Home Telugu మా సుదర్శనం సారూ, ప్రీమియర్ పద్మిని

మా సుదర్శనం సారూ, ప్రీమియర్ పద్మిని

91
0
SHARE

(బి వేంకటేశ్వర మూర్తి)

చాలా సంవత్సరాల తర్వాత మొన్నీమధ్య అనంతపురం వెళ్లినపప్పుడు మా ఆర్ట్స్ కాలేజ్ లోపలికి అడుగు పెడుతుంటే అదేదో అనిర్వచనీయమైన ఆనందం. అయిదారుగురు డిగ్రీ క్లాస్ మేట్లను మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అనంతపురానికి రప్పించిన మా వీరారెడ్డికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొన్నాం. అందరం కలిసి క్యాంపస్ అంతా కలయతిరుగుతుంటే కాలేజ్ రోజుల మధుర స్మృతులు మనసంతా నిండిపోతున్నాయ్.

మెయిన్ బిల్డింగ్ మధ్యనున్న ప్రధాన ముఖద్వారం నుంచి లోపలికి వెళితే, ఇంకా ఆలస్యమెందుకు జ్ఞావకాల లోగిలిలో పైపైకి పోదాం రా రమ్మని అక్కడున్న టేకుమెట్ల స్టెయిర్ కేసు ఆర్ద్రంగా ఆహ్వానించినట్టయింది. ఆ టేకుమెట్ల స్టెయిర్ కేసుకు ఆపోజిట్ గా, సరిగా ముఖద్వారం నెత్తిన ఉండేది ప్రిన్సిపల్ రూము.

అప్పట్లో మా ప్రిన్సిపాలుడు ఆర్ ఎస్ సుదర్శనం సారు. నా డిగ్రీ అడ్మిషన్ కోసం మా పెద్దన్నయ్యతో కలిసి వెళ్లినప్పుడు అదే ప్రిన్సిపల్ రూములో ఆయన్ని మొట్టమొదటి సారి కలిశాను. ఆప్పట్లో అంతకంటే పెద్ద సైజు ఉండటానికి వీల్లేనంత పేద్ద కళ్లజోడులో నుంచి `టాంబా’ గోలీగుండంత (గోలీ గుండు మా చిన్నప్పుడు మూడు సైజుల్లో ఉండేది. పిల్లి గోలీగుండు అతి చిన్నది. పిల్లి కండ్ల సైజు. మామూలు గోలీగుండు సోడా సీసా గొంతులో ఒదిగే సైజు. టాంబా అన్నిటి కంటే పెద్దది.) కనుగుడ్లను చురుకుగా కదిలిస్తూ స్ట్రెయిట్ గా చూసే వారాయన.

కళ్లజోడు కాదు గానీ చూసీ చూడగానే నన్ను వెంటనే ఆకర్షించింది ఆయనగారి బ్రహ్మాండమైన బట్టతల. ఆ కాలంలో, ఆ తర్వాతి కాలంలో కూడా, వొట్టు, అంత అందమైన బట్టతలను నేనెక్కడా చూళ్లేదు. అదెంత నున్నగా ఉండేదంటే, మా కాలేజీ టేకుమెట్ల స్టెయిర్ కేసు తాలూకు చెక్కదిమ్మెతో నున్నదనంలో ఆయన బట్టతల గట్టిగా పోటీ పడేది. ఆ దిమ్మెకూ ఈ బట్టతలకూ ఒక్కటే తేడా. అదేమో మెరిసిపోయే వక్కరంగూ, ఇదేమో షైనింగ్ లైట్ గోల్డు.

సుదర్శనం గారు కొమ్ములు తిరిగిన సాహిత్య విమర్శకుడని ఉత్తరోత్తరా నాకు తెలిసింది. అంత గొప్ప సాహితీ వేత్త హయాంలో మా ఆర్ట్స్ కాలేజీలో చదివినందుకు నేను చాలా గర్వపడుతుంటాను. ఆయన కాలేజీకి తన ప్రిమియర్ పద్మిని కారులో తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవారు. అప్పటికి అనంతపురంలో ఉన్న పదీ పదహైదు, లేకపోతే మహా అయితే ఓ యాభై అరవై డబ్బా అంబాసిడర్ లలో ఆయన గారి పద్మిని ముద్దుగా, ముగ్ధంగా చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోయేది.

మా ప్రిన్సిపల్ అంటే మాకు గొప్ప అడొరేషనే గానీ ఆ ముఖద్వారం పైనున్న ప్రిన్సిపల్ రూమ్ మీద మాత్రం ఎంత మాత్రం ప్రేమ లేదు. పైగా, ఆ ఎమర్జెన్సీ రోజుల్లో భయంకరమైన డిసిప్లిన్ రూళ్ల కర్రతో మా నెత్తి పగలగొట్టే దుష్ట, దుర్మార్గ మంత్రాంగమంతా ఆ గదిలోనే జరుగుతుండేదని అప్పట్లో మా ఘోరమైన అనుమానం. మా స్టూడెంట్స్ కి వల్లమాలిన ప్రేమ, చూపులన్నీ, ఆ స్టెయిర్ కేసు పక్కనున్న గళ్స్ వెయిటింగ్ రూమ్ పైనే.

గళ్స్ రూమ్ పక్కనే లెక్చరర్స్ సేద తీరే స్టాఫ్ రూమ్ ఉండటం మొత్తం ఆర్ట్స్ కాలేజీ స్ట్రక్చర్ లో ఉన్న ఒకే ఒక్క గొప్ప  వాస్తు దోషమని అప్పట్లో మా అందరి ప్రామాణిక ఏకాభిప్రాయం. ఎవరో కొంతమంది కుర్ర లెక్చరర్ లు పట్టుబట్టి పోరాడి సాధించుకున్న `ది మోస్ట్ అన్నెసెసరీ, అన్ డిజర్వింగ్, అన్ వాంటెడ్ ప్రివిలేజ్’ ఇదని మేం కొందరం అప్పుడప్పుడూ నోళ్లు నొక్కుకునే వాళ్లం. మా ఆర్ట్స్ కాలేజీకి మా కంటే ఎన్నో రెట్లు గర్వకారణమైన మా సహ విద్యార్థినులు అటూ ఇటూ తిరుగుతుంటే, వాళ్ల డ్రెస్సులూ, స్టయిలూ, గట్రా మంచీ చెడ్డా గమనించుకోడం వారి సహ విద్యార్థులమైన మా బాధ్యత అవునా కాదా? క్లాసులు స్టార్టవడానికి కాస్త ముందూ, అయిపోయాక కాసేపూ, భావసారూప్యత గల మా మిత్రబృందాల వాళ్లం కొందరం, ప్రత్యేకంగా ఆ మఖద్వారం ప్రాంతంలో సమావేశమై పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటే, అసూయాగ్రస్తులైన లెక్చరర్ లు చూసీచూడనట్టు వెళ్లిపోకుండా, ఈ బృందాల్లో ఎవరెవరున్నారు? ఏం కథ? అన్నట్టు నిఘా కార్యకలాపాలు సాగించడం న్యాయమే నంటారా?.

మా డిగ్రీ చదువు రెండేళ్లయ్యాక, ఎమర్జెన్సీ ఎత్తేసి, ప్రజాస్వామ్యం తిరిగి పరిఢవిల్లుతున్న దశలో `గళ్స్ రూమ్ పక్కనే స్టాఫ్ రూమ్ ఉండటం అవసరమా’ అన్న అంశంపైన ఓ డిబేట్ పెట్టి ఉంటే, విద్యార్థి లోకపు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు, విద్యార్థినీ విద్యార్థుల మధ్య స్నేహ సౌహార్ద్రాలకు ఇది గొప్ప ప్రతిబంధకం కనుక ఆ దిక్కుమాలిన స్టాఫ్ రూమ్ సదరు స్థానంలో ఏ మాత్రం అవసరం లేదని సాక్ష్యాధారాలతో సహా నిర్ద్వంద్వంగా నిరూపించే వాడిని.

(బి వెేంకటేశ్వర మూర్తి, సీనియర్ జర్నలిస్టు, బెంగుళూరు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here