ఆర్ఎస్ఎస్ కు ప్రణాబ్ ‘పాఠాలు’ నేర్ప‌గలరా!

(టి.లక్ష్మీనారాయణ)

1. భిన్నత్వంలో ఏకత్వంతో, భిన్న సంస్కృతులకు నెలవైన భారత దేశానికి 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన డా.ప్రణాబ్ ముఖర్జీ, హిందుత్వ భావజాలంతో భారతీయ సమాజంపై ఆధిపత్యం కోసం పథకం ప్రకారం అల్లకల్లోలాలు సృష్టిస్తూ, లౌకిక – ప్రజాస్వామిక వ్యవస్థను గొడ్డలి పెట్టుకు గురి చేస్తూ, దేశ ఐక్యత – సమగ్రత, పౌరుల భద్రత – ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్.), ‘స్వయం సేవక్స్’ మూడేళ్ళ శిక్షణ పూర్తి చేసుకొన్న సందర్భంగా నిర్వహించబడిన (స్నాతకోత్సవ) సభలో పాల్గొని ప్రసంగించడం సమర్థనీయమా! కాదా! అన్న అంశంపై చర్చ జరుగుతున్నది.

2. కాంగ్రెస్ వాది అయిన ప్రణాబ్ ఆర్.ఎస్.ఎస్. సభకు వెళ్ళడం పట్ల ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకుల చేత అభ్యంతరం వ్యక్తం చేయించి, ప్రణాబ్ ప్రసంగానంతరం ఊపిరి పీల్చుకొని ‘శభాష్ ప్రణాబ్’ అంటూ అధికారికంగా వ్యాఖ్యానించింది. ఆర్.ఎస్.ఎస్. వేదికపై నుండే భారత రాజ్యాంగం చట్రానికి లోబడి ‘దేశం – జాతీయత – దేశభక్తి’ అంశాలపై తన అభిప్రాయాలను విస్పష్టంగా తెలియజేయడం అభినందనీయమన్న అభిప్రాయం స్థూలంగా వ్యక్తమవుతున్నది. నిజమే! ప్రణాబ్ ముఖర్జీ గారు ఆ మేరకు అభినందనీయులే. అయితే, చెవిటి వాని ముందు శంఖం ఊదడం వల్ల ప్రయోజనం ఏమిటి? అన్నదే ప్రశ్న.

3. ముఖ్యఅతిధిగా హాజరైన ప్రణాబ్ ముఖర్జీ గారు ప్రసంగించడానికి కంటే ముందే దాదాపు 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించిన ఆర్.ఎస్.ఎస్. సర్వసంచాలక్ మోహన్ భగ్వత్, తమ సంస్థ భావజాలాన్ని సోదాహరణంగా వివరించారు. ప్రణాబ్ ముఖర్జీ రాకపై రేగిన వివాదంపై స్పందిస్తూ, ఈ సభానంతరం కూడా ‘ఆర్.ఎస్.ఎస్…ఆర్.ఎస్.ఎస్. లాగానే ఉంటుందని, ప్రణాబ్ ముఖర్జీ… ప్రణాబ్ ముఖర్జీ’ లాగానే ఉంటారని వ్యాఖ్యానించారు. నిజమే కదా! వారి భావజాలాన్ని, ఆలోచనలను, కార్యాచరణ పథకాలను ప్రణాబ్ ముఖర్జీ గారు మార్చగలరా! గురు గోల్వాల్కర్ రచించిన ‘పాంచజన్య’లోని ‘హిందీ – హిందూ – హిందుస్తాన్(ఒకే భాష – ఒకే మతం – ఒకే దేశం), ‘ముస్లింలు – క్రైస్తవులు – కమ్యూనిస్టులు’ ఆగర్భ శత్రువులు, విదేశీయులు, దుర్మార్గులు, విదేశీ సిద్ధాంతం అన్న విద్వేష పూరిత భావజాలాన్ని నరనరానికి ఎక్కించే లక్ష్యంతో నిర్వహించబడిన మూడేళ్ళ శిక్షణా తరగతులకు హాజరైన ‘స్వయం సేవక్స్’ లకు బహుళ భాషలు, మతాలు, సంస్కృతుల సమ్మేళనమే భారత దేశమన్న ప్రణాబ్ హితభోద తలకెక్కుతుందా! డా.హెగ్డేవార్, గురు గోల్వాల్కర్ బోధనల పునాదులపై నిర్మించబడి, నిర్వహించబడుతున్న సంస్థ ఆర్.ఎస్.ఎస్. అని మోహన్ భగ్వత్ గారు నిర్మొహమాటంగా ముందే సెలవిచ్చి మేం చెవులు మూసేసుకొన్నాం, ఇతరుల మాటలు మా చెవికెక్కవని చెప్పకనే చెప్పారు కదా!

4. ఆర్.ఎస్.ఎస్. భావజాలాన్ని దశాబ్ధాల పాటు తూర్పారపడుతూ వచ్చిన ప్రణాబ్ ముఖర్జీ గారు, ఆర్.ఎస్.ఎస్. వ్యవస్థాపకులు, హిందుత్వ భావజాలానికి పునాదులు వేసిన డా. కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ జన్మస్థలాన్ని సందర్శించి, ‘భారత దేశ గొప్ప పుత్రునికి గౌరవ పూర్వకంగా నివళులు అర్పించేందుకే వచ్చానని’ సందర్శకుల పుస్తకంలో వ్రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హెగ్డేవార్ ప్రవచించిన హిందుత్వ భావజాలానికి ఎంతో కొంత పవిత్రతను ఆపాదించడంగా ప్రజలు భావించే అవకాశం లేదా? ఆర్.ఎస్.ఎస్. సంస్థగా స్వాతంత్రోద్యమంలో పాల్గొనదని, సంస్థలోని వ్యక్తులెవరైనా పాల్గొన దలచుకొంటే వ్యక్తులుగానే పాల్గొన వచ్చని సెలవిచ్చిన హెగ్డేవార్ ను ‘దేశం ముద్దు బిడ్డ’ గా కొనియాడడాన్ని ఏమనాలి?

5. వినోదం కోసం సినిమా థియేటరుకు వెళితే చట్ట బద్ధంగా వికలాంగులకు కూడా దేశభక్తి నిరూపించు కోవాలని పరీక్ష పెడుతున్నారు. మంచిదే! మరి, మాజీ రాష్ట్రపతి ప్రణాబ్ ముఖర్జీ హాజరైన ఆర్.ఎస్.ఎస్. ‘స్వయం సేవక్స్’ మూడేళ్ళ శిక్షణా కార్యక్రమం సందర్భంగా నిర్వహించబడిన (స్నాతకోత్సవ) సభ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించ లేదు, జాతీయ గీతాలాపన చేయలేదు. అంటే, ఆర్.ఎస్.ఎస్. సంస్థ జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని, ఇంకా గుర్తించ నిరాకరిస్తూనే ఉన్నదా? అలాంటి సంస్థ ఆహ్వానాన్ని స్వీకరించి, సభలో పాల్గొన్న మాజీ రాష్ట్రపతి ప్రణాబ్ ముఖర్జీ చర్య సమర్థనీయమేనా?

6. ఆర్.ఎస్.ఎస్. సభకు ప్రణాబ్ ముఖర్జీని ఆహ్వానించడంలో ఆర్.ఎస్.ఎస్. అంతరంగమేమిటి? ప్రణాబ్ ముఖర్జీ గారు హాజరు కావడంలోని మతలబేంటని కొందరు తలలు గోక్కుంటున్నారు. ఆర్.ఎస్.ఎస్. వ్యూహాత్మకంగానే తన ప్రయోజనార్థమే ఆహ్వానించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యక్తిగా తాను ‘లైమ్ లైట్’లో ఉండడం కోసమే ప్రణాబ్ ముఖర్జీ గారు హాజరయ్యారనడంలోనూ ఎలాంటి సందేహం లేదు. ఇందులో దేశ హితం దాగి ఉన్నదని ఎవరైనా భావిస్తే భావించవచ్చు! కానీ, ఆ భావన ‘నేతి బీర కాయ’ సామెత లాంటిదే. మొత్తం మీద జాతీయ, ప్రాంతీయ ప్రసారమాధ్యమాలు అటు ఆర్.ఎస్.ఎస్.కు, ఇటు ప్రణాబ్ ముఖర్జీకి పెద్ద ఎత్తున ప్రచారాన్నికల్పించాయి.

7. ప్రణాబ్ ముఖర్జీ గారు గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడే వారూ లేక పోలేదు. ఆయన రాజకీయ జీవితాన్ని ఒకసారి పరికిస్తే అందులోని డొల్లతనం బోధపడుతుంది. ఇందిరా గాంధీ గారు ఎమర్జన్సీ విధించినప్పుడు, బాబరీ మసీదును నేల మట్టం చేసినప్పుడు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడుగా ప్రణాబ్ ముఖర్జీ స్పందనేంటి? తాను రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లును లోక్ సభ ఆమోదించిన తీరు పట్ల కాస్తైనా కలత చెందారా? దశాబ్ధాల పోరాటాల తదనంతరం ప్రజలు సాధించుకొన్న భూసేకరణ చట్టం-2013ను నిర్వీర్యం చేస్తూ మోడీ ప్రభుత్వం మూడు సార్లు ఆర్డినెన్సులు తీసుకొస్తే నోరు మెదప కుండా సంతకం ఎందుకు పెట్టారు? దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెడుతూ, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తిని గొడ్డలి పెట్టుకు గురిచేస్తూ పెద్ద నోట్ల రద్దును మోడీ గారు ఏకపక్షంగా ప్రకటించినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా పని చేసిన అపార అనుభవం కూడా ఉన్న ప్రణాబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా చక్కదిద్దడానికి ఏం చర్యలు తీసుకొన్నారు? ఫిరాయింపుల నిరోధక చట్టం నవ్వుల పాలౌతుంటే, గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఉంటే రాష్ట్రపతిగా ఆయన ఏమైనా స్పందించారా? రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే, చట్టాలను తుంగలో తొక్కే ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలపై స్పందించని, అవసరం ఉన్న లేక పోయినా మోడీ గారిని పొగడ్తలతో ముంచెత్తిన ప్రణాబ్ ముఖర్జీ గారు పదవీ విరమణానంతరం రాజ్యాంగాన్ని, చట్టాలను నొక్కివక్కాణిస్తూ ఉంటే జుగుప్స కలుగుతుంది. ‘మాటల కంటే చేతలు మిన్న” అన్నసామెత గుర్తు కొస్తుంది.

8. ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రధాన మంత్రి పదవికి తానే అర్హుడనని భావించి, నిరాశ చెంది, రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ అన్న పేరిట సొంత కుంపటి పెట్టుకొని, కొంత కాలం తరువాత మళ్ళీ కాంగ్రెసులో కలిపేశారు. డా.మన్మాహన్ సింగ్ స్థానంలో తాను ప్రధాన మంత్రి అవుతానని కలలు కన్నారు. అప్పుడూ, నిరాశే మిగిలింది. ఆ విషయాన్ని ఆయనే తన పుస్తకంలో చెప్పకనే చెప్పారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మార్గదర్శకుడిగా అవతారమెత్తబోతున్నారా! అన్న ఊహాగానాలకు తెరలేపుతూ ఒకటి, రెoడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు బిజెపి అగ్రనేత యల్.కె.ఆద్వానీ, సిపిఐ(యం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఎచూరితో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఫోటోలతో సహా వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆర్.ఎస్.ఎస్. సభలో పాల్గొని, ప్రసంగించారు. విశ్రాంత రాష్ట్రపతిగా ప్రణాబ్ ముఖర్జీ గారు రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరించే స్వేచ్ఛ ఆయనకున్నది. కానీ, పైన ఉదహరించిన ఉదంతాలను కాస్తా నిశితంగా పరిశీలిస్తే, సమకాలీన రాజకీయాలలో క్రియాశీలంగానే ఉన్నానన్న సంకేతాలను ఆయన పంపదలుచు కొన్నట్లుగా కనబడుతున్నది. ఆర్.ఎస్.ఎస్. రాజకీయాలు ఆర్.ఎస్.ఎస్. సొంతం. అలాగే, ప్రణాబ్ ముఖర్జీ రాజకీయాలు ప్రణాబ్ సొంతం. అంతే!

(రచయిత టి.లక్ష్మీనారాయణ తెలుగు నాట బాగా పేరున్న రాజకీయ సామాజికాంశాల విశ్లేషకుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *