్ ఫ్యాబ్రిక్ .

సాధారణ బట్టలు మన శరీరాన్ని కప్పి ఉంచితే, స్మార్ట్ ఫ్యాబ్రిక్ రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఈ జాకెట్ నిండా టెక్నాలజీ దాక్కుని ఉంటుంది.
ఈ అద్భుతమయిన ఐడియా వచ్చింది గాని, ఫండింగ్ సమస్య అయింది పవన్ కు.

ఆయన క్రౌడ్ ఫండింగ్ ప్రయత్నం చేసినా ఆశించిన స్పందన రాలేదు. తనే కొంతనిధిని సమకూర్చుకుని, ఒక టీమ్ తయారుచేసుకుని జాకెట్ తయారీ ప్రారంభించాడు. రెండు మూడు నెలల్లో ఇది మార్కెట్ లోకి విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి జాకెట్ తయారు కాలేదని, తన ప్రాడక్ట్ కు చాలా డిమాండ్ వుంటుందని పవన్ ఆశిస్తున్నాడు. మొత్తం ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఈ జాకెట్ విప్లవాత్మకం కానుందని ఆయన భావిస్తున్నాడు. వరంగల్ కుర్రవాడి స్టార్టప్ కు సహకరించాలనుకునే వారు pawaniru3@gmail.com మీద కాంటాక్ట్  చేసి చేయూత నీయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here