ఆర్మూరు టిఆర్ఎస్ లో బంగారు దొంగలు

వీళ్లు చాలా హాట్ గురూ

తెలంగాణ రాష్ట్రంలో పాలక పెద్దలు మొదలుకొని చోటా మోటా లీడర్లంతా వినిపించే మంత్రం ఒకటే… అదేమంటే బంగారు తెలంగాణ. టిఆర్ఎస్ నేతలు ఎక్కడ చూసినా బంగారు తెలంగాణ సాధిస్తాం అని డైలాగులు కొడుతున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం మొదలైందని స్పీచ్ లు దంచుతున్నరు. బంగారు తెలంగాణ ముచ్చట ఏమో కానీ నిజామాబాద్ జిల్లాలో కొందరు టిఆర్ఎస్ నేతలు బంగారు దొంగల అవతారమెత్తారు. పోలీసులు గుర్తు పట్టి వాళ్ల వద్ద ఉన్న దొంగ బంగారాన్ని కక్కించారు.  నిజామాబాద్ జిల్లాలో అధికార టిఆర్ఎస్ పార్టీ బంగారు దొంగల వ్యవహారం హాట్ టాపిక్ అయింది. మరిన్ని వివరాలు కింద చదవండి.

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు పట్టణంలో బంగారం దోపిడీ కేసులో ముగ్గురు టిఆర్ఎస్ నేతలు ఇరుక్కుని కేసులపాలయ్యారు. వారు ముగ్గురు కూడా సాదా సీద లీడర్లు కాదు అందులో ఆర్మూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త కూడా ఒక నిందితుడుగా ఉన్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన భూపాల్ మున్నా అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తూ ఆర్మూర్ లో నివసిస్తున్నాడు. అయితే అతడు ఇటీవల బంగారు ఆభరణాలు చేపించి ఇస్తానంటూ ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని సేకరించాడు. కానీ కొద్ది కాలం తర్వాత బంగారు ఆభరణాలు చేయించి ఇవ్వకుండా రాత్రికి రాత్రే జంప్ అయ్యిండు. దాదాపు 3 కిలోల బంగారాన్ని తీసుకుని భూపాల్ పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఇంతవరకు బాగానే ఉంది కానీ.. అసలు కథ ఇక్కడే మొదలైంది. భూపాల్ బంగారంతో పారిపోతున్న సమయంలో ఆర్మూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త సంజయ్ సింగ్ బబ్లూ, జంబి హనుమాన్ ఆలయ కమిటీ ఛైర్మన్, టిఆర్ఎస్ నాయకుడు సుంకరి రంగన్న, ఆర్మూరు పట్టణంలోని 11వ వార్డు కౌన్సిలర్ భర్త పింజ వినోద్ లు భూపాల్ ను బెదిరించి అతడి వద్ద నుంచి కొంత బంగారం, కొంత నగదును కొట్టేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. దీంతో వారి వద్ద దొంగ బంగారం ఉన్నముచ్చట వాస్తవమేనని అంగీకరించారని పోలీసులు చెబుతున్నారు.

భూపాల్ వద్ద తీసుకున్న దొంగ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నేతల నుంచి 617 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11 వార్డు కౌన్సిలర్ భర్త పింజ వినోద్ నుంచి 104 గ్రాములు, సుంకరి రంగన్న నుంచి 208 గ్రాములు, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ భర్త నుంచి 305 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 23 న తేదీన బంగారు నగలు తయారుదారుడు బెంగాల్ కు చెందిన భూపాల్ అనే 3 కిలోల బంగారం తో పరారీ అయిన విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపడితే టిఆర్ఎస్ నేతలు కూడా ఇరుక్కుపోయారు. ముగ్గురు టిఆర్ఎస్ నేతల మీద ఆర్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరి అధికార పార్టీ పెద్ద తలకాయలు ఇందులో నిందితులుగా ఉన్నారు కాబట్టి ప్రపంచం మెచ్చిన ఫెండ్లీ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతారా? లేక నయీం కేసులాగే నీరుగారుస్తారా అన్నది ఇప్పుడు తెలంగాణ జనాల్లో నడుస్తున్న హాట్ టాపిక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *