Home English లాస్ట్ బాల్ ఫినిష్…ఇది ఇంకో రకం!

లాస్ట్ బాల్ ఫినిష్…ఇది ఇంకో రకం!

254
0
SHARE

(బి వెంకటేశ్వరమూర్తి)

బెంగుళూరు: ’లాస్ట్ బాల్ ఫినిష్’ అనే క్రికెట్ పదప్రయోగానికి గురువారం నాటి ఐపిఎల్ మ్యాచ్ సరికొత్త అర్థాన్ని ఆవిష్కరించింది. అలా సరికొత్త అర్థం చెప్పింది తన బ్యాటింగ్ విన్యాసాలతో ఉర్రూతలూపిన డివిలియర్సో, కత్తుల్లాంటి బంతులు విసిరి అంతటి డివిలియర్స్ ను సైతం ఇబ్బంది పెట్టిన బూమ్ బూమ్ బుమ్రానో ఎంత మాత్రం కాదు. ఆ ఘనత నూటికి నూరు పాళ్లూ అంపైర్ ఎస్ రవికి దక్కుతుంది.

ముంబై ఇండియా స్కోరు (187)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఛేజ్ చేస్తున్నప్పుడు మెయిన్ అంపైర్ గా బాధ్యత నిర్వహించిన రవి,  లసిత్ మలింగ వేసిన చివరి బంతిని నో బాల్ గా ప్రకటించక పోవడం తీవ్ర చర్చనీయాంశమయింది.

చివరి బంతిపై బెంగుళూరు ఏడు పరుగులు చేయవలసి ఉండగా శివమ్ దూబే లాంగాన్ లోకి షాట్ కొట్టాడు. ఇద్దరు ఫీల్డర్ లు బంతి మీదకు దూసుకెళ్లడంతో, ఎలాగూ విజయానికి కాదు గదా కనీసం టై కి కూడా అవకాశం లేదు గనుక బ్యాట్స్ మెన్ పరుగు కోసం ప్రయత్నించ లేదు.

ముంబై ఆటగాళ్లు ఎగిరి గంతులేస్తూ, పరస్పరం ఆలింగనాలతో అభినందించుకుంటూ, నాటౌట్ బ్యాట్స్ మెన్, అంపైర్ లతో కరచాలనాలు చేస్తూ మైదానం నుంచి నిష్క్రమించసాగారు. బెంగుళూరు అభిమానులతో బాటు తీవ్ర నైరాశ్యంలో కూరుకు పోయిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మోకాళ్ల మధ్య తలను దాచుకుని మౌనంగా విలపించసాగాడు.

సరిగ్గా ఆ క్షణంలో, చివరి బంతిపై అంపైర్ చేసిన భారీ తప్పిదం మైదానంలోని జైంట్ స్క్రీన్ పై ప్రత్యక్షమయింది. ఆటగాళ్ల గ్యాలరీలోని కోహ్లీ, మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్ కు వెళుతూ బౌండరీ దాటుతున్న రోహిత్ శర్మ, ప్రత్యక్ష వ్యాఖ్యాతలు, మీడియా ప్రతినిధులు, స్టేడియంలోని వేలాది మంది, ఇళ్లలో టివి సెట్ల ముందు పాతుకుపోయిన లక్షలాది మంది ప్రేక్షకులు అంతా చూశారు, ఆ యాక్షన్ రీప్లేను.

మలింగ ఓవర్ స్టెప్ చేసి బంతి విసరడం విస్పష్టంగా కనిపించింది. అందరిలో దిగ్భ్రాంతి. కొందరికి పట్టరాని కోపం. వ్యక్తం చేయడానికి సాధ్యం కాని తీవ్ర భావోద్వేగాలు.

మరికొన్ని నిముషాల్లోనే ఆ అంపైరింగ్ తప్పిదంపై అంతా అన్ని రకాలుగా విరుచుకు పడ్డారు. అవార్డ్ సెర్మనీ వేదికపై కోహ్లీ, కళ్లు మూసుకుని కాకుండా కళ్లు తెరుచుకుని అంపైరింగ్ చేస్తే మంచిదని అభిప్రాయ పడ్డాడు. మలింగ కంటే ముందు బుమ్రా ఓవర్ లో కూడా అనవసరంగా ఓ బంతిని వైడ్ ఇచ్చారని రోహిత్ శర్మ నొచ్చుకున్నాడు.

సోషల్ మీడియాలో దీనిపై ట్వీట్ల మీద ట్వీట్లు వెల్లువెత్తాయి. ఇట్లా లాభం లేదు. క్రికెట్ కు మేలు జరగాలంటే టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించక తప్పదు. థర్డ్ అంపైర్ ప్రతి బంతిని నిశితంగా గమనిస్తుండాలి. నో బాల్ వంటి సందర్భాల్లో తక్షణం ఫీల్డ్ అంపైర్ ని హెచ్చరించి ఇలాంటి ఘోరమైన పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలంటూ హర్ష భోగ్లే వంటి ఎక్స్ పర్ట్ లు సలహా ఇచ్చారు.

లాస్ట్ బాల్ ఫినిష్ అంటే 1986 షార్జా కప్ ఫైనల్లో చేతన్ శర్మ వేసిన చివరి బంతిపై జావేద్ మియాందాద్ సిక్సర్ కొట్టి పాకిస్తాన్ కు కప్పు గెలిచి పెట్టడం గుర్తుకు వస్తుంది.  2006లో వెస్టిండీస్ -దక్షిణాఫ్రికా సిరీస్ మూడో వన్ డేలో విండీస్ 285 పరుగులు ఛేజ్ చేస్తుండగా, చివరి ఓవర్ లో కేవలం నాలుగే పరుగులు కావలసి ఉన్న స్థితిలో డ్వేన్ బ్రావో అంతటి మ్యాచ్ విన్నర్ క్రీజులో ఉన్నప్పటికీ, దక్షిణాఫ్రికా బౌలర్ ఛార్ల్ లాంజ్ వెల్ట్ వరసగా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాకు విజయం సాధించి పెట్టిన పతాక సన్నివేశం గుర్తుకు వస్తుంది. ఇలా చప్పున స్ఫురణకు వచ్చే అత్యద్భుతమైన పతాక సన్నివేశాలు ఐపిఎల్ చరిత్రలోను ఇప్పటికే చాలినన్ని ఉన్నాయి.  క్రికెట్ రథం మునుముందుకు సాగుతున్న కొద్దీ ఇలాంటి అద్భుత ఘటనలు ఇంకా ఇంకా ఈ జాబితాలోకి చేరుతూనే ఉంటాయి. అయితే నిన్న బెంగుళూరులో విచ్చుకున్న ఈ రకమైన లాస్ట్ బాల్ ఫినిష్  మాత్రం క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిదీ, ఆఖరుదీ కావాలని క్రికెట్ ప్రేమికులంతా మనసారా కోరుకుంటున్నారు.

సాంకేతిక పరంగానూ, క్రికెట్ రికార్డుల రీత్యాను ఈ మ్యాచ్ పూర్తయినట్టూ, ఆర్ సిబి పై ముంబై ఇండియన్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించినట్టు ఖాయమైపోయింది. కానీ క్రికెట్ అభిమానుల్లో చాలా మందికి, కోహ్లీ, రోహిత్, దూబే, మలింగ వంటి మరి కొందరికి ఆ జైంట్ స్క్రీన్ రీ ప్లే బహుశ మాటిమాటికీ కలలోకి వచ్చి ఏడిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే, అది నో బాల్ కాబట్టి బెంగుళూరు ఛేజ్ చేయాల్సిన టార్గెట్ ఒకటి మేరకు తగ్గి ఏడు నుంచి ఆరు అయ్యుండేది. నో బాల్ కారణంగా లభించే ఫ్రీ హిట్ లో వస్తే పరుగులే రావాలి తప్ప దూబే అవుటయ్యే అవకాశం ఉండదు. భయసందేహాలకు అస్సలు తావు లేదు కనుక దూబే వీరప్రహారంలో బంతి బౌండరీ అవతల ప్రేక్షకుల్లోకి వెళ్లి మాయమైపోయి సిక్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు.

”క్రికెట్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ సో మెనీ ఇఫ్ స్ అండ్ బట్ స్,” అని ఇంగ్లీషు ఆర్యోక్తి (ఇంగ్లీషు వాళ్లెప్పుడూ ఆర్యులే కదా). అయితే, అయితే…గియితేలు, కానీ…గీనీల క్లాజుల్లోకి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ లతో బాటు అంపైరింగ్ ను కూడా చేర్చుకోవాలి. ఇలా చేయవలసి వస్తున్నందుకు క్రికెట్ అభిమానులంతా ఎస్ రవికి ముక్తకంఠంతో ధన్యవాదాలు తెలుపుకోక తప్పదు.