ఈ సమోసా అమ్మేవాడి ఆదాయం ఎంతో తెలుసా?

ఒక సమోసా,కచోడి ల దుకాణం ఆదాయం చూసి  టాక్స్ అధికారులకు దిమ్మ తిరిగింది. టాక్స్ కట్టమని నోటీసులు పంపారు.  జిఎస్ టి కింద ఎందుకు రిజిస్టర్ చేసుకోలేదని నిలదీశారు.

టాక్స్ గీక్స్ మనకు తెల్వద్, జిఎస్ టి అంటే కూడా ఏమీ తెల్వద్ అంటున్నాడు  ఖచోడి వాలా.   అయితే లెక్కలు తీయమంటున్నారు  అధికారులు.

అసలలాంటివేమీ లేవంటున్నాడు దుకాణం వోనర్.

ఉత్తర ప్రదేశ్ లోని అలీఘడ్ లో ఈ విచిత్రం కనిపించింది. అక్కడ సీమా టాకీస్ ఎదురుగా ‘ముఖేష్ కచోడివాలా‘ అనే షాప్ ఉంది. పొద్దున్నుంచి రాత్రెపుడో మూసే దాకా ఇక్కడ జనం క్యూ కట్టి సమోసాలు, కచోడీలు  తింటుంటారు. కొని తీసుకెళ్తుంటారు.

దీని సంగతేమో కనుక్కుందామని టాక్స్ అధికారులు ఎదురుగా ఉన్నమరొక షాపులు తిష్ట వేసి గమనించారు.

వ్యాపారం పిచ్చిపిచ్చిగా జరుగుతూ ఉంది. వచ్చిపోయే జనాన్నిచూసి సమోస ధరలనుబట్టి ముఖేష్ దుకాణం బిజినెస్ సంవత్సరానికి రు.60లక్షల నుంచి కోటి రుపాయాల దాకా ఉంటుందని అంచనావేశారు.

ఇంత బిజినెస్ చేస్తున్నపుడు షాపును జిఎస్ టి కింద రిజస్టర్ చేయాలి.  నిజంగానే ముఖేష్ కచోడివాాలాకు  ఇంత వ్యవహారం తెలియదు. ఏదో అమ్ముతూ పోతున్నాడు, డబ్బులు దండుకుంటున్నాడు.

ముఖేష్ గత 12 సంవత్సరాలుగా సమోసాలమ్ముతాడు. ఇలాంటి నియమాలున్నాయని మాకెవరూ చెప్పలేదు, ఏదో బతుకు దెరువుకు సమోసాలమ్ముకుంటున్నామని అమాయకంగా చెబుతున్నాడు.

ఉత్తర ప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్లు ఈ షాపు వ్యాపారం మీద ఆరా తీశారు. ముఖేష్ తమకు అన్ని వివరాలిచ్చాడని, తను కొనే వస్తువుల బిల్లులన్నీ చూపాడాని అధికారులు చెబుతున్నారు.

జిఎస్ టి ప్రకారం,  రు. 40లక్షల టర్నోవర్ దాటిన వాళ్లంతా రిజిస్టర్ చేసుకోవాలి. ఆదాయంలో అయిదు శాతం టాక్స్ కట్టాలి.