కేసిఆర్ ను ఎదుర్కొనేందుకు రేవంత్ కొత్త స్కెచ్

ముల్లును ముల్లుతోటే తియ్యాలె…
కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతం.
అవతలోడు కబడ్డీ ఆడితే మనం క్యారంబోర్డు అడితే చెల్లదు.
అవతలోడు కుస్తీ పోటీకి వస్తే మనం కోకో ఆడితే నడవదు.

ఇలాంటి డైలాగులు మనం చాలా సందర్భాల్లో విన్నం కదా? సరిగ్గా ఈ డైలాగుల్లో కొన్ని రేవంత్ రెడ్డి నోటినుంచి వచ్చినవైతే.. మరికొన్ని రేవంత్ అనుసరించేవి. మొత్తానికి కేసిఆర్ వ్యూహాలను ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో వ్యూహాలను అనుసరిస్తున్నారు. అయితే అన్నిసార్లు కేసిఆర్ మీద గెలవడం సాధ్యం కాదన్న విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ అవతల కబడ్డీ ఆడినప్పుడు మనం కూడా కబడ్డే ఆడాలన్న పాలసీ రేవంత్ ది. అందుకే కేసిఆర్ ను ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి తాజాగా కొత్త అస్త్రం బయటకు తీశారు. మరి అది ఏమేరకు వర్కువుట్ అవుతుంది? దాంతో కేసిఆర్ ను ఇరుకునపెడతారా? లేక యావత్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెడతారా అన్నది చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు చదవండి.

ఉన్నట్లుండి ఓటుకు నోటు కేసులో తీవ్రమైన కదలికలు.. ఓటుకు నోటు కేసులో ఏదో జరగబోతుందంటూ మీడియాలో ప్రచారం. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి వీడియోలతో సహా దొరికినప్పటికంటే ఇప్పుడు హడావిడి గింతంత ఎక్కువగానే ఉన్నది. సడెన్ గా ఓటుకు నోటు కేసు ఎందుకు తెర మీదకు వచ్చిందన్నదానిపై ఎవరి వాదన వారు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో రెండు ప్రధాన ఉద్దేశాలు కనబడుతున్నాయి. అందులో ఒకటి తెలంగాణలో రేపో మాపో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి దక్కుతుందని ప్రచారం ఉంది. ఆ పదవి రాకుండా ఉండేందుకు ఓటుకు నోటు తెరపైకి తెచ్చారన్న వాదనలో నిజం లేకపోలేదు. మరో వాదన ఏమంటే? ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై పోరాటం పేరుతో హడావిడి మొదలు పెట్టారు. బిజెపికి కంటిలో నలుసులా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టే బలమైన ఆయుధం కేంద్రం చేతిలో ఉన్నట్లు కనిపించడంలేదు. అందుకే లోపాయికారిగా టిఆర్ఎస్ పై వత్తిడి తెచ్చి ఓటుకు నోటు కేసును కదిలించారన్నది. ఈ రెండు వాదనల్లో నిజాలెంత? అబద్ధాలెంత అన్నది ఆచరణలో తేలాల్సి ఉంది.

ఓటుకు నోటు కేసుపై కేసిఆర్ సుదీర్ఘ సమీక్ష జరపడం.. పత్రికల్లో పతాక శీర్షికలతో ఆ వార్తలు రావడం జరిగిపోయాయి. దీనికి రేవంత్ కౌంటర్ కూడా ఇచ్చారు. రేవంత్ కౌంటర్ లో కేసిఆర్ బంధువులైన నిమ్స్ డైరెక్టర్ శేషగిరిరావు, పోలీసు అధికారి సంజీవరావు అవినీతి కేసులను ఉపసంహరించుకున్నారని చెప్పారు. అంతేకాదు ఆ మాట చెబుతూనే హెచ్ఎండిఎ అధికారి పురుషోత్తం రెడ్డి మీద సర్కారు ముప్పేట దాడి చేసిందని, కసబ్ కుటుంబం కంటే హీనంగా పురుషోత్తం రెడ్డి కుటుంబాన్ని బజారులో నిలబెట్టారని రేవంత్ ఆరోపించారు. అంతేకాదు పురుషోత్తం రెడ్డికి సహకరించారన్న ఆరోపణలతో అశోక్ కుమార్ అనే బలహీన వర్గానికి చెందిన అధికారి మీద కూడా వేటేశారని రేవంత్ చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి రేవంత్ ఒక బలమైన వాదన రాజకీయ తెర మీదకు తీసుకొచ్చారు.

తెలంగాణలో అధికారంలో ఉన్నది కేసిఆర్. అంటే వెలమ కులం అధికారంలో ఉంది. అందుకే వెలమ కులస్థులు అవినీతి చేసినా కేసులు మాఫీ అవుతున్నాయి… కానీ అదే రెడ్డి కులానికి చెందిన వారి కేసులు బలహీనంగా ఉన్నా అభాసుపాలు చేస్తున్నారు. దాంతోపాటు బలహీనవర్గాలకు అంటే బిసిలకు చెందిన అధికారిని సైతం వేధిస్తున్నారు. అన్నది రేవంత్ చెప్పదలుచుకున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వెలమ కులస్థులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెడ్డి, బిసిలను అణగదొక్కుతున్నారన్న సందేశం రేవంత్ సిఎల్పీ ప్రెస్ మీట్ వేదికగా జనాలకు ఇచ్చినట్లు అర్థమవుతోంది. తెలంగాణలో రెడ్డీలను, బిసిలను కేసిఆర్ సర్కారు చిన్నచూపు చూస్తోందన్న వాదనను రేవంత్ తెర మీదకు తెచ్చారు.

మరి రేవంత్ తెచ్చిన ఈ కొత్త వాదన టిఆర్ఎస్ ను ఏమేరకు ఇరుకునపెడుతుందన్నది తేలాల్సి ఉంది. అయితే ఇటీవల కాలంలో టిఆర్ఎస్ పార్టీ మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి కేసిఆర్ బంధువైన సంతోష్ కు కట్టబెట్టగా మిగతా రెండు సీట్లను బిసి సామాజికవర్గానికే కట్టబెట్టారు. మరి ఈ పరిస్థితుల్లో బిసిలను తెలంగాణ సర్కారు వేధిస్తున్నది అన్న రేవంత్ వాదనకు జనాల్లో ఏమేరకు బలం చేకూరుతుందో చూడాల్సి ఉంది. మరోవైపు పురుషోత్తం రెడ్డి కుటుంబాన్ని కసబ్, దావుద్ ఇబ్రహీం కుటుంబాలకంటే హీనంగా ప్రచారం చేశారని రేవంత్ అన్నారు. మరి రెడ్డి సామాజికవర్గాన్ని టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా నడిపించే ప్రయత్నం చేశారు. అంతేకాదు టిఆర్ఎస్ సర్కారు మీద రెడ్డి సామాజికవర్గంలో తీవ్రమైన అసంతృప్తి ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ చేసిన రెడ్డి, బిసి వాదనలు సరికొత్త చర్చను అయితే లేవనెత్తాయని అంటున్నారు. ఈ విషయంలో రేవంత్ పాచిక ఏమేరకు పారుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *