జగన్ ప్రైవేటు విద్యా సంస్థలను జాతీయం చేయగలరా?

(టి లక్ష్మినారాయణ)
1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యాభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుదల, ఉపాధికల్పన, సామాజిక న్యాయం, మాతృ భాష పట్ల అంకితభావం, చిత్తశుద్ధి ఉంటే మొత్తం పాఠశాల విద్యను విద్యా వ్యాపారాన్ని నిషేధించి, జాతీయం చేయాలి.
స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పిస్తూ చట్టం చేసిన రీతిలో పాఠశాల విద్య వరకు మాతృ భాషలో విద్యనార్జించిన వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కల్పిస్తూ చట్టం చేయాలి. ప్రభుత్వం ఆ సాహసం చేయగలదా?
2. మాతృభాషలో విద్యా బోధనను రద్దు చేసి, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టే ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలి లేదా తెలుగు మాధ్యమాన్ని యధాతదంగా కొనసాగిస్తూ, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలి.
3. బ్రిటీష్ వలస పాలనతో అధికార భాషగా మారిన ఇంగ్లీషు ఏడు దశాబ్ధాల స్వాతంత్ర్యానంతరం కూడా అధికార భాషగా చలామణిలో ఉండడానికి ప్రభుత్వాలు అనుసరించిన లోపభూయిష్టమైన విధానాలే కారణం.
4. ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకు ప్రయివేటీకరించి, అంగడి సరుకుగా మార్చిన దుష్పలితంగానే విద్యా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది. పుట్టగొడుగుల్లా ప్రయివేటు విద్యా సంస్థలు ఆవిర్భవించి విద్యను అంగడి సరుకుగా మార్చాయి. కాన్వెంట్ ఎడ్యుకేషన్ పేరిట విద్యా వ్యాపారాన్ని సాగిస్తూ, ఆంగ్ల భాషపై వ్యామోహం పెంచారు.
5. ప్రయివేటు విద్యా సంస్థల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నారని, ఆంగ్ల మాధ్యమంలో చదువుకొన్న వారికే ఉద్యోగాలు వస్తున్నాయని చెబుతూ, నిరుద్యోగ సమస్య పెరుగుదలకు కారణమైన ప్రభుత్వాల విధానాల నుండి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకొన్న వారందరికీ ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తున్నాయా? నిరుద్యోగ సమస్య ఎందుకు దినదినాభివృద్ధి చెందుతున్నది? పాలకులు సమాధానం చెప్పాలి.
6. దేశంలో త్రిభాషా సూత్రం అమలులో ఉన్నది. ఆంగ్ల భాషతో పాటు హిందీ భాషకు ప్రాధాన్యత ఉన్నది. ప్రపంచీకరణ యుగంలో జీవిస్తున్నాం. ఆంగ్ల భాషను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత పట్ల సమాజంలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. పైపెచ్చు నేర్చుకొంటేనే విజ్ఞానార్జనకు ఎంతగానో దోహదపడుతుంది. ఉపాథి అవకాశాలను దేశీయంగా, అంతర్జాతీయంగా అంది పుచ్చుకోవడానికి వీలౌతుంది.
7. మాతృ భాషలో విద్యా బోధనకు, ఆంగ్ల భాషలో విద్యా బోధనకు మధ్య పెట్టి మాట్లాడే వారికి మాతృ భాషలో విద్యా బోధన పట్ల శాస్త్రీయ అవగాహన కొరవడిందని చెప్పక తప్పదు. మాతృ భాష ప్రాముఖ్యతను గుర్తించ నిరాకరిస్తున్నారు. అమ్మ భాషకు, ఆధిపత్య భాషకు మధ్య ఉన్న తేడాను చూడలేక పోతున్నారు.
8. మాతృభాషలో విద్యా బోధనకు సమాధి కట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బరితెగించింది.
వినాశకర విధానాన్ని సమర్థించడానికి కొందరు అసంబద్ధమైన, అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. ఇది అత్యంత హేయమైన చర్య.
9. నేడు ప్రజల భాష, ప్రభుత్వ భాష వేరువేరుగా మనుగడలో ఉన్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలు, ఉత్తర్వుల జారీ, న్యాయస్థానాల్లో వాద ప్రతివాదనలు, తీర్పుల వెల్లడి తెలుగులోనే ఉండాలని ప్రజలు బలంగా కోరుకొంటున్నారు.
10. తెలుగు భాషను పాలనా భాషగా మార్చి, తెలుగు మాధ్యమంలో విద్యార్జన చేసిన వారికి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తే ప్రజలకు సౌలభ్యంగా ఉండడమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుంది.
నిజమైన స్వాతంత్య్రం లభించినట్లు అవుతుంది.
( టి.లక్ష్మీనారాయణ, సాంఘిక ఆర్థిక రాజకీయ విశ్లేషకుడు)