(గంజి భాగ్యలక్ష్మి)
ప్రముఖ రచయిత, టీచర్, మోటివేషనల్ స్పీకర్ గంజి భాగ్యలక్ష్మి కాలేజీలో అనుభవాలను ట్రెండింగ్ తెలుగు న్యూస్ తో సీరియల్ గా పంచుకుంటారు. ఇది మొదటిభాగం.
వీడు పనికి రాని వాడు..
వీడి ముఖానికి చదువా?
వీడికి కాలేజ్ లో సీట్ ఇస్తే తాను చెడింది కాక అందరినీ చెడగొడతాడు..
ఒకసారి అద్దంలో ముఖం చూసుకోరా …ఇలాంటి మాటలు ఒక కాలేజ్ అడ్మిషన్ కోసం వచ్చిన అబ్బాయి ముఖాన అంటుంటే ఆ అబ్బాయి మానసిక స్థితి ఎలా ఉంటుంది….
కాలేజ్ రీ ఒపెన్ అయింది.అడ్మిషన్స్ టైమ్.స్టాఫ్ అందరమూ స్టాఫ్ రూములో కూర్చుని ఉన్నాము.ఇంతలో ఒకబ్బాయి వచ్చాడు…
కాలేజిలో జాయినవడానికి.నేనేదో పుస్తకం చదువుతూ కూర్చున్నాను.ఒక్కసారిగా నవ్వులు వినిపించాయి.తలెత్తి చూసాను.
మా స్టాఫ్ లో ఒకరు అంటున్నారు ఏరా నీ అవతారం.. నీవు చదివి ఏమి చేస్తావురా అని?
ఆ అబ్బాయి ఆహార్యం మీద జోకులేసుకుని నీకు సీట్ ఇస్తే కాలేజ్ ఏమి కావాలి రా…”పోపో వేరే కాలేజ్ చూసుకో పో “ఇవీ ఒక లెక్చరర్ మాటలు…ఆ అబ్బాయి వైపు చూసాను…చాలా నెర్వస్ గా ఫీల్ అవుతున్నాడు…ఎందుకో నా గుండెలో కలుక్కుమంది నేను చదివే పుస్తకం పక్కన బెట్టి ఆ అబ్బాయి తో బయటకు వచ్చాను.ఆ అబ్బాయి భుజం తడుతూ నీపేరేంటమ్మా అన్నాను…నాకు అబ్బాయిలనా,అమ్మాయిలయినా అమ్మా అనడం అలవాటు.
రమేశ్ అని చెప్పాడు.
దగ్గరగా అబ్సర్వ్ చేసాను.ఆ అబ్బాయి జారిపోయే జీన్స్,పొడచాటి టీ షర్ట్, చేతులకు రెండు,మూడురకాల బ్యాంగిల్స్ లాంటి రబ్బరు బ్రాస్లెట్స్,ఒక చెవికి పోగు, తల వెంట్రుకలకు బ్లీచ్ చేసి స్పైక్స్ తీసాడు…చూస్తే వీటన్నిటి చాటున నాకు అతని పేదరికం కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉంది.. అంతే కాదు అమాయకత్వం కూడా కనిపిస్తుంది..
రమేశ్ నీ ఫేవరైట్ హీరో ఎవరు?అని అడిగాను..ఆ అబ్బాయి ముఖంలో వెలుగు .భుజం ఎగురేస్తూ ప్రభాస్ అన్నాడు…ఓ నిజమా ? నాకూ ప్రభాస్ ఇష్టం తెలుసా అన్నాను.రమేశ్ ముఖం మరోసారి వెలిగింది…
రమేశ్ చెప్పు నీ పదవతరగతి ఏ స్కూల్ ? మీ ఊరు ఏంటి? అనడిగాను. అతని మాటల ద్వారా తెలిసింది ఆ అబ్బాయి ఉండేది ఒక స్లమ్ ఏరియా అక్కడికి దగ్గరలో గల ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి పూర్తి చేసాడు..
కుటుంబవిషయాలడిగినా.
తండ్రి లేడు .తాగుడుకు బానిసై ఉరి వేసుకుని చనిపోయాడు.తల్లి మున్సిపాలిటీ లో స్వీపర్ తాత్కాలిక ఒప్పంద స్వీపరన్నమాట. ఈ అబ్బాయి ఇంటికి పెద్ద ఒక చెల్లి,తమ్ముడు .ఈ అబ్బాయే ఇంటికి పెద్ద.. బందువుల ఆదరణ లేదు.తల్లి రెక్కల కష్ట మే తప్ప..ఒక గుడిసె లాంటి డేరా నివాసం….వానొచ్చింటే చుట్టూ బురదనీరు..దోమలు ఈగలు ..దుర్భర బీద స్థితి.
కాసేపు ఆలోచన లోకి వెల్లిపోయాను…అతని కుటుంబ పరిస్థితి కళ్ల ముందు కదిలింది..ఆ అబ్బాయికి మంచి,చెడు చెప్పడానికి ఎవరున్నారు ? తల్లికి కష్టం చేసి పిల్లలను పెంచడం లోనే సరిపోతుంది….
నాకర్థమయ్యింది చుట్టు పక్కల వారి ప్రభావం ,పరిస్థితుల ప్రభావమే ఆ అబ్బాయి ఆహార్యమని…
రమేశ్ అని పిలిచాను..మీ నాన్న ఏ వయసులో చనిపోయారని అడిగా…చిన్న పిల్లలు గా ఉన్నపుడే అని చెప్పాడు…
సో మీ ఇంటిలో నీవే పెద్ద.నీవు బాగా చదువుకుని మంచిగా సెటిలయ్యి మీ తమ్ముడు చెల్లిని అమ్మని బాగా చూసుకోవాలి కదా అన్నాను..ఆ అబ్బాయి కళ్లలో నీళ్లు…ఏడుస్తున్నాడు ..మా అమ్మకి కూడా ఆరోగ్యం సరిగా ఉండదు మేడం అని.
(ఇది నచ్చితే ఫేస్ బుక్ లో లైక్ చేయండి. మీ మిత్రులతో షేర్ చేయండి)
ఆ అబ్బాయిని కాస్త డైవర్ట్ చేద్దాం అని విషయం మార్చాను…రమేశ్ నీ స్టైల్ బాగుంది కానీ ,చూసావుగా నిన్ను చూడగానె అందరూ ఎగతాళి గా నవ్వారు కదా…నీకు సెలవులపుడు నీ ఇష్టం ఉన్నట్లు ఉండూ..కాని కాలేజ్ కి బాగోదు కదమ్మా…నీట్ గా డ్రసప్ అవ్వు…సరేనా అంటూ అనునయంగా చెప్పాను..మనల్ని చూసి ఎవరూ నవ్వకూడదమ్మా…మన వల్ల సంతోషం కలగాలి కానీ,
నీ వయసు పిల్లలకు ఇలా ఫ్యాషన్ ఫాలో కావడం మామూలే తప్పు లేదు .కానీ ఒకసారి ఆలోచించు కాలేజికి ఇలా వస్తే బాగుంటుందా? కాస్త ఆప్యాయత తొ కూడిన మందలింపు లా అడిగాను…సారీ మేడం అన్నాడు.
ఓకే నాన్న రేపు రా .నీ అప్లికేషన్ ఫామ్ నేను దగ్గర ఉండి నింపిస్తాను అన్నాను.. వెల్లి పోయాడు…
మరుసటి రోజు నేను కాలేజ్ గ్రౌండ్ లో గల సిమెంట్ బెంచ్ మీద కూర్చుని పరిసరాలను పరిశీలిస్తూ ఉన్నాను…ఒకబ్బాయి నా వైపే వస్తున్నాడు…గుండు చేయించుకుని ఉన్నాడు…పోల్చుకోలేకపోయాను..నమస్తే మేడం అంటూ వచ్చాడు…నేను ఇంకాప్రశ్నార్థకంగానే చూస్తున్న.
మేడం నేను రమేశ్ ని నిన్న వచ్చి వెల్లాను కదా అన్నాడు.
హో…ఏంటయ్యా ఏదయినా మొక్కు తీర్చుకున్నావా?ఎక్కడికి వెల్లావని అడిగాను..
ఎక్కడకు వెల్లలేదు మేడం.. మీరు చెప్పారు కదా నీట్ గా రావాలని ,నా జుట్టుకు బ్లీచ్ చేసాను కదా అది త్వరగా పోదు అందుకే గుండు చేయించానని చెప్పాడు. చెవుల పోగు తీసేసాడు,చేతికి బ్యాంగిల్స్ లాంటివి తీసేసాడు..నీట్ గా వచ్చాడు.
నిజం గా నేను షాక్..నా మనసుకు ఆనందం ,ఆశ్చర్యం..
సరే చెప్పు ఏ గ్రూపులో జాయినవుతావు..నేను నీ సీట్ గురించి మాట్లాడుతాను అని అడిగాను…
మేడం మీరు ఏ గ్రూపుకి చెప్తారో ఆ గ్రూప్ కి అడ్మిషన్ కావాలి మేడం అన్నాడు..మీరు చెప్పినట్టుగా నాకెవరూ చెప్పలేదు ఇప్పటివరకు అందరూ నవ్వారు,వెక్కిరించేవారే…అలా వెక్కిరించినపుడు ఏదో కసి అనిపించి రఫ్ గా మాట్లాడే వాడిని అని చెప్పుకొచ్చాడు..
ఆ అబ్బాయికి BPC గ్రూపులో ఫామ్ ఫిలప్ చేస్తుంటే మల్లీ కొన్ని కామెంట్స్ వీడు BPCచదువుతాడా? ఏదో ఆర్ట్స్ గ్రూపులో వేద్దామని..
నేను చెప్పాను ఈ అబ్బాయి బైపిసి నే తీసుకుంటాడు. నాది బాద్యత అని
ఒక వ్యక్తి ఆహార్యాన్ని బట్టి
అంచనా వేసి వీడు ఇదీ అని ట్యాగ్ వేస్తే ఎలా…చెడ్డ విద్యార్దులు కాదు చెడు పరిస్తితుల ప్రభావం, పరిసరాల ప్రభావం మాత్రమే వారి మీద వుంటుంది.. వారికి దిశానిర్దేశం చేసి చెప్పాల్సిన పద్దతిలో
చెపితే మార్పు తీసుకుని రావచ్చు..ఒక ఆత్మీయ స్పర్శతో ఓదార్పు,మనోబలాన్ని ,మనకంటూ ఒకరున్నారనే అనే భరొసా కలిగించి విద్యార్థులలో మార్పు తీసుకురావలసిన బాద్యత ఉపాద్యాయులదే,అద్యాపకులదే.
రూపాన్ని బట్టి, రంగుని బట్టి
కుటుంబ ఆర్థిక పరిస్తిని బట్టి
వారికి విలువ కట్టొద్దు.
ఇంతలో నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చి ట్రాన్స్‌ఫర్ మీద వెల్లి పోతుంటే ఆ అబ్బాయి కళ్లలో నీళ్లు.నా కళ్లు కూడా చెమర్చాయి..
మేడం నేను కూడా మీతో వస్తాను .అక్కడే ఇంటర్ కాలేజిలో జాయినవుతాను అని అడుగుతుంటే ఆ పసిమనసు మీద జాలి వేసింది..రమేశ్ అమ్మకి ,నీ కన్నా చిన్నవారికి నీ ప్రజెన్స్ అవసరం. ఇక్కడే ఉండి బాగా చదువుకో ఎక్కడ ఉన్నా నా బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి అని చెప్పినా.
అపుడపుడూ అమ్మా బాగున్నారా అని మెసేజ్ చేసేవాడు..డిగ్రీ పూర్తి చేసాడు.పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ పీజీ చేస్తున్నా మేడం అని ఈమద్య నే మెసేజ్ చేసాడు….
సీట్ లేదని వెల్లగొడితే ఆ అబ్బాయి జీవితం ఏమయ్యేది
అడ్డాల మీద గుట్కా లు తింటూ,సిగరెట్, మందు,చెడు స్నేహాలు జీవితం గాడి తప్పేది కదా..
వీలయితే సాద్యమయినంత వరకు ఎదుటి వ్యక్తిని డేంజర్ జోన్ లో నుండి సేఫ్ జోన్ లో వేయడానికి ప్రయత్నిద్దాము
భాగ్యలక్ష్మి ఎవరు? ఈ వీడియో చూడండి