ముచ్చటగా మూడో టైటిల్ పై కెకెఆర్ గురి

(బి.వేంకటేశ్వర మూర్తి)

2008 నుంచి మొదటి మొదటి మూడేళ్లూ అనేక బాలారిష్టాలతో వరుస పరాజయాలతో కునారిల్లిన కోల్కటా నైట్ రైడర్స్, 2011 లో మొదటి సారి ప్లే ఆఫ్ దశకు చేరింది. మరుసటి సంవత్సరం టైటిల్ సాధించి సత్తా చాటింది. ఆ వెంటనే  2013లో లీగ్ లో ఏడో స్థానానికి పడిపోవడం, 2014లో తిరిగి ఛాంపియన్ షిప్ సాధించడం, ఆ వెనువెంటనే ప్లే ఆఫ్ స్థాయి కూడా నోచుకోకుండా లీగ్ లెవెల్ కు పడిపోవడం గమనిస్తే క్రికెట్ నైజమైన `అన్ ప్రిడిక్టబిలిటీ’ నూటికి నూరు పాళ్ళూ కెకెఆర్ లో మూర్తీభవించినట్టు అనిపిస్తున్నది. దీనికి అపవాదంగా గత మూడేళ్ల నుంచి నిలకడగా ఆడుతూ ఈ జట్టు కనీసం ప్లే ఆఫ్ దశ చేరుకోగలుగుతున్నది.

ముచ్చటగా మూడో ఐపిఎల్ టైటిల్ పై గురి పెట్టి ఈసారి రంగంలో దిగుతున్న కెకెఆర్ తన వీరోచిత విన్యాసాలతో హోమ్ గ్రౌండ్ ఇడెన్ గార్డెన్ ను హోరెత్తించగలదేమో చూడాలి. ముందెన్నడూ లేని విధంగా కోల్కటా  పాస్ట్ బౌలింగ్ యూనిట్ ఈ సీజన్ లో చండ ప్రచండంగా కనిపిస్తున్నది. మొన్నటి వేలంలో న్యూజిలాండ్ కు చెందిన లాకీ ఫెర్గూసన్, ఇంగ్లండ్ కు చెందిన ఎడం చేతి వాటం పేసర్ హారీ గర్నీ, దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్ డ్జ్, విండీస్ ఆల్ రౌండర్ కార్లోస్  బ్రాత్ వైట్ లను కొనుగోలు చేసింది. ఇండియన్ ఫాస్ట్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, పృథ్వీరాజ్, సందీప్ వారియర్, కొత్త ఆల్ రౌండర్ శ్రీకాంత్ ముండే బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేస్తున్నారు. స్పిన్ బౌలింగ్ విషయంలో కెకెఆర్ తొలి నుంచీ బలంగానే ఉంది. ఇండియా స్ట్రైక్ బౌలర్ కుల్ దీప్ యాదవ్, సునీల్ నరైన్, పీయూష్ చావ్లాతో బాటు ఇంగ్లీష్ ఆల్ రౌండర్ జో డెన్లీ లెగ్ బ్రేక్ బౌలింగ్ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు సవాలు కాగలదు.

ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్ లిన్, ఆల్ రౌండర్ నరైన్ ల ఆరంభ బ్యాటింగ్ జంట గత సీజన్ లో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా తయారైంది. జట్టు నాయకుడిగా గౌతమ్ గంభీర్ నుంచి పగ్గాలు స్వీకరించినప్పటికీ దినేష్ కార్తిక్ బ్యాటింగ్ సామర్థ్యం ఏ మాత్రం చేవ తగ్గలేదు. భారత మాజీ స్టార్, కీపర్ బ్యాట్స్ మన్ కెకెఆర్ బ్యాటింగ్ లో ప్రధాన శక్తి. అండర్ -19 భారత జట్టు హీరోల్లో ఒకడైన శుభ్ మన్ గిల్, నిలకడగా ఆడగల నితిష్ రానా, 6 నుంచి 9 స్థానాల్లో వీరబాదుడు స్థాయిలో ఆడగల ఆల్ రౌండర్ లు జాక్ రస్సెల్, బ్రాత్ వైట్, ముండే లాంటి ఆల్ రౌండర్లు కోల్కటాను ఈసారి విజయపథంలో నడిపించగలరేమో చూడాలి.

కోల్కటా తన తొలిపోటీలో ఈ నెల 24న హైదరాబాద్ సన్ రైజర్స్ ను తమ హోం గ్రౌండ్ ఇడెన్ గార్డెన్ లో ఢీకొనబోతున్నది.

(వేంకటేశ్వర మూర్తి, సీనియర్ జర్నలిస్టు, బెంగుళూరు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *