భారతదేశాన్ని కరోనా కుదిపేస్తూ ఉంది. రోజూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు వస్తున్న వార్తలే తప్ప మరొక మంచి వార్త రావడడంలేదు. ఏకారణంగా ఒకరోజు పాజిటివ్ కేసులు దగ్గితే, కరోనా కంట్రోలయినంత ఆనందపడిపోతున్నారు అధికారులు.
పత్రికలు చూసే వాళ్లు,టివిలో వార్తలు చూసే వాళ్లు … నలుమూలనుంచి వచ్చే కరోనా వార్తలు వస్తుండాన్ని గమనిస్తూ ఉంటారు. ఒక విషయం వాళ్ల గమనించి ఉండరు. ఈ కరోనా వార్తల్లో కనిపించని పేరొకటి ఉంది. అక్కడ ఇంతవరకు కరోనా చొరబడలేదు. ఆ ప్రాంతమేదో తెలుసా? ఆ ప్రాంతమే లక్షదీవులు.
కేంద్ర పాలిత ప్రాంతమయిన లక్ష దీవులొక్కటే ఇపుడు భారతదేశంలో కరోనా రహిత ప్రాంతం. అయితే, ఈ రోజు దాకా లక్ష దీవులకు తోడు మరొక ప్రాంతం కూడా ఉండింది. అది నాగాలాండ్.
సోమవారం నాడు నాగాలాండ్ లో మూడు పాజిటివ్ కేసు కనిపించడంతో కరోనారహిత భూభాగాల జాబితా నుంచి నాగాలాండ్ ఎగిరిపోయింది. దీనితో లక్షదీవులొక్కటే ఇపుడు కరోనా లేని భారతీయ భూభాగంగా మిగిలిపోయింది.
నాగాలాండ్ కు చెన్నై నుంచి శ్రామిక్ ఎక్స్ ప్రెస్ లో తిరిగొచ్చిన కూలీలలో ముగ్గురికి పాజిటివ్ అని తేలింది.ఇందులో ఒక కోహిమా లో, మరొక దిమాపూర్ లో కనిపించారు.
ఇంతవరకు కరోనా చొరబడని ప్రాంతాలు ఈశాన్య భారతంలోనే ఉండేవి. మొదటినెలలో అరుణా చల్ ప్రదేశ్ లో కరోనా కనిపించలేదు. తర్వాత మే 18 ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వారిలో ఒక విద్యార్థి పాజిటివ్ అని తేలింది.
దీనితో దేశంలోని అన్ని రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో కరోనా కనిపించినట్లయింది, ఒక్కలక్షదీవుల్లో తప్ప. 36దీవుల సముదాయమయిన లక్షదీవుల జనాభా 64,000. ఈ గుర్తింపు లక్షదీవులు కాపాడుకుంటాయో లేదో చూడాలి.
లక్ష దీవులు అన్ని వస్తువులకు కేరళ మీద ఆధారపడాల్సి ఉంటుంది. కేరళకు, లక్ష దీవులకు మధ్య నిరంతరం రాకపోకలంటాయి. అయినా సరే,కేరళ నుంచి ఒక్క కరోనా కేసు కూడా ఈ దీవులకు రాకుండా కాపాడుకున్నారు. మార్చి 25న లాక్ డౌన్ ప్రకటించగానే, లక్షదీవులకు రావాలనుకున్నవారందరిని కొచ్చి, మంగళూరులలో RT-PCR పరీక్షలు నిర్వహించాకేఅనుమతించారు. నెగటివ్ పరీక్ష వచ్చిన వారినే లోనికి అనుమతించారు.
తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతిఇంటిని సర్వే చేసి అనుమానితులను శాంపిల్స్ ను పరీక్షచేయించారు. అయితే అన్నీ నెగటివ్ లే వచ్చాయి.అయినా సరే లక్షదీవులను కోవిడ్ ను ఎదుర్కోనేందుకు సమాయత్తం చేశారు. రాజధాని కవరట్టీలోని ఇందిరాగాంధీ ఆసుపత్రిని కోవిడ్ 19 ఆసుపత్రిగా మార్చారు. అక్కడ ఐసియు బెడ్స్, వెంటిలేటర్స్ ఏర్పాటుచేశారు. ఎమర్జన్సీ వస్తే కేరళ ఆసుప్రతికి తరలించేందుకు హెలికాప్టర్ సిద్ధం చేశారు.
కేరళలో కరోనా నియంత్రణ గొప్పగా జరుగుతుండటం కూడా లక్షదీవులకు పనికొచ్చింది. కేరళ లోమూడో దఫా కరోనా దాడి కొనసాగుతున్నా అక్కడ కోవిడ్ కట్లు తెంచుకుని బీభత్సం సృష్టించలేదు. కేరళ మృతుల రేటు 1.44 శాతమే.
త్వరలో లాక్ డౌన్ సడలింపులకు లక్షదీవులు ఏర్పాట్లు మొదలుపెట్టింది. అక్కడి నుంచి స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లేందుకు రాకపోకలు మొదలువుతాయి. అందువల్ల ఈ ప్రాంతం అధికారయంత్రాంగం, ఎవరు బయటకు వెళ్లవచ్చు, ఎవరు వెళ్లారదనే ప్రొటోకోల్ తయారుచేస్తున్నది.