కెసిఆర్ సారూ, ముందు ఆ అఫిడవిట్ వెనక్కి తీసుకోండి… రాయలసీమ విజ్ఞప్తి

తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడం మీద తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆసక్తి చూపుతున్నారు. అయితే, దానికి ముందుకు ఆయన కొన్ని చేయాల్సిన పనులుకొన్ని ఉన్నాయని రాయలసీమ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకుడు టి లక్ష్మినారాయణ కెసిఆర్ కు చేసిన సూచనలు:
1. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి సహకరిస్తానంటున్న కేసీఆర్ రాయలసీమ రాళ్ళ సీమ కాకుండా సహకరిస్తే సంతోషం !
2. రాయలసీమ ప్రాంతం కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో లేదని, నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీటిని కేటాయించడానికి వీల్లేదని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ముచ్చుమర్రి ఎత్తిపోతలను మూసి వేయాలంటూ అడ్డగోలు వాదనలు, అవాస్తవాలతో కూడిన “అఫిడవిట్”ను బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు దాఖలు చేశారు. దాన్ని తక్షణం ఉపసంహరించుకొంటే కేసీఆర్ మాటలకు కాస్త విలువుంటుంది.
3. కేంద్ర జల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం మేరకు ఏర్పాటు చేసిన అఫెక్స్ కౌన్సిల్ మరియు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండానే శ్రీశైలం జలాశయం నుండి నీటిని తోడేసే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడాన్ని ఎలా సమర్థించుకొంటారు? ఆ సంగతి ముందు తేల్చండి.
4. పోతిరెడ్డిపాడు నుండి నీటిని తరలించాలంటే శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టాన్ని పరిరక్షించాలి. 834 అడుగులను యం.డి.డి.ఎల్. గా నిర్ధారిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి, అమలు చేస్తున్న జీ.ఓ. ను రద్దు చేయడానికి కేసీఆర్ అంగీకరిస్తే, ఆయన చెప్పిన మాటలకు విలువుంటుంది.
5. 132 టియంసిల నిల్వ సామర్థ్యంతో నిర్మించబడిన తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల 100 టియంసిలకు పడిపోయింది. పర్యవసానంగా ఆ నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది. కర్నూలు జిల్లాలోని సుంకేసుల ఆనకట్టకు పైభాగంలో 20 టియంసిల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయరు నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టింది. అలాగే సిద్ధేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. వాటికి కేసీఆర్ ప్రభుత్వం అంగీకారాన్ని తెలియజేస్తే ఆయన మాటల్లో కాస్త చిత్తశుద్ధి ఉన్నట్లు భావించవచ్చు.
(టి.లక్ష్మీనారాయణ)