మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కీలక ఆదేశాలు

చాదర్ ఘట్ దళిత మైనర్ బాలిక పై అత్యాచార ఘటన పూర్తి స్థాయి నివేదికకు రాష్ట్ర ఎస్సి, ఎస్టీ కమిషన్ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అత్యాచార ఘటనను ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ సుమోటోగా స్వీకరించారు. దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రోళ్ల ఆదేశించారు.
ఘటనపై విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది కమిషన్. బాధితురాలికి సాయ సహాకరాలతో పాటు ఎక్స్ గ్రేషియా అందించాలని రెవిన్యూ అధికారులను సూచించింది. బాధితురాలికి అన్ని విధాలుగా కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది.
చాదర్ ఘాట్ బాలికపై అత్యాచార ఘటన విషయం తనను  కలిచి వేసిందన్నారు చైర్మన్ ఎర్రోళ్ల. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనతోపాటు కమిషన్ సభ్యులు విద్యాసాగర్, రాంబల్ నాయక్ లు సమావేశంలో పాల్గొన్నారు.
కాగా ఈ కేసులో అరెస్టైన ఎంఐఎం ఎమ్మెల్యే అనుచరుడు షకీల్ ను… ఎమ్మెల్యే ఒక్కరోజులోనే విడుదల చేయించి తీసుకురావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలనీ బీజేపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.