Home Breaking ఢిల్లీ ఆంధ్ర భవన్ లో సంక్రాంతి సంబరాలు

ఢిల్లీ ఆంధ్ర భవన్ లో సంక్రాంతి సంబరాలు

212
0

దేశరాజధాని హస్తినలో 4 రోజుల  సంక్రాంతి సంబరాలు వైభవంగా మొదలయ్యాయి.  మొదటి రోజు శనివారం ఉదయం 10.గంటల కార్యక్రమాలు మొదలయ్యాయి.  ఢిల్లీ, ఢిల్లీ చుట్టుప్రక్కల వున్న తెలుగు, తెలుగేతరులతో ఉత్సవాలకు కేంద్రం మయిన ఆంధ్ర భవన్ (ఎపి భవన్)లో సందడి నెలకొంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నది.  మొదటి రోజు 12వ తేదీ శనివారం ఉదయం 10గంటలనుంచి ప్రారంభమయి కార్యక్రమాలలో చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదటగా ఎపి భవన్ నిర్వహిస్తున్న వివిధ పోటీల కొరకు తమ తమ పేర్లను నమోదు చేసుకొని సాయంత్రం వరకు జరిగిన చిత్రలేఖనం, సంగీతం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, పొడుపు కధల పోటీలలో అత్యంత ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.

ఉదయం 10.30 గంటలకు ప్రదర్శించిన నూతన చలన చిత్రం ఎన్ టి ఆర్ కథానాయకుడు కు అంబేడ్కర్ ఆడిటోరియం క్రిక్కిరిసిపోయింది. చిన్నారులకొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉయ్యాలబల్లలు, జెయింట్ వీల్, రంగులరాట్నం, బ్యాటరీ కార్లు, మోటార్ సైకిల్స్, జంబో బెలూన్స్ తో చిన్నారులు సాయంత్రం వరకు ఉత్సాహంగా ఆడుకున్నారు.

వెంకటేశ్వర రావు బృందం డప్పులతో ఆంధ్ర ప్రదేశ్ భవన్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. సాయంత్రం పల్లె కోకిల శ్రీమతి బేబీ సంగీత విభావరి ప్రేక్షకులను ఆనంద డోలికలలో ఊగించాయి. ఆ తదుపరి శ్రీమతి అరుణ సుబ్బా రావు బృందం ఆలపించిన జానపద గీతాలు ఆద్యంతం అలరించాయి. ఆఖరున ఉదయం నుంచి జరిగిన వివిద పోటీలలో గెలుపొందినవారికి ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ బహుమతులు, ;ప్రశంసా పత్రాలను బహుకరించారు.

ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ఆంధ్ర బజార్ లో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి పొందిన వెంకటిగిరి, మంగళగిరి, చేనేత వస్త్రాలు, మచిలీపట్టణం కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, వన్ గ్రామ్ గోల్డ్, ఆప్కో, లేపాక్షి, తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణల విక్రయశాల, ఆంధ్ర పిండి వంటకాలైన బందరు లడ్డు, మల్లయ్య కాజాలు, అరిసెలు, పూత రేకుల స్టాల్ల్స్ కు విపరీతమైన తాకిడితో క్రిక్కిరిసిపోయాయి. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ప్రదర్శించిన F 2 చలన చిత్రానికి ప్రేక్షకులతో ఆడిటోరియం నిండిపోయింది.

ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పులిహోర, చక్కర పొంగలి వచ్చిన వారందరూ సంతృప్తిగా ఆరగించి తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. రాత్రి కార్యక్రమాల అనంతరం ఆంధ్ర ప్రదేశ్ భవన్ వారు ఏర్పాటు చేసిన విందుకు ప్రవాసాంధ్రులు రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ కు కృతజ్ఞతలు వెలిబుచ్చారు. సంక్రాంతి వేడుకలను ఇంత ఘనంగా ఏర్పాటు చేసి సొంత ఊళ్లకు పోలేక పోయామన్న అసంతృప్తి లేకుండా ఎంతో ఆహ్లాదంగా ఈ నాలుగు రోజులు జరుపుకొనేలా చేసిన ప్రవీణ్ ప్రకాష్ గారికి, వారి సిబ్బందికి తమ సంతోషాన్ని తెలిపారు.

రెండవ రోజు 13.01.2019 (ఆదివారం) కార్యక్రమాలు:
రెండవ రోజున “హస్తినలో 2019 ఉత్తమ కూచిపూడి నృత్య బృందం పోటీలు” నిర్వహించి విజేతలకు నగదు బహుమతిని అందచేయనున్నారు. సాయంత్రం ప్రసిద్ధ నేపధ్య గాయకుడు కళారత్న శ్రీ ఎల్. వి. గంగాధర శాస్త్రి గారిచే సంక్రాంతి గీతాంజలి, శ్రీమతి అనురాధ గారిచే వీణా నాదం, డా. చింతా రవి బాల కృష్ణ బృందం చే అన్నమయ్య వైభవం కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఉదయం N T R , సాయంత్రంవినయ విధేయ రామ చలన చిత్రాలు ప్రదర్శించనున్నారని తెలిపారు.

రాబోయే మూడు రోజులు ఢిల్లీ లోని తెలుగు వారందరూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సంక్రాంతి సంబరాలకు రావడమే కాకుండా ఢిల్లీ లోని తెలుగేతరులకు కూడా తెలిపి వారికి మన సంస్కృతీ, సంప్రదాయాలను చూపించాలని రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here