సాహసి కాని వాడు జీవన సమరానికి… పనికిరాడు అని కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ అన్న మాట గంజి భాగ్యలక్ష్మి మోటివేషనల్ స్పీచ్ వింటూన్నంత సేపు గుర్తుకొస్తూ ఉంటుంది.
కష్టాల కడలిని ఈదడానికంటే, ఈదాలనే నిర్ణయానికి రావడానికి సాహసముండాలి. ఇది ఆమె లోకనిపించే సాహసమని ఆమె తన జీవితయాత్ర గురించి వింటున్నపుడనిపిస్తుంది.
ఇపుడు తెలంగాణలో గంజి భాగ్యలక్ష్మి మోటివేషనల్ స్పీచ్ సూపర్ స్టార్. ఆమె ఉపన్యాసాలు ఎంతోమంది విద్యార్థులకు, నిరుద్యోగులకు స్ఫూర్తినిస్తున్నాయి. తమ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలని ఆమెను అనేక కాలేజీల వాళ్లు ఆహ్వానిస్తున్నారు. ఆమె ఉపన్యాసాలని యూట్యూబ్ లో విని వందలాది మంది ఆమెను సలహాల కోసం సంప్రదిస్తుంటారు.
ఆర్థికంగా వెనకబడిన వర్గాల వాళ్ల మీద, ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీలలో ఉండే వాళ్ల మీద ఆమె ఎక్కుగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.ఎందుకంటే ఒక చిన్న ఆటంకం వస్తే చాలు ఈ వర్గాల విద్యార్థుల చదవాగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులకు బాగా బలయ్యేది బాలికలే.
ఇలాంటి పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటిని జయించాలని, జయించే శక్తి తమలోనే ఉంది, ఒకసారి పరీక్షించుకోండని ఆమె వెన్నుతడుతుంటారు.
ఆమె జీవితం ప్రతికూల పరిస్థితులో మధ్యే సాగింది. అడుగు ముందుకు సాగనీయకుండా కాళ్ళకు అవి బంధాలేసేవి. అయినా ఆమె చలించలేదు. వాటికి లొంగిపోయి టెన్త్ తర్వాతో, ఇంటర్ తర్వాతో చదువు మానేసి ఉంటే … భాగ్యలక్ష్మి ఎపుడలా ఆలోచించలేదు. కష్టాలొచ్చినపుడు తనలో తాను కృంగికృశించి పోకుండా ఎలా ఎదిరించి నిలబడిందో చెప్పేతీరు చాలా గొప్పగా ఉంటుంది.
మీ జీవితం మించిన ఎన్ సైక్లోపీడియా మరొకటి లేదు.కష్టాల్లో ఉన్నపుడల్లా దాంట్లోకి తొంగి చూడండి, అక్కడే మీకు అన్ని లభిస్తాయనడం ఆమె మోటి వేషనల్ స్పీచ్ బాటమ్ లైన్.
ఆమె మెటీవేషనల్ స్పీచ్ లో చాలా ఎనర్జీ ఉంటుంది. ఆమె మాటలు ఒక్కొక్కటి కోటబుల్ కోట్. అవేవీ ఎవరికీ కాపీ కాదు. అమె ఎపుడూ ఎవరినీ అనుకరించదు. అపుడుపుడు తాను ఫలానా పుస్తకం చదివి ఇన్ స్పైర్ అయ్యానని హుందాతనం వెల్లడించినా, ఆమె ఎవరైనా అనుకరిస్తున్నట్లు ఎక్కడా కనిపించదు. ఆమె పూర్తిగా తన సొంతం. ఆమె మాట సొంతం, ఆమె బాణి సొంతం. అందుకే ఆమె ఉపన్యాసం,సొంపుగా వినడానికి ఇంపుగా ఉత్తేజకరంగా ఉంటుంది. దీనికి కారణం, ఆమె బయటనుంచి కాకుండా తన జీవితం నుంచి, తన కష్టాల నుంచి, ఇన్ స్పైర్ కావడమే.
ఈ విషయాన్నిఆమె పదే పదే గుర్తుచేస్తుంది. స్ఫూర్తి ఎక్కడో లేదు, మీలోనే ఉందని అని తత్వవేత్త లాగా సరళమయిన భాషలో చెప్పే తీరు ముచ్చటగా ఉంటుంది.
ఎవరి జీవితాలను వాళ్లు ప్రేమించి , ఎవరితోవాళు గొప్పగా సహజీవనం చేసి, ఎవరినుంచి వాళ్లు ఇన్ స్పైర్ కావడం… అంత సులభం కాదు.
ఎందుకంటే కష్టాలెదురయినపుడు మనసు కకావికలమవుతుంది. నిరాశా నిస్పృహలు తుఫాన్ సుడిగాలిగా చుట్టుముడతాయి. మన సొంత పర్సనాలటి ఎవాపొరేటయిపోతుంది. అపుడు కష్టాలను కౌగిళించుకుని, వాటినుంచి స్ఫూర్తి పొందడమనేది జానపధ కథల్లో, సినిమాల్లో, పాఠ్యపుస్తకాల్లో, ధార్మిక ప్రసంగాల్లో ఉంటుంది. ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. కష్టాలు ఎదురవుతూనే బయటి సాయం కోసం, ఇన్ స్పిరేషన్ కోసం చూస్తుంటాం. ఆమె దీనికి భిన్నంగా పెరిగారనిపిస్తుంది. అందుకే ఆమెతో మాట్లాడుతన్నపుడు నాకు ఎపుడో చదివిన ఎడ్గార్ ఎలన్ పో కవిత గుర్తుకొచ్చింది.
From childhood’s hour I have not been
As others were—I have not seen
As others saw—I could not bring
My passions from a common spring—
From the same source I have not taken
My sorrow—I could not awaken
My heart to joy at the same tone.
ఎలాంటి జంకు గొంకు లేకుండా తనకెదురయిన విజయాలనే కాదు, చర్చించడానికి కూడా మనం ఇబ్బంది పడేంత కష్టాలను కూడా ఆమె అందరితో షేర్ చేసుకుంటుంది. వాటితో తాను ఎలా ఇన్ స్పైయిర్ అయింది చెబుతుంది. ఆమె ప్రసంగం చాలా సహజంగా, అపుడే నేసి, మడతవేసిన తెలంగాణ చేనేత చీరెలాగా తళుక్కున మెరుస్తూ ఉంటుంది.
చేనేత కుటుంబం నుంచి వచ్చిన భాగ్యలక్ష్మి జీవితం ప్రతిమలుపులో కష్టాలు పడ్డారు.అవమానాలు పడ్డారు. అయితే, ఎపుడూ ఆమె నిరాశ పడలేదు. మీకు తెలుసుగా, కష్టాలకు లింగవివక్ష ఉంటుంది. మహిళలని అవి మరింత తీవ్రంగా కృంగదీస్తాయి. ఈ ప్రతికూల పరిస్థితులను దాటేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించుకుంటూ ముళ్లబాటలోనే ముందుకెళ్లిందామె. అందుకే కష్టాల్లో ఉన్నవాళ్లకి, నిరాశలో ఉన్నవాళ్లకి ఆమె ప్రసంగం టానిక్ లాగా ఉంటుంది.ధైర్య మిస్తుంది. పర్వాలేదోయ్ ముందుకు సాగిపో అంటుంది.
భాగ్యలక్ష్మి ని ఎలా పరిచయం చేయాలో అర్థం కాదు.ఆమెను కవి అనాలా, ఉపన్యాసకురాలు అనాల లేక మోటివేషన్ స్పీకర్ అనాలా, వ్యక్తిత్వ వికాసనిఫుణురాలనాలా, విమన్ అచీవర్ అనాలా,మాంచి టీచరనాలా… ఏమీ అర్థంకాదు. ఆమె వీటన్నింటిసమాహారం.
ఇపుడామె వృత్తి రీత్యా ఖమ్మం గవర్నమెంటు డిగ్రీ కాలేజీలో జూవాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎంఫిల్ పూర్తి చేశారు. ఎమ్మెస్సీ సైకాలజీ చదివారు, బిఇడి చదివారు.ఇపుడు డాక్టోరల్ కోర్స్ పూర్తి చేయబోతున్నారు. భర్త అనిల్ కుమార్. ఒకపుడు హకీ నేషనల్ ప్లేయర్. వారిది ఆదర్శ వివాహం. ఇద్దరు కొడుకులు.
ఆమె జీవితాన్ని ఒక పుస్తకంలా తెరచి విద్యార్థుల ముందుంచుతూ ఉంది. తండ్రి చేనేత కార్మికుడు, ఏ మాత్రం చాలని కూలి. మరొక ఆదాయం లేదు. అన్నయ్య ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దినం గడవడం కష్టమయిన జీవితంలో ఒక బాలిక చదువు కొనసాగించడం ఎంత కష్టం? పడుతూ లేస్తూ స్కూల్ చదవు పూర్తయింది. ఆ తర్వాత కాలేజీ…వూహించడానికి వీలుపడని పేదరికం. ట్యూషన్లు చెబుతూనో, ట్యుటోరియల్ కాలేజీలలో పని చేస్తూనో కాలేజీ విద్యపూర్తి చేసి,తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో అజేయంగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క భీకర పోరాటం.వీటన్నింటిని ఆమె తన భాషలో క్లుప్తీకరించడం గొప్పగా ఉంటుంది. ఆమె చెప్పే మాట ఏదో కవితనుంచి లాక్కొచ్చిన పాదాల్లాగా ఉంటుంది.
‘‘అదృష్టం బాగోలేదు,
కాలం కలసి రాలేదు,
కష్టాలన్నీ మంచోళ్లకే,
మాలాంటోళ్లకే కష్టాలనే మాటలొద్దు.
అదృష్టం ఎక్కడో లేదు, మన ఆలోచనల్లొనే ఉంది
సంకల్పం ఎక్కడుందో అక్కడ అదృష్టం తలుపుతడుతుంది’’