Home English రసెల్ ధాటికి చిత్తుగా ఓడిన హైదరాబాద్

రసెల్ ధాటికి చిత్తుగా ఓడిన హైదరాబాద్

415
0

కోల్కతా: ఇడెన్ గార్డెన్స్ లో ఆదివారం కెకె ఆర్ తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం పాలయింది. నితిన్ రానా, ఆండ్రీ రసెల్ స్వైర విహారంలో హైదరాబాద్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.

ముందుగా బ్యాట్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 85, విజయ శంకర్ 40 పరుగులు చేశారు. అయితే 19 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చివరి నాలుగు ఓవర్లలో 49 పరుగులు చేసిన రసెల్ హైదరాబాద్ ఆశలు అడియాసలు చేశాడు.

స్పిన్నర్ తో రెండో ఓవర్ బౌల్ చేయించే సంప్రదాయాన్ని హైదరాబాద్ కూడా కొనసాగించింది. నిజానికి ఈ పాచిక పారింది కూడా. షకీబ్ అల్ హసన్ వేసిన రెండో ఓవర్ చివరి బంతిపై ఓపెనర్ క్రిస్ లిన్ భారీ షాట్ ఆడబోయి కవర్ పాయింట్ లో రషీద్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంకో ఓపెనర్ నితీష్ రానా తర్వాత వచ్చిన రాబిన్ ఊతప్పతో కలిసి ధాటిగా ఆడుతూ పరుగుల వేగం పెంచాడు.

కోల్కతా జట్టు ఏడో ఓవర్ లో 50 పరుగులు దాటింది.  10 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. 11 వ ఓవర్ నాలుగో బంతిపై రాబిన్ ఊతప్ప ను సిద్ధార్థ్ కౌల్ బౌల్ చేశాడు. 27 బంతుల్లో మూడు బౌండరీలు ఓ సిక్సర్ తో అతను 35 పరుగులు చేశాడు.

12వ ఓవర్ నాలుగో బంతిపై దినేష్ కార్తిక్ వికెట్ ను కెకెఆర్ కోల్పోయింది. సందీప్ శర్మ బంతిపై భువనేశ్వర్ కుమార్ కు క్యాచ్ ఇచ్చిన  దినేష్ నాలుగు బంతుల్లో రెండే పరుగులు చేశాడు.

13 ఓవర్లలో కోల్కతా 100 పరుగులు దాటింది. మరో వైపు 35 బంతుల్లో రానా అర్ధ సెంచరీ పూర్తయింది.

15వ ఓవర్ లో ఫ్లడ్ లైట్లు మొరాయించడంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. అటు తర్వాతి మొదటి బంతికే రషీద్ ఖాన్ బౌలింగ్ లో నితీశ్ రానా ఎల్ బి డబ్ల్యు అయ్యాడు. రానా 43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు.

17 ఓవర్లు పూర్తయ్యేసరికి కెకెఆర్ 129 పరుగులు చేసింది.  18 వ ఓవర్ లో 19 పరుగులు వచ్చాయి. సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్ లో ఆండ్రీ రసెల్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. మూడవ, నాల్గవ బంతులపై సింగిల్స్ వచ్చాయి. అయిదో బంతిని రసెల్ ఫోర్ కొట్టాడు.

భువనేశ్వర్ వేసిన 19 వ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. రసెల్ రెండు ఫోర్లు, రెండు సిక్స్ లు బాదాడు. చివరి ఓవర్ లో విజృంభించడం శుభం గిల్ వంతయింది. షకీబ్ అల్ హసన్ విసిరిన రెండవ, మూడవ బంతులపై గిల్ సిక్సర్లు కొట్టి కెకెఆర్ ను విజయతీరం చేర్చాడు.

అంత క్రితం టాస్ గెల్చిన కెకెఆర్ ఎస్సార్ హెచ్ ని బ్యాటింగ్ కి దించింది. బాల్ ట్యాంపరింగ్ కేసులో ఏడాది పాటు నిషేధం అనుభవించాక తిరిగి రంగ ప్రవేశం చేసిన డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్ కు చెందిన జానీ బార్ స్టోతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఏడాది అజ్ఞాత వాసం  తనపై మాత్రం ప్రభావం చూపలేదని నిరూపించడానికే అన్నట్టు వార్నర్ మొదటి బంతి నుంచే ధాటిగా ఆడటం ఆరంభించాడు. బౌండరీల మీద బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో ఓవర్ కే స్పిన్నర్ పీయూష్ చావ్లాను ప్రవేశపెట్టినా లాభం లేకపోయింది. అతని బౌలింగ్ లోనే వార్నర్ రెండు బౌండరీలు కొట్టాడు. మొదట్లో కాస్త తడబడిన బార్ స్టో కూడా క్రమక్రమంగా పుంజుకో సాగాడు.

హైదరాబాద్ స్కోరు ఐదో ఓవర్ దాటే సరికి 50 పరుగులు, ఎనిమిదో ఓవర్ కు 70 పరుగులు దాటింది. వాళ్లిద్దరి దూకుడుకు కళ్లెం వేసేందుకు తన వద్ద ఉన్న అన్ని అస్త్రాలను వినియోగించింది. వార్నర్, బార్ స్టోలను కట్టడి చేసేందుకై  మొదటి ఏడు ఓవర్లలోనే ఫెర్గూసన్, కుల్ దీప్ యాదవ్ లతో సహా కెకెఆర్ మొత్తం ఐదుగురు బౌలర్ లను వినియోగించింది. 10.5 ఓవర్లలో హైదరాబాద్ 100 పరుగులు చేసింది. 33 బంతుల్లో ఎనిమిది బౌం

డరీలు ఓ సిక్సర్ తో వార్నర్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

ఎట్టకేలకు 13వ ఓవర్ లో పీయూష్ చావ్లా బంతిపై బార్ స్టో క్లీన్ బౌల్ అయ్యాడు. అతను 35 బంతుల్లో మూడు బౌండరీలు,  ఓ సిక్సర్ తో 39 పరుగులు చేశాడు. ఆ సరికి హైదరాబాద్ 12.5 ఓవర్లలో 118 పరుగులు చేసింది.

చండ ప్రచండంగా బ్యాటింగ్ చేసి కెకెఆర్ బౌలర్లను చీల్చి చెండాడిన వార్నర్ 53 బంతుల్లో తొమ్మిది ఫోర్ లు, మూడు సిక్సర్లతో 85 పరుగులు చేసిన ఆండ్రీ రసెల్ బంతిని షాట్ కొట్టబోయి రాబిన్ ఊతప్పకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 16వ ఓవర్ చివరి బంతిపై వార్నర్ అవుటయ్యేసరికి హైదరాబాద్ 144 పరుగులు చేసింది.

వార్నర్ అవుటయ్యాక హైదరాబాద్ పరుగుల వేగం కాస్త తగ్గింది. అయితే ఆల్ రౌండర్ విజయ శంకర్ దూకుడు పెంచడంతో 20 ఓవర్లు పూర్తయ్యే సరికి హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. శంకర్ 24 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్ లతో 40 పరుగులు చేశాడు.

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here