పాత సెక్రేటేరియట్ కూల్చివేత ప్రారంభం, ఆంధ్రా నీడ పడని కొత్త సెక్రెటేరియట్ రానుంది

హైదరాబాద్ పాత సచివాలయం కూల్చివేత కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూల్చివేత మొదలయింది. నిన్న అర్ధరాత్రి నుంచి పాత సచివాలయం లోని భవనాలను కూల్చివేస్తున్నట్లు అధికారులు చెప్పారు.సచివాలయం చుట్టూ భారీగా పోలీసులును మొహరించారు. పాత సచివాలయానికి వెళ్లే రోడ్లన్నీ మూసివేశారు. ఇప్పటికే సచివాలయంలోని కొన్ని భవనాలను నేలమట్టం చేశారు.

గత ఏడాది జూన్ 27 వతేదీన అన్ని రకాల వాస్తు సిద్దాంతాలకు అనుకూలంగా ఉండేలా కొత్త సెక్రెటేరియట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేశారు. అయితే, బాగున్న సెక్రెటేరియట్ ను కూల్చి కొత్తది కట్టుకోవడమేమిటని  హైకోర్టు లో పిల్ దాఖలు కావడంతో కొత్త సెక్రెటేరియట్ నిర్మాణం వాయిదా పడింది.  గత వారం ఈ పిల్ ను హైకోర్టు కొట్టి వేసి కూల్చివేత మార్గం సుగమం  చేసింది. ఇపుడున్నసెక్రెటేరియట్లో వసతులు సరిగ్గాలేవని,భవనాలు కూడాబాగాపాతపడ్డాయని ప్రభుత్వం చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవివిస్తూ పిల్ ను కొట్టివేసింది.
దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సెక్రెటేరియట్ లో పది భవనాలున్నాయి.ఎపుడో 1888 లో ఆరో నిజాం కాలంలో ఇక్కడి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి చెబుతున్నా, ఇపుడు వాడులకలో ఉన్న భవనాలన్నీ 1981 తర్వాత నిర్మాణమయినవే.

పాత  సెక్రెటేరియట్ లోని ఎ  బ్లాక్ ని 1981 లో అప్పటి ముఖ్యమంత్రి టి  అంజయ్య ప్రారంభించారు. సి బ్లాక్ ను 1978 లో  ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండిందిక్కడే.  ఇందులో మొత్తం 6 అంతస్తులున్నాయి. మొన్నటి వరకు ఏపీ అధీనంలో ఉన్న జె,ఎల్  బ్లాక్ లను అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 1990 నవంబర్ 12 న ప్రారంభిచారు. తర్వాత ఎ  బ్లాక్ ఫేజ్ 2 ను 1998 ఆగస్టు 10 వ తేదీన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. మరోవైపు డి బ్లాక్కు కూడా 2003 లో చంద్రబాబునాయుడే శంకుస్థాపన చేయగా, 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక  ప్రారంభించారు.
రాష్ట్రవిభజన తర్వాత  దీనిని  ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి సెక్రెటేరిట్ గా విభజించారు. కొంతకాలం పనిచేశారు. అయితే, అమరావతి  రాజధాని నిర్మించేముందుకు నాటి ఆంధ్ర ముఖ్యమంత్రి ఈ సెక్రెటేరియట్ ను ఖాళీ చేయడంతో ఆంధ్రోళ్ల అధికార చిహ్నమయిన దీనిని కూల్చేసి కొత్తది కట్టుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన చేశారు.దీనికి తోడు ఆయన వాస్తుకు ఈ భవనాలు అనుకూలంగా లేవని కూడా చెబుతారు.
ఇందులో భాగంగానే ఆయన తొలుత ముఖ్యమంత్రి నివాసాన్ని ప్రగతి భవన్ పేర చక్కగా నిర్మించుకున్నారు.భారతదేశంలో  ఏ ముఖ్యమంత్రి ఇలాంటిఅధికారం నివాసం లేదు. నిజానికి సంపన్న రాష్ట్రాలనబడే రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులకు అధికార నివాసాలు లేవు. దీనితో తెలంగాణ ముఖ్యమంత్రి దేశంలోనే విశిష్ట పదవి అయింది. ఇపుడు ఇలాగే 100 శాతం తెలంగాణ సెక్రెటేరియట్ నిర్మించాలనుకుంటున్నారు. ఇందుంలో ఆంధ్ర  ప్రాంతాల నిధులండవు. ఆంధ్రావాళ్ల గుర్తులుండవు. ఆయన అమితంగా ద్వేషించే చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి వంటి నేతలు తిరగాడిన చరిత్రా ఉండదు. తెలంగాణకు ఇది నూతనారంభం.

కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ఇలా భారీ ఖర్చుతో కూడిన  కూల్చివేతకు, అనంతరం నిర్మాణానికి పూనుకోవడం సాహసమే. ఎందుకంటే, ఆర్థిక పరిస్థితులు బాగాలేవని ఉద్యోగులు జీతాలు కోత కోసిన ప్రభుత్వం ఇలా సెక్రెటేరియట్ నిర్మాణానికి అంత్యంత ప్రాముఖ్యమీయడం విమర్శలకు తావీయవచ్చు.

కొత్త సచివాలయం నమూనా

కొత్త సెక్రెటేరియట్ నిర్మాణానికి సుమారు రు.1000 నుంచి రు. 1200 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఈ ఖర్చులకు ముఖ్యమంత్రి కెసిఆర్ జంకే ప్రశ్నేలేదు. ఎందుకంటే, తొలినుంచి ఆయన తెలంగాణా దేశంలోనే ఒక సంపన్న రాష్ట్రం అంటూ తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని చెబుతూ వస్తున్నారు. నిజానికి ఆయన తెలంగాణలో పాత ఉమ్మడి ఆంధ్ర పాలకుల ఆనవాళ్లు సాధ్యమయినంతవరకు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

1956-2014 మధ్య ఉన్న ఉన్న ఆంధ్ర పరిపాలన ఒక చేదు జ్ఞాపకం. ఆధునిక తెలంగణా చరిత్ర తనతో ప్రారంభమవుతున్నదని చెప్పేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రాజక్టులు పునర్నిర్మాణం మొదలయింది.ఇపుడు పరిపాలనా భవనాలు పునర్నిర్మాణం జరగుతున్నది.