నాకు నచ్చిన పాత పాట: నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో…..

(బి వి మూర్తి)
కొన్ని పాత తెలుగు పాటలు వింటుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. భయాలూ, సందేహాలు, తిక్కిరి బిక్కిరి ఆలోచనలన్నీ కొట్టుకుపోయి తేలిగ్గా అనిపిస్తుంది. ఒక్కోసారి సంగీతం, మరోసారి సాహిత్యం, చాలా సార్లు ఈ రెండూ కలిసి మహిమ చూపిస్తాయి. మనసుపైన మంత్రం వేస్తాయి. గొప్ప ఉపశమనం కలిగిస్తాయి. ఎన్నో ఏళ్లుగా నన్ను అలా ప్రభావితం చేస్తున్న ఒక పాట తాలూకు నా అనుభవాలను అందరితో పంచుకోవాలనిపిస్తున్నది. నన్ను మీ ఆత్మీయుడిగా భావించండి. నా లాగా మీరూ ఈ పాట పంచే హాయిలో పరవశించండి.
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో
తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో
తీగసాగెనెందుకో
నాలో నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
ఈ పల్లవిలోనే ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉందేమో అని నాకనిపిస్తుంటుంది. సి నారాయణ రెడ్డికి ఈ పల్లవి ఎలా తోచిందో ఏమో గానీ ఇదో అద్భుతం. అద్భుతాలంతే, ఊరికే అలా జరిగిపోతుంటాయి.
నిన్న లేనిదట ఆ అందం. ఈ రోజేమో నిదుర లేచిందట. నిద్ర కాదు సుమా నిదుర. రా వత్తు లేని నాజూకైన నిదుర. పల్లవిలోని మొదటి పంక్తిని రిపీట్ చేస్తూ చివరలో నాలో అని చేరుస్తాడు. ఈ నాలో అనే మాట చేరే వరకూ ఈ అందం, అది నిదుర లేవడం అంతా బయటి ప్రపంచానికి సంబంధించిందేమో అని పొరబడతాం. నాలో అనే మాట చేరాక, అది వాడి ప్రపంచమనీ, ఆ ప్రేమికుడి లేదా ఆ అక్కినేని నాగేశ్వర్రావుకు చెందిన లోలోపలి ప్రత్యేక ప్రపంచమనీ అర్థమవుతుంది. నిజమే కదా ప్రేమలో పడ్డాక వాడి ప్రపంచమే వేరేగా ఉంటుంది. ఆ అందం ఎందుకు నిదుర లేచిందో అని ప్రశ్న. ఈ పల్లవిలో ఇంకో ప్రశ్న కూడా ఉంది. తెలియరాని రాగమేదో తీగసాగిందట, అది ఎందుకలా జరిగిందన్నది ఇంకో ప్రశ్న. ఈ రాగమేదో తెలియదు కానీ ఇది మాత్రం నిదుర పోవడం లేదు. అయిపోకుండా తీగ సాగుతున్నది. గాత్రం కాదు, వాద్యం. అందుకే తీగ సాగుతున్నది.
విచిత్రమైన ఈ ప్రశ్నలూ, ఈ పరిస్థితి ఏమిటంటే ఈ అబ్బాయి అప్పుడప్పుడే ఆ అమ్మాయిని అంటే జమునను చూశాడు. అదీ కథ. ఇక చూసుకోండి, ఇంకా ఏమేమవుతున్నదో, వీడికి ఏమేం కనిపిస్తున్నదో.
పూచిన ప్రతి తరువొక వధువు
పువ్వు పువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో.. ఓ..
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిన్నటి వరకూ ఎలా ఉందో గానీ ఇప్పుడు మాత్రం ప్రతి పూలచెట్టూ ఒంటి నిండా పువ్వులు తురుముకుని పెళ్లికూతురులా కనిపిస్తున్నది. ప్రతి పువ్వులోనూ తేనె పొంగుతున్నది. సరే అయితే అయ్యింది. ఏమిటి?. మన వాడికి ఈ చరణంలోనూ మనసులో ఇంకో ప్రశ్న. ఈ అందాలన్నీ ఇన్నాళ్లూ మనకి కనబడకుండా ఎక్కడ దాక్కున్నాయబ్బా అని బాధ పడుతున్నాడు.

ఆ అమ్మాయిని, అంటే జమునని చూసినందువల్లే మన వాడి మనసు ఇలా ప్రశ్నపత్రమైపోయిందన్న సంగతి, మనకి, అంటే వీడియోలో ఈ పాట చూస్తున్న వాళ్లకు కూడా మొదటి చరణం పూర్తై పోయాక కూడా సూచనప్రాయంగానైనా తెలియదు.
తెలి నురుగులే నవ్వులు కాగా
సెలయేరులు కులుకుతు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే..
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
తెలి నురుగుల నవ్వులనీ సెలయేళ్ల కులుకులనీ ధరించి ఇప్పుడొస్తుంది జమున పాటలోకి. సెలయేటి తరగల్లో చీర అంచులు తడవకుండా కుచ్చిళ్లు కొంచం పైకెత్తి పట్టుకుని నాజూగ్గా రెండు మూడు అడుగులు అలా గెంతేసరికి, వాడి సంగతి సరే గానీ, మనం కూడా ఆనంద పారవశ్యంలో కళ్లప్పగించి చూస్తుండి పోతాం.
ఈ సారి మాత్రం మన వాడికి ప్రశ్నలేవీ లేవు. కనిపించని వీణలేవో కదలి మ్రోగుతున్నాయని తనలో తాను అనుకుంటున్నాడు కానీ ఎందుకు మ్రోగుతున్నాయని ప్రశ్నంచడం లేదు. ఎందుకంటే వాడికీ అర్థమై పోయింది ఈ స్పందన లన్నింటికీ కారణమేమిటో. సంగతేమిటో తెలిసిపోయాక మరింత భావుకుడై పోతాడు. ఇంక చూపు నేల మీద ఆనదు. ఏకంగా ఆకాశ విహారమే.
పసిడి అంచు పైట జార..ఆ.ఓ..ఓ
పసిడి అంచు పైట జార పయనించే మేఘబాల
అరుణకాంతి సోకగానే పరవశించెనే
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో
భావుకత స్థాయి పెరిగేసరికి ఘంటసాల రాగాలాపనలూ హాయిగా వాటికవే జాలువారుతాయి. పసిడి అంచు పైట జార అని ఆ నాలుగు పదాలు పాడిన తర్వాత కెమెరామెన్ కు కాస్త అవకాశమిద్దాం అన్నట్టు ఆకాశంలో మబ్బులు చూపించడానికి తెరిపి ఇస్తూ ఆలాపన అందుకుంటాడు ఘంటసాల. ఆలాపనంటే ఎంత హాయిగా ఉంటుందో ఈ పాటలోనే వినాలి. నారాయణరెడ్డి ఏర్చి కూర్చిన మాటల మహిమని, ఈ పాట మొత్తం మన మనసులో సృష్టించే మూడ్ ని మరో స్థాయికి తీసుకెళుతుందా ఆలాపన.
ఈ పాట పూజా ఫలం (1964) సినిమాలోది. ఈ సినిమా దర్శకుడు బిఎన్ రెడ్డి భారత చలనచిత్ర చరిత్రలో చిరస్మరణీయుడు. సంగీత దర్శకుడు ర`సాలూరు’ రాజేశ్వర రావు.
అప్పటికి నారాయణ రెడ్డి నూనూగు మీసాల నూత్నయవ్వనంలో ఉన్న పాతబడిన కొత్తకలం. పింగళి, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ వంటి హేమాహేమీల స్వర్ణయుగం నడుస్తున్న కాలంలో `మబ్బులో ఏముంది-నా మనసులో ఏముంది’ అంటూ నారాయణ రెడ్డి రాసిన పాట తెలుగుదేశమంతటా ప్రతిధ్వనించింది.
పూజాఫలం సినిమాకు పాటలు రాసేనాటికే బిఎన్ రెడ్డితో ఎన్నో ఏళ్లుగా సాన్నిహిత్యం ఉన్నట్టు సినారె స్వయంగా `పాటలో ఏముంది’ (సినిమా పాటల రచనానుభవాల గ్రంథం)లో చెప్పుకొచ్చారు. బిఎన్ రెడ్డి గారితో కూర్చుని పాట
రాయడమంటే చిటికెలతో రాసేసినంత సులభం కాదనీ, ఓ నాలుగైదు పేజీల సరుకు రాసి తీసికెళ్లి వాటిలో మీకేది కావాలో మీరే ఎంపిక చేసుకోండంటూ చేతులు దులిపేసుకోడం కుదరదని వివరిస్తారు.
నిజమే, పాట రాయాల్సిన సన్నివేశంతో మమేకమైపోయి, రచయితే నాయకుడుగా తాదాత్మ్యం చెందితేనే తప్ప ఇలాంటి గొప్ప పాటలు పుట్టవు.
పాత తరం సంగీత దర్శకుల్లో అద్వితీయ ప్రతిభావంతుడుగా పేరున్న రాజేశ్వరరావుకి మూడ్ వస్తేనే తప్ప అంబ పలకదని చెప్పేవారు. మూడ్ రానప్పుడు ఊరికే బాణీ కోసం నస పెడితే మీరు వేరే సంగీత దర్శకుడిని చూసుకోండంటూ జంత్రవాద్యాలను విసిరికొట్టి విసురుగా వెళ్లిపోయేవారట. అలాంటి రాజేశ్వరరావు పూజాఫలంలో నిన్న లేని అందమేదో పాటతో పాటు `పగలే వెన్నెల-జగమే ఊయల’ అనే మరో ఆణిముత్యం లాంటి పాటను ఒకే సిట్టింగ్ లో బాణీ కూర్చినట్టు ఓ వ్యాసంలో చదివాను.
ఇంక ఘంటసాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తెలుగు పాటకు తల్లీ, తండ్రీ, గురువూ, దైవం అన్నీ ఆయనే. పాట విద్యలో ఘంటసాల నవరసాల షావుకారు. మంచి కవిత్వానికి సరితూగ గల సంగీతం కూడా తోడైనప్పుడు ఆయన గొంతు మనల్ని కనివినిఎరుగని సరికొత్త లోకాలకు తీసుకెళ్లి పోతుంది. మైమరిచిపోయేలా చేస్తుంది. కావాలంటే మీరే తరచి చూసుకోండి. ఇంకోసారి వినండి ఆ పాటను.