ఆంధ్రలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం కార్పొరేషన్, నేడు నిర్ణయం?

ఇక నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో  ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలుచేయాలని నిర్ణయించారు. ఈ ఉ ద్యోగాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ రోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

అంటే ఇక ముందు రాష్ట్రంలో కింది స్తాయిలో  ఉద్యోగాల నియామకాలు ఉండవేమో. అన్ని పోస్టులను ఔట్  సోర్సింగ్ ద్వారా నియమించాలనుకోవడం దానికి భారీగా ఏర్పాట్లు చేయాలనుకోవడం ఇక ఎపిపిఎస్సిలో గ్రూప్ ఫోర్ వంటి నియామకాలుండవేనేందుకు ఇది సూచన లాగా కనిపిస్తున్నది.

అయితే,  అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను సిస్టమాటిక్ గా నియమించేందుకు ప్రత్యేకంగా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఇదే నిజమయితే  ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు నేటి మంత్రివర్గ భేటీలో గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.

నేడు క్యాబినెట్ ముందున్న ముఖ్యాంశాలు

రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలచేసే విషయం కూడా   ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో చర్చకువస్తుందని తెలిసింది.ఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చ జరగనుంది.

ఇదే విధంగా నవరత్నాల్లోని కీలకమైన సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేక ప్రాముఖ్యం ఇస్తూంది.

ఇలాగే వైఎస్​ఆర్ ఆసరా పథకంలో భాగంగా చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే అంశంపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చించనుంది.

మత్స్యకారుల సంక్షేమ కోసం చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే మొత్తాన్ని పది వేలకు పెంచే అంశంపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

గతంలో మత్స్యకారులకు రూ. 4500 చెల్లించారు.ప్రస్తుతం పరిహారాన్ని 10 వేలకు పెంచాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ అంశంపై కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.

ఇక డ్వాక్రా మహిళల కోసం గతంలో వెలుగు పేరుతో చేపట్టిన పేదరిక నిర్మూలన పథకాన్ని వైఎస్ఆర్ క్రాంతి పథంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక ఇప్పటికే తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూడా కేబినెట్ రాటిఫై చేయనుంది.

వ్యవసాయ మిషన్ సమావేశంలో వైఎస్సార్ రైతు భరోసా పథకానికి వేయి రూపాయల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని కేబినెట్ రాటిఫై చేయనుంది.

వ్యవసాయ కమిషన్ సమావేశంలో మిల్లెట్, పల్సెస్, ప్యాడీ బోర్డులను ఏర్పాటు చేయటం ద్వారా ఆయా రంగాల్లో అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టవచ్చన్న ప్రతిపాదన వచ్చింది.

దీనికి సీఎం జగన్ ఆమోదం లభించటంతో ఈ బోర్డుల ఏర్పాటు అంశం మంత్రి వర్గ భేటీలో చర్చకు రానున్నట్టు తెలుస్తోంది.

పాఠశాలల అభివృద్ధికి ‘మన బడి నాడు-నేడు’ పేరుతో ప్రత్యేకంగా ఓ పథకాన్ని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైనా కేబినెట్ లో చర్చించనున్నట్టు సమాచారం.

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా రిజర్వేషన్ల అంశంపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంది.

ప్రస్తుతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 59.5 శాతంగా ఉండటంతో దీన్ని కుదించే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

వివాదమవుతున్న పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, పీపీఏల వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఇక కొత్త ఇసుక విధానం గురించి సీఎం జగన్ మంత్రుల వద్ద ప్రస్తావించే సూచనలు కనిపిస్తున్నాయి.

మొత్తం 15 అంశాలతో కూడిన అజెండాపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.