Home English విజయ్ సాయ్ రెడ్డి గీతోపదేశం, నిజమా, ఫేకా? (వీడియో)

విజయ్ సాయ్ రెడ్డి గీతోపదేశం, నిజమా, ఫేకా? (వీడియో)

SHARE

(యనమల నాగిరెడ్డి)

“మహాభారత యుద్ధంలో శ్రీకృష్టుడు అర్జునుడికి గీత భోదించి యుద్దోన్ముఖుడిని చేశారు.”  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణరంగంలో వైస్సార్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్టీ క్యాడర్ కు ఎన్నికల గీత భోదించి ఎన్నికల రణానికి కార్యోన్ముఖులను చేయడానికి తన గీతోపదేశం తో కూడిన ఒక ఆడియోను సోషియల్ మీడియా లో విడుదల చేశారు. అది వైరలయ్యింది. పెద్ద చర్చకు దారి తీసింది. దీనిని తెలుగుదేశం పార్టీ తన ప్రచారానికి ఉపయోగించుకుంటున్నది. ఆంధ్రవాళ్లను కించపరిచాడని టిడిపి గోల చేస్తున్నది.

విజయ్ సాయి రెడ్డి  వైసిపిలో పార్టీలో నెంబర్ టు కాకపోయినా ఒక పెద్ద మనిషి. జగన్ తో కష్టాలు నష్టాలు పంచుకుంటున్న వ్యక్తి. జగన్ మీద ప్రతికేసులో ఆయన ఉన్నారు. జగన్ పార్టీ పెట్టేటపుడు ఆయన ఉన్నారు. పెట్టాక ఆయననురాజ్యసభకు పంపారు. ఆయన జగన్ రాయబారిగా ఢిల్లీలో ఉన్నారు. ఆయన తరచూ ప్రధాని కార్యాలయంలో కనిపించడం కూడా ఆ మధ్యవిమర్శలకు తావించింది. అలాంటి విజయ్ సాయి రెడ్డి పిలుపును మోసుకొచ్చినందునే ఈ ఆడియో వైరలయింది. ఇది నిజమైనదవునో కాదో తెలియదు.దీనికి అధికారికంగా ఎవరూ ఖండించలేదు. కాకపోతే, ఆంధ్ర జ్యోతి మీద కేసు వేశారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది…

ఇదీ ఆ  ఆడియో…

ఆయన ఏమన్నారంటే…

ప్రజలలో చంద్రబాబుపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని దానిని ఓటుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలని, ఆ తర్వాతనే గెలుపు పాట  పాడాలని ఆయన కార్యకర్తలను, పార్టీ నాయకులను కోరారు. చంద్రబాబుపై వ్యతిరేకత ఉన్నంత మాత్రాన అది జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేసినట్లు కాదని, అనేక రకాల సర్వే రిపోర్టుల ఆధారంగా జగన్ గెలిచిపోయాడని, పోలింగ్ కేంద్రాలు తెరవడం, ఓటర్లు తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేసేయడం, ఆ తర్వాత గెలిచి జగన్  ప్రమాణస్వీకారం చేసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడమే మిగిలిందని వైస్సార్ పార్టీ అభిమానులు భ్రమలలో ఉన్నారని ఆయన అన్నారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను జగన్ కు ఓట్లుగా మార్చడానికి కృషి చేయాలని, ఓట్లు వేయించేంత వరకు అందరు శ్రమించాలని, ఆ తర్వాతనే కలలు కనాలని ఆయన కోరారు.

జగన్ మోహన్ రెడ్డిని ఆయన బంధువులు, ముఖ్య అనుచరులు సర్వేల పేరుతో భ్రమలలో ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు. 2014లో కూడా ఇలాంటి భ్రమలు కల్పించి జగన్ ను ఓటమి పాలు చేశారని  గుర్తు చేశారు. 2019లో ఈ పరిస్థితి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు.

ఎన్నికల నిర్వహణలో కాకలు తీరిన చంద్రబాబు  తాను గెలవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారని, ఎన్నికల నిర్వహణలో రాటు తేలిన చంద్రబాబు తన చాకచక్యం  ద్వారా 2009లో రాజశేఖర్ రెడ్డినే నీళ్లు తాపారని, అనేక పధకాలు చేపట్టి విశేష ప్రజాభిమానం పొందిన వైస్సార్ అంతంత మాత్రం మెజారిటీతో గెలిచారని విజయసాయి గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణలో అంతగా అనుభవం లేని జగన్ ఎన్నికల నిర్వహణలో ఉద్దంఢుడైన చంద్రబాబును ఢీ  కొంటున్నారని గుర్తుంచుకోవాలని ఆయన పార్టీ క్యాడర్ను కోరారు.

2014లో ఏమీ బలంలేని చంద్రబాబు బీజేపీ, జనసేన మద్దతుతో ఎన్నికల నిర్వహణలో తన నైపుణ్యాన్ని  రుజువు చేసుకున్నారని అన్నారు. ప్రస్తుత ఎన్నికలలో బీజేపీ మద్దతు లేకపోయినా, జనసేన పోటీలో ఉన్నా, రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు చంద్రబాబు అధీనంలో ఉన్నాయని విజయ సాయి రెడ్డి గుర్తు చేశారు. ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్న చంద్రబాబు ఓటుకు 10  వేలైన ఇవ్వగలడని, డబ్బు తీసుకున్న జనం కృతజ్ఞతతో ఆయనకు ఓట్లు వేసే అవకాశం ఉందని రెడ్డి అన్నారు. కుల, మత, వర్గాలు గా విడిపోయిఉన్న ఆంధ్రా ప్రజలు చివరి నిముషంలో కూడా మారి పోయే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుని ఓడించడం కాగితాల మీద లెక్కలు వేసినంత సులభం కాదని గుర్తుంచుకోవాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు.

మోడీ పైనా ధ్వజం

ప్రధాని మోడీ  స్వార్థపరుడని, నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబును వెంట పెట్టుకుని తిరిగి ఇపుడు విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన “పోలవరాన్ని” ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కేవలం ఆర్థిక దోపిడీ కోసమే కేంద్ర స్థాయిలో వెంకయ్య నాయుడు, అరుణజైట్లీల ద్వారా లాబీయింగ్ చేసి చంద్రబాబు పోలవరాన్ని స్వాధీనం చేసుకున్నారని విజయ సాయి రెడ్డి ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో నిధులుండవని తెలిసినా, చంద్రబాబు దోపిడీకి మద్దతు పలకడానికే పోలవరాన్ని రాష్ట్రానికి మోడీ అప్పగించారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గత నాలుగు సంత్సరాలుగా  చంద్రబాబు ప్రభుత్వం ద్వారా జరిగిన ఆర్థిక దోపిడీ, చేసిన అవకతవకలు, అన్యాయాలు , అవినీతి గురించి మోడీకి తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్ర నిఘా వర్గాలు అన్ని రకాల సమాచారం అందించినా మోడీ మౌనం పాటించారని, ఎన్నికల ముందు ఎన్ని విమర్శనాస్త్రాలు ప్రయోగించినా ఫలితం ఉండదని తెలిసీ డ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.

మనం బలం నిరూపించుకుంటే ఆ తర్వాత వీరంతా వారి అవసరాలకోసం మనకు మద్దతు పలుకుతారని కార్యకర్తలు గుర్తుంచుకోవాలని, మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటె ఎన్నికల కమీషన్ ద్వారా చంద్రబాబు చేస్తున్న ఎన్నికల అక్రమాలకు చెక్ పెట్టించాలని, న్యాయంగా ఎన్నికలు జరిపించాలని  ఆయన డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డికి మోడీ సాయం చేస్తారని, కేసీఆర్ మద్దతు పలుకుతారని ఆశించడంలో తప్పు లేదని, ఐతే వారి సాయంతోనే గెలుస్తామని అతి నమ్మకంతో ఉండటం తప్పని ఆయన కార్యకర్తలకు సూచించారు.

జగన్ మోహన్ రెడ్డికి, చంద్రబాబుకు అత్యంత కీలకమైన ఈ ఎన్నికలలో ఎంతమాత్రం ఏమరుపాటు చూపించినా వైస్సార్ కాంగ్రెస్ అస్తిత్వం, పార్టీ అభిమానులు, వైస్సార్ పేరు ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోతుందని, అదేవిధంగా చంద్రబాబు ఓడితే, ఆయన ఎన్టీఆర్ నుండి లాక్కున్న టీడీపీ కూడా గల్లంతు అవుతుందని విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు. అందువల్ల వైస్సార్ పార్టీ నాయకులు ఇంత  కాలం కన్న కలలను నిజం చేయడానికి ఈ నాలుగు రోజులు గట్టిగా పని చేయాలని ఆయన కోరారు. ఆ ఆడియోలో విజయసాయి రెడ్డి చంద్రబాబు, నరేంద్ర మోడీపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.