వాన కోసం అనంతపురం జిల్లాలో ఇలా వేడుకుంటున్నారు (వీడియో)

(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి)
హరి హర శివయ: శివయా:….. అంటూ సీమ పల్లెలు ఒక్క పదును వానకోసం జీరపోయిన ఆర్ధ్రగొంతుకలతో వేడుకుంటున్నాయి.
పత్రికలలో ఏ జోన్ పేజి తిరగేసినా ఒక్కవాన కోసం సీమ ప్రజలు శతవిధాలుగా తమకు చివరి దిక్కైన భగవంతుని వేడుకోవడం కనిపిస్తుంది.
భాగవతంలో గజేంద్రుడి ఆర్తనాదం కన్నా సీమ రైతన్నల కన్నీళ్ళ నాదం తక్కువేమికాదు. శివుడు గంగను తన జడలో నిలుపునొన్నడంటారు. ఆ శివుడి మనసైన కరిగి నాలుగు చినుకులు కురిపించకపోతాడా అనే ఆశ అయితే కొనసాగుతుంది.
గత నెల రోజులుగా అదిగో ఋతుపవనాలు, ఇదిగో ఋతుపవనాలు అని ఊరడించాయి.
ఒక్కో మేఘం సీమను దాటిపోతున్నాయి కానీ కాసింత వానగా మాత్రం మారడం లేదు.
ఇది ఈరోజు సమస్య కాదు ..తరతరాలుగా సీమ వాసులు అనుభవిస్తున్నదే. సహజంగా సీమలో వానలు పడి పంటలు పండే రోజులు ఇంక కలగానే మిగిలిపోవచ్చు.
అరకొర వాన వస్తే చాలు అదే ఈ ప్రాంత ప్రజలకు పత్రికలలో పెద్ద వార్త అవుతోందంటే పరిస్థితి అంచనా వేయవచ్చు.
ఈ సంవత్సరం ఇప్పటివరకు ఉత్తర, మధ్య కోస్తాంధ్ర లో 250 మి.మీ వర్షపాతం నమోదు కాగా అనంతపురము జిల్లాలో 70 మి.మీ వర్షపాతం నమోదు కావడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతుంది.
కోస్తాంధ్రలో కనీసం మూడేళ్ళకు ఒక సారి వర్షాధార పంటలు సాగు చేసి, నదుల్లోని నీటిని సీమ చెరువులకు అందివ్వ గలిగితే కొద్దో గొప్పో సీమలో జీవావరణ వ్యవస్థ కాపాడు కొనే అవకాశం ఉంటాది.
ఇందుకు తీర ప్రాంత సోదరులు స్వచ్చందంగా ముందుకు వచ్చి సీమకు అండగా నిలబడాలి. చరిత్రలో ఎన్నో సందర్భాలలో సీమ ప్రాంతం అందరికీ అండగా నిలిచింది. ఇపుడు దిక్కులేనిదిగా మిగులుతోంది.
రాయలసీమ ప్రాంతం నదుల్లోని నీళ్ళన్ని వాడేసుకోవాలని, ముక్కార్లు పంటలు పండించుకోవాలని అత్యాశ అయితే లేదు. కనీసం రాజ్యంగం ప్రకారం జీవించే హక్కు మేరకైన అవసరమని భావిస్తుంది.
సీమ భూ భాగంలో ప్రకృతి సహజంగా వానలు కురిసి పంటలు పండే కాలం రావాలని కోరు కొంటుంది. ఇది సాకారం కావాలంటే ప్రభుత్వాలు, ప్రజలు ఉమ్మడిగా కొన్ని దశాబ్దాలు కృషి చేయవలసి ఉంది.
కరువు నేలంతా పచ్చని చెట్లతో నింపవలసి ఉంది. పడే ప్రతి చినుకు భూమిలోకి ఇంకేలా చేయవలసి ఉంది. కొంత ఆలస్యమే కావచ్చు కానీ పచ్చని సీమ కోసం , భావితరాలకోసం సమయాత్తం కాక తప్పదు.
అది చేరుకొనే వరకైనా సీమకు నదుల నుండి నీళ్ళు కావాలి. కనీసం ఎడాదికి మూడు తడులై ఆపాత్కాలంలో సీమ వాసులు పొందే వెసులు బాటు ఉండాలి. అదికూడా పోందలేని నిస్సహాయ స్థితిలోకి సీమ ప్రజలను నెట్టివేసే తంతు ఎల్లకాలం సాగదు. సాగనివ్వం.
దేవుడే దిక్కని బోరున అరుస్తున్న మాకు ఆ దేవుడే లేడనే స్థితికి చేరుకొన్ననాడు మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు. “ఇపుడు మా సీమ చేలల్లో విత్తనాలు పడకపోవచ్చు . ఎండిన మా మనసుల్లో బీజాలైతే పడుతున్నాయి.”
( వీడియో.. కళ్యాణదుర్గం మండలం, నారాయణపురం గ్రామస్థులు వానకోసం గ్రామలు రాముల‌పటంతో ఏడు గ్రామాలు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా)