Home English రిషభ్ పంత్ వీర బాదుడు, ముంబై ఓటమి

రిషభ్ పంత్ వీర బాదుడు, ముంబై ఓటమి

338
0

ముంబై:

హోమ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 37 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలయ్యింది. రిషభ్ పంత్ వీరవిహారం చేయడంతో ఢిల్లీ 213 పరుగుల భారీ స్కోరుతో సవాల్ విసిరింది. కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ కీన్ పొలార్డ్, యువరాజ్ సింగ్, కృనాల్ పాండ్య తుది దాకా పోరాడారు. అయితే ఢిల్లీ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు పతనం చేస్తూ దెబ్బ కొట్టడంతో ముంబై అంతిమ విజయం సాధించలేక పోయింది.

ఛేజ్ చేయడం ఆరంభించాక మొదటి రెండు మూడు ఓవర్లలో ముంబై స్కోరు  వడివడిగా పరిగెత్తింది. నాలుగో ఓవర్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ఇషాంత్ శర్మ బౌలింగ్ లో రాహుల్ తెవాతియా కు క్యాచ్ ఇచ్చి 14 పరుగులకు అవుటయ్యాడు. అతని స్థానంలో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యర్ విసిరిన డైరెక్ట్ త్రో ధాటికి కేవలం రెండు పరుగులకే నిరాశగా వెనుదిరిగాడు. ఆరో ఓవర్ లో ముంబై స్కోరు 45 పరుగులుండగా ఇషాంత్ బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్ కు క్యాచ్ ఇచ్చి డికాక్ అవుటయ్యాడు. అతను 16 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఓ సిక్స్ తో 27 పరుగులు చేశాడు.

తర్వాత జంట కలిసిన యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్ దూకుడుగా ఆడుతూ 30 బంతుల్లో నాలుగో వికెట్ కు 50 పరుగులు జోడించారు. అయితే 95 స్కోరు వద్ద పొలార్డ్, హర్దిక్ పాండ్య వికెట్లను వెంటవెంటనే కోల్పోవడం ముంబైకి తీవ్ర విఘాతంగా పరిణమించింది. 12వ ఓవర్ ముగిసేసరికే ముంబై 5 వికెట్లకు 101 పరుగులు చేసింది. హార్దిక్ అవుటయ్యాక రంగంలోకి దిగిన అతని సోదరుడు కృనాల్ పాండ్య సుడిగాలిలా బ్యాటింగ్ చేస్తూ 15 బంతుల్లో 5 బౌండరీలు, ఓ సిక్స్ తో 32 పరుగులు చేశాడు. కృనాల్ 15వ ఓవర్ లో బౌల్ట్ బంతిని భారీ షాట్ కొట్టబోయి రాహుల్ తెవాతియాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

16వ ఓవర్ పూర్తయ్యేసరికి ముంబై 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. కృనాల్ నిష్క్రమణానంతరం, భారత మాజీ తార, ఆరు సిక్సర్ల మొనగాడు యువరాజ్ సింగ్ భారీ షాట్లు కొడుతూ దూకుడుగా ఆడసాగాడు. అయితే 17, 18 వ ఓవర్లలో రబడ, బౌల్ట్ దీటుగా బౌలింగ్ చేసి కట్టడి చేశారు. చాలా రోజుల తర్వాత మునుపటి శౌర్యం ప్రదర్శించిన యువరాజ్, రబడ బంతిని 19వ ఓవర్ లో తెవాతియాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. యువరాజ్ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్స్ లతో 53 పరుగులు చేశాడు. దాంతో ఛేజ్ పై ముంబై ఆశలు గల్లంతయ్యాయి.

అంత క్రితం వికెట్ కీపర్ బ్యాట్స్ మన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రిషభ్ పంత్ చెలరేగి ఆడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. 27 బంతుల్లో 78 పరుగులతో అజేయంగా మిగిలిన పంత్ తన విధ్వంసక బ్యాటింగ్ లో ఏడు సిక్సర్ లు, ఏడు బౌండరీలు బాదాడు. ఆరంభంలో ఢిల్లీ ఒకటి రెండు వికెట్లు కోల్పోయి తడబడినా, కొలిన్ ఇన్ గ్రామ్, శిఖర్ ధావన్ ల దీటైన బ్యాటింగ్, చివర్లో పంత్ వీరావేశంతో లీగ్ లో తొలిసారిగా 200 పైబడిన స్కోరు నమోదు చేసింది. చివరి ఏడు ఓవర్లలో ఢిల్లీ 101 పరుగులు జత చేసింది.

టాస్ గెల్చిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకున్నది. పృథ్వీ షా, శిఖర్ ధావన్ ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభించారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన 17 ఏళ్ల రసిఖ్ సలాం, ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ కౌల్టర్ నైల్ ముంబై తరఫున బౌలింగ్ ప్రారంభించారు.

రెండో ఓవర్ లో 10 పరుగుల వద్ద పృథ్వీ షా, 29 పరుగుల వద్ద నాలుగో ఓవర్ లో శ్రేయస్ అయ్యర్ అవుటయ్యారు. అటు తర్వాత ధావన్ కొలిన్ ఇన్ గ్రామ్ కలసి ధాటిగా ఆడుతూ మూడో వికెట్ కు 83 పరుగులు జత చేశారు . 32 బంతుల్లో  ఏడు ఫోర్లు, ఓ సిక్సర్ తో 47 పరుగులు చేసిన ఇన్ గ్రామ్ కటింగ్ బంతిపై భారీ షాట్ కొట్టబోయి హార్దిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 13 ఓవర్లలో ఢిల్లీ 112 పరుగులు చేసింది. 16వ ఓవర్ మొదటి బంతిపై హార్దిక్ పాండ్య బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ధావన్ అవుటయ్యాడు. అప్పటికి ఢిల్లీ స్కోరు 131.

ఇన్ గ్రామ్ వికెట్ పడ్డాక బ్యాటింగ్ కు వచ్చిన రిషభ్ పంత్ వచ్చీరాగానే వీరబాదుడు మొదలెట్టాడు. పంత్ ధాటికి ఢిల్లీకి 15వ ఓవర్ లో 17, 16వ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి.

మెక్లెనాగ్హన్ వేసిన 17వ ఓవర్ అయిదో బంతిపై కీమో పౌల్ అవుటయ్యాడు. అప్పటికి ఢిల్లీ స్కోరు 161 కి చేరుకుంది. మరోవైపు పంత్ ఆరో బౌండరీ బాది కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతని స్కోరులో నాలుగు భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి. యాభై దాటాక మరింత రెచ్చిపోయిన  పంత్ సలాం వేసిన 19వ ఓవర్లో మొత్తం 21 పరుగులు బాదాడు. రిషభ్ పంత్ 78 పరుగులతో అజేయంగా మిగిలాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here