ఐపీఎల్ 2020 లో సూపర్ ఓవర్ కి వెళ్ళిన సూపర్ మ్యాచ్ లు

(CS Saleem Basha)
“చివరి బంతి వేసే వరకు ఏ క్రికెట్ మ్యాచ్ కూడా అయిపోదు”- అన్నది క్రికెట్లో నానుడి.( No match is over until the last ball is bowled) నువ్వా-నేనా అంటూ మొదట్లో సాగి చివరి బంతి వరకు అటా ఇటా అని ప్రేక్షకుల ను ఉత్కంఠతకు గురి చేసి కనువిందు చేస్తాయి. ఆ నానుడిని నిజం చేస్తాయి. “ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరూహించెదరు..” అన్నట్లే క్రికెట్ లో ఏ బంతికి ఏమి జరుగునో ఎవరూ ఊహించలేరు.
చిట్ట చివరి బంతికి ఫలితం తేలిన మ్యాచులు చాలా ఉన్నాయి. అయితే చివరి బంతికి రెండు జట్ల స్కోర్ సమం అయ్యి సూపర్ ఓవర్ కు వెళ్లిన మ్యాచ్ లు కొన్నే ఉంటాయి. వాటిలో కూడా ఐపీఎల్ లోనే ఎక్కువ ఉంటాయి. అందుకే ఐపీఎల్ కి అంత క్రేజ్. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగి సూపర్ ఓవర్ కి వెళ్లిన మ్యాచుల్లో, బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఒకరో ఇద్దరో హీరోలు ఉంటారు.
ఐపీఎల్ 2020 లో ఇప్పటిదాకా, అంటే 28.09.2020 వరకూ రెండు మ్యాచ్ లు సూపర్ ఓవర్ కి వెళ్ళాయి. మొదటిది 20.9.20 తేదీన ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య జరిగింది. రెండోది 28.9.20 తేదీన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. రెండిటిలోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలవడం విశేషం!
సూపర్ ఓవర్ కు వెళ్ళిన మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 39 పరుగులతో బ్యాటింగ్లో రాణించాడు, అలాగే రిషబ్ పంత్ 31 పరుగులు చేసి కొంత స్కోరును పెంచడంలో సహాయపడ్డాడు. మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా రాణించక పోయినా బ్యాటింగ్ హీరో మార్కస్ స్టోయినిస్ చెలరేగి పోయి 21 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన పంజాబ్ జట్టు చివరి బంతి దాకా మ్యాచ్ తీసుకెళ్ళింది. మయాంక్ అగర్వాల్ చక్కగా ఆడి 89 పరుగులు చేశాడు. కానీ చివర్లో అవుట్ అయిపోయాడు. చివరి ఓవర్లో 13 పరుగులు చేయవలసిన పరిస్థితిలో పంజాబ్ జట్టు ఆశల మీద నీళ్లు చల్లాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మార్కస్ స్టోయినిస్. కీలకమైన దశలో రెండు వికెట్లు తీసి పంజాబ్ ను దెబ్బతీశాడు. చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సిన దశలో క్రిస్ జోర్డాన్ వికెట్ తీసి మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లాడు. బౌండరీకి మళ్ళీంచవలసిన చాలా సులభమైన ఫుల్ టాస్ బంతిని సరిగ్గా ఆడలేక క్యాచ్ ఇచ్చి జోర్డాన్ అవుట్ కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కి వెళ్ళింది.
సూపర్ ఓవర్ లో పంజాబ్ చేసిన తప్పు ఏంటంటే 89 పరుగులు చేసి జట్టును ఆదుకున్న మయాంక్ అగర్వాల్ ను బ్యాటింగ్ కు పంపకపోవడం. అది పంజాబ్ ను బాగా దెబ్బతీసింది. కేఎల్ రాహుల్ మరియు నికోలస్ పూరన్ బ్యాటింగ్ కు దిగగా కేఎల్ రాహుల్ రెండు పరుగులు సాధించి అవుటయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ కూడా అవుటయ్యాడు. పంజాబ్ జట్టు కేవలం రెండు పరుగులు మాత్రమే చేసింది . ఇంతవరకు ఐపీఎల్ లో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్ ల్లో ఇదే అతి తక్కువ స్కోరు. తర్వాత బ్యాటింగ్ దిగిన శ్రేయస్ అయ్యర్ మరియు రిషబ్ పంత్ రెండు బంతుల్లో 2 పరుగులు సాధించి మ్యాచ్ గెలిచారు.
28.9.20 తేదీన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య సూపర్ ఓవర్ వరకూ జరిగిన మ్యాచ్ గురించి మరోసారి చూద్దాం.
Saleem Basha CS

 

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)