Home English సత్తా ఉన్నోళ్లే, చెత్తగానూ ఆడగలరు!

సత్తా ఉన్నోళ్లే, చెత్తగానూ ఆడగలరు!

300
0

(బి వెంకటేశ్వరమూర్తి)

విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాల్సిన పరిస్థితులు వస్తేనే కానీ వాళ్ల శౌర్య ప్రతాపాలను పూర్తి స్థాయిలో ప్రదర్శించరన్నది ముంబై ఇండియన్స్ గురించి అభిమానులు ప్రేమగా వెలిబుచ్చే అభిప్రాయం. కొన్ని పాత తెలుగు సినిమాల్లో హీరో లాగా ముందు విలన్ చేతిలో బాగా దెబ్బలు తిని, అయ్యయ్యో ఇలాగవుతున్నదేమిటని ప్రేక్షకులు తీవ్రంగా నొచ్చుకుంటున్న దశలో హీరో అమాంతం పైకి లేచి విలన్ ని చావు  దెబ్బ కొట్టడమన్న మాట. ఇంతదాకా జరిగిన ఐపిఎల్ టోర్నీల్లో వీళ్ల కథ ముగిసిపోయిందనుకున్న చాలా సందర్భాల్లో ముంబై ఇండియన్స్ రోషావేశాలతో పైకి దూసుకొచ్చింది.

ఐపిఎల్ చరిత్రలో ముచ్చటగా మూడు సార్లు ఛాంపియన్ షిప్ గెల్చిన జట్లు రెండే రెండు-చెన్నై, ముంబై. అయితే మొదటగా ఈ ఘనత సాధించింది ముంబై కాగా చెన్నై సూపర్ కింగ్స్ గతేడాది తన మూడో విజయం అందుకున్నది. 2010 నుంచి ఇప్పటిదాకా ముంబై ఆటతీరులో నిలకడ లేని తనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.  2010లో ఫైనల్ లో ఓడిన ముంబై తర్వాతి రండేళ్లు ప్లే ఆఫ్ దశలోనే వెనుతిరిగింది. 2013లో ఛాంపియన్ షిప్ కొట్టింది గానీ తర్వాతి సంవత్సరం ఫైనల్ కు కూడా రాలేక ప్లే ఆఫ్ లోనే కూలబడింది. 2015లో రెండో సారి టైటిల్ గెల్చింది గానీ మరుసటేడు మళ్లీ షరా మామూలు, మరీ ఘోరంగా ఐదో స్థానానికి పతనమయింది. 2017లో తిరిగి ఛాంపియన్ కాగా గతేడాది మరోసారి ఐదో స్థానంలో మిగిలింది. ఈ లెక్కన 2019లో ముంబై మళ్లీ కప్పు గెల్చుకోగలదేమో అనిపిస్తున్నది.

ముంబై జట్టు అనుభవించిన ఇంతటి పతనోత్థానాలకు జట్టు బ్యాటింగ్ లో నిలకడ లోపించడమే ప్రధాన కారణం. వన్ డే, టి-20 ఫార్మాట్ లలో భారత ఆరంభ బ్యాట్స్ మన్ గా సాటి లేని మేటి వీరుడుగా ప్రఖ్యాతి పొంది, చేతికందిన రికార్డునల్లా బద్దలు కొడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ముంబైకి ఆడేప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. జట్టు కాంబినేషన్, అవసరాలను బట్టి అతను ఓపెనింగ్ కాకుండా వేరే స్థానాల్లో బ్యాటింగ్ చేయవలసి రావడం ఇటీవలి కాలంలో ముంబై ఇండియన్స్ కి పెద్ద ప్రతి బంధకంగా తయారైంది. గత మూడు సీజన్ లలో రోహిత్ మొత్తం 44 ఐపిఎల్ మ్యాచ్ లు ఆడితే అందులో 15 సార్లు మాత్రమే ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా ఆడాడు. అయితే ఈ సీజన్ మొత్తం ముంబైకి తను ఓపెనర్ గానే ఆడతానని రోహిత్ శర్మ ప్రకటించడం ఊరట కలిగించే అంశం. క్వింటన్ డి కాక్ లేదా ఎవిన్ లెవిస్ రోహిత్ తో పాటు ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలున్నాయి.

ఓపెనర్ గా ఎన్నో సార్లు చక్కని ఆట ప్రదర్శించిన సూర్యకుమార్ యాదవ్, ఆదిత్య తారే, ఇషాన్ కిషన్, యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్ లు మిడిలార్డర్ లో ఒదుగుతారు. వీరిలో ఆదిత్య తారే, ఇషాన్ కిషన్ లు ఇద్దరూ కీపర్ బ్యాట్స్ మెనే. ఇప్పుడు రిషభ్ పంత్ వెలుగు జిలుగుల్లో ఇషాన్ కిషన్ కు రావలసినంత పేరు రాలేదు గానీ గత సీజన్ లో ఒకటి రెండు మ్యాచ్ ల్లో అతను యమదూకుడుగా ఆడి తన సత్తా ప్రదర్శించాడు. ఒకప్పటి ఆరు సిక్సర్ల మొనగాడు యువరాజ్ సింగ్ కి ముంబై జట్టులో అవకాశం లభిస్తుందో లేదో, లభిస్తే అతను ఎలా ఆడతాడో నన్న అంశం ఆసక్తి రేకెత్తిస్తున్నది.

ఫాస్ట్ బౌలింగ్ లో జస్ ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, హార్దిక్ పాండ్య, ఆడమ్ మిల్నే, మిచెల్ మెక్ల్ నేగన్, జేసన్ బెహ్ రెండార్ఫ్, బరీందర్ శ్రాన్ లతో ముంబై జాబితా చాలా పొడుగ్గానే ఉంది. కృనాల్ పాండ్య, మాయాంక్ మార్కుండే, జయంత్ యాదవ్, రాహుల్ చహార్, అనుకూల్ రాయ్ లు ప్రధాన స్పిన్నర్లు.

ఈ నెల 24న హోం గ్రౌండ్ ముంబైలో ఢిల్లీ క్యాపిటల్స్ ను ముంబై తొలి మ్యాచ్ లో ఢికొంటుది.

(మూర్తి, సీనియర్ జర్నలిస్టు, బెంగుళూరు)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here