వాదనలు ముగిశాయి, ఇంతకీ అయోధ్య గొడవలో ఉన్న భూమెంతో తెలుసా?

అయోధ్య కేసులో సుప్రీం కోర్టులో నిన్న వాదనలు ముగిశాయి. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ నేతృత్వంలోని అయోధ్య బెంచ్ వాదనలు 40రోజులు విన్నతర్వాత కోర్టును తీర్పు కోసం వాయిదా వేసింది. ఇక కోర్టు వివాదంలో తీర్పు ఎపుడైన ఇవ్వవచ్చు.

కోర్టులో మూడు పార్టీలున్నాయి.అవి రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అకాడ. నిన్న చాలా నాటకీయంగా వాదనలు ముగిశాయి. తమ వాదనలు వినిపించేందుకు ఇంకా టైమ్ కావాలని అన్ని పక్షాలు కోరాయి.

ముస్లిల సున్నీవక్ఫ్ బోర్డు తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ ఒక దశలో కోర్టు అనుమతి తీసుకుని ప్రత్యర్థులు కోర్టు ముందుంచిన పత్రాలను చించేశారు.

కోర్టు హాలంతా వాదప్రతివాదాలతో వేడెక్కింది. దేశమంతా ఈ తీర్పుకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కోర్టు మరింత గడువు ఇచ్చేందుకు వీలు కాదని చెప్పింది.

వివాదంలో ఉన్న పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఈ ఏడాది ఆగస్టు 6న ఈ వ్యవహారం మీద కోర్టులో విచారణ మొదలయింది.

ఇంతకీ అసలు వివాదమేమిటో తెలుసా?

వివాదమంతా చూస్తే కేవలం  2.77 ఎకరాల భూమికోసమే…ఈ భూమి మీద అలహాబాద్ కోర్టు ఎపుడో తీర్పు ఇచ్చింది. 2010లో ఈ భూమి యాజమాన్యం కోసం అలహాబాద్ కోర్టులో నాలుగు సివిల్ వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

పిటిషనర్లంతా భూమి మాదంటే మాదన్నారు.చివరకు కోర్టు ఈ భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అకాడ, రామ్ లల్లా ల మధ్య సమానంగా పంచింది.

తీర్పును సవాల్ చేస్తూ 14 అపీళ్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి.

అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించిన ముగ్గురు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ ఎస్ యు ఖాన్ ,” A small piece of land where angels fear to tread” (దేవతలుకూడాకాలుమోపేందుకు భయపడే జాగా ఇది)అని ఆసక్తికరమయిన వ్యాఖ్య చేశారు.

అయోధ్యలో ఉన్న ఈ వివాదాస్పద భూమితో పాటు 1993 అయోధ్య యాక్ట్ ప్రకారం కేంద్రం  ఏ పక్షం తో ఉండకుండా తన ఆదీనంలో ఉంచుకుంది.

ఇపుడు సుప్రీంకోర్టులో ఈ కేసును విచారిస్తున్న బెంచ్ లో ప్రధాన న్యాయమూర్తి గోగోయ్ తో పాటు న్యాయమూర్తులు ఎస్ ఎ బాబ్డే,డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ లు ఉన్నారు.

బాబ్రీమసీద్ గొడవ చరిత్ర  ఇది.

1528
మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ అయోధ్యలో మసీదును నిర్మించారు. అయితే, అది రాముడి జన్మస్థలమని, అక్కడ అప్పటికే ఒక ఆలయం ఉందని హిందువుల వాదన.

1835-1949
బాబ్రీపై ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు జరిగాయి. దీంతో, ఆంగ్లేయులు ఆ ప్రాంగణంలోని అంతర్భాగాన్ని ముస్లింలకు, బయటి భాగాన్ని హిందువులకు ఇచ్చారు.

1949
మసీదులోని మధ్యగుమ్మటం కింది భాగంలో రామ్‌లల్లా విగ్రహాలు ప్రత్యక్షం. దీనిపై ముస్లింలు నిరసన వ్యక్తం చేయడంతో అప్పటి ప్రభుత్వం ఆ ప్రాంగణాన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించి తాళాలు వేసింది.

1950
రామ్‌లల్లాకు పూజలు చేసుకోవడానికి, విగ్రహాలను లోపల ఉంచడానికి హక్కును కల్పించాలంటూ ఫైజాబాద్‌ సివిల్‌ న్యాయస్థానంలో రెండు వ్యాజ్యాలు దాఖలు.

1961
బాబ్రీ మసీదు ఉన్న స్థలాన్ని తమకు అప్పగించి, విగ్రహాలను తొలగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌ సున్నీ కేంద్ర వక్ఫ్‌ బోర్డు ఒక వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.

1986
మసీదు ప్రాంగణానికి వేసిన తాళాలు తెరిచి హిందువులు పూజలు చేసుకునేలా జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

1992, డిసెంబరు 6
దేశం నలుమూలల నుంచి వచ్చిన కరసేవకులు బాబ్రీమసీదు కూల్చివేతకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

2001
బాబ్రీమసీదు కూల్చివేత నిందితుల్లో ఎల్‌కే ఆడ్వాణీ, కల్యాణ్‌ సింగ్‌ సహా 13 మందిపై ఆరోపణలను ప్రత్యేక న్యాయమూర్తి కొట్టివేశారు.

2002
కరసేవకులతో ప్రయాణిస్తున్న రైలుకు గుజరాత్ లోని గోధ్రాలో
నిప్పంటించడంతో 58 మంది మరణించారు. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో 2000 మందికి పైగా మరణించారు.

2010
వివాదాస్పద స్థలంలో మూడింట రెండు వంతుల స్థలాన్ని హిందువులకు, ఒక వంతు స్థలాన్ని ముస్లింలకు అలహాబాద్‌ హైకోర్టు కేటాయించింది.

2011
అయోధ్య వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది.

2017
ఈ వివాదాన్ని న్యాయస్థానం బయట పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే.. బీజేపీ అగ్రనేతలపై నేరపూరిత కుట్ర అభియోగాన్ని పునరుద్ధరించింది.

2018
మసీదులో నమాజ్‌ చేయడం ఇస్లాంలో అంతర్భాగం కాదంటూ 1994లో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

2019, మార్చి 8
అయోధ్య సమస్యకు మధ్యవర్తిత్వంతో సామరస్య పరిష్కారాన్ని కనుగొనేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు మధ్యవర్తులతో ఒక కమిటీని నియమించింది.
8 వారాల్లోగా సంప్రదింపులు పూర్తిచేయాలని ఆదేశించింది.

2019, ఆగస్టు 1
మధ్యవర్తిత్వ కమిటీ నివేదికను సమర్పించింది.

2019, ఆగస్టు 2
అయోధ్య సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలో మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

2019, ఆగస్టు 6
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు
రోజువారీ విచారణ ప్రారంభించింది.

2019 అక్టోబరు 16
సుప్రీంలో వాదనలు ముగిశాయి