‘సాహో” ఎందుకు బెడిసి కొట్టింది: సినిమా బ్లాగోతం

ఆఖరికి 350 కోట్ల అతి ఖరీదైన నాలుగు భాషల పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ని కూడా, అదే లోకల్ తెలుగు లైటర్ వెయిన్ ప్రేమ కథల ఫార్ములా (ఎల్పీ ఎఫ్) చట్రంలో పెట్టేశారు!
పాన్ ఇండియా అన్నాక గ్లోబల్ స్క్రిప్టు వుండాలని ఆలోచించలేదు. గత ఇరవై ఏళ్లుగా ఈ ఎల్పీఎఫ్ చట్రమే తెలుగు సినిమాలకి ఎన్నోసార్లు చుక్కలు చూపించింది…ఏ తెలుగు సినిమా తలపెట్టినా దాని జనర్ ని పట్టించుకోకుండా ఏనాటిదో లైటర్ వెయిన్ ప్రేమ కథల ఫార్ములా చట్రంలో చుట్టేయడమే.
అప్పట్లో ఏ కథ చేస్తున్నారంటే, ‘లైటర్ వెయిన్’ అనడం ఫ్యాషన్ గా మారింది. ఈ ఎల్పీ ఎఫ్ సినిమాలే చూస్తూ పెరిగిన తరం కూడా అవే తీస్తూ, ఏ కథ చేస్తున్నారంటే, ‘రోమ్ కాం’ అని మరింత ఫ్యాషనబుల్ గా అనడం మొదలెట్టారు.
ఏవి చూస్తూ పెరిగితే అవే తీస్తారు. ఇంకాస్తా పోయాక వరల్డ్ మూవీస్ మీద మోజు కూడా పెంచుకున్నారు కాబట్టి, వాటినీ ఎల్పీఎఫ్ తో కలిపి తీసేస్తారు.
ఇవి తప్ప ఇంకో ప్రపంచం, సొంత ప్రతిభ లేనట్టే వుంటుంది. 2000 – 2005 మధ్యకాలంలో వేలం వెర్రిగా వచ్చిపడ్డ ఎల్పీ ఎఫ్ సినిమాల ప్రభావంతో ఇంకా అదే చట్రంలో స్టార్ సినిమాలు కూడా తీస్తూ, ఇంకా చిన్నా చితకా రోమాంటిక్ కామెడీలూ తీస్తూ, ఇప్పటికీ 90 శాతం అట్టర్ ఫ్లాపుల జాబితాని విజయవంతంగా నిలబెట్టుకుంటున్నారు.
‘సాహో’ – ‘లార్గో వించ్’ కాపీ అంటూ హల్చల్ చేయడం అనవసరం.
గాడ్ ఫాదర్ ని బైబిల్ లా పెట్టుకుని 100 సినిమాలు తీశారు. హమ్ ఆప్కే హై కౌన్ ని రాజ్యాంగంలా పెట్టుకుని 200 సినిమాలు తీశారు. సమరసింహా రెడ్డిని భగవద్గీతలా కళ్ళకద్దుకుని 300 సినిమాలు తీశారు. అంతర్జాతీయ మీడియా 1.5 రేటింగులిచ్చిన లార్గో వించ్ అనే వరల్డ్ మూవీని తీసుకుని, తెలుగులో ఓ రెండు తీస్తే కొంపలేం మునిగిపోవు.
కొంపలు మునిగింది తీసిన విధానంతో. ఇది లేజర్ స్కానింగ్ లో బయటపడే విషయం. ఆఖరికి ఈ ఎల్పీ ఎఫ్ చట్రంలో ప్రసిద్ధ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో, సింగీతం శ్రీనివాసరావు లాంటి సీనియర్ దర్శకుడు కూడా ‘విజయం’ (2003) అనే రోమాంటిక్ కామెడీ తీసి దెబ్బతిన్నారు. ఎల్పీ ఎఫ్ చట్రంలో కథనేది వుండదు, కాలక్షేపమే వుంటుంది. కాలక్షేపం సాగి సాగి, సినిమా చివర ఎక్కడో పిసరంత కథ వుండి చప్పున ముగిసిపోతుంది. దీన్నే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అంటాం.
స్ట్రక్చర్ అంటే గిట్టని వాళ్లకి ఈ సాంకేతికం తెలిసే అవకాశం లేదు. దీంతో పరాకాష్టకి పోయి షాకింగ్ గా ఇప్పుడు చేసిందేమిటంటే, ‘సాహో’ లాంటి భారీ మాఫియా పోరాటాల కథకి కూడా దీంతోనే పాల్పడ్డం! పిట్ట ప్రాణాన్ని గరుత్మంతుడులో పోయాలనుకోవడం!
ఈ పిట్ట ప్రాణం ఎక్కడిది? 2014 లో దర్శకుడి తొలిప్రయత్నం ‘రన్ రాజా రన్’ లోనిదే. ఇందులో వాడిన ఎల్పీ ఎఫ్ చట్రంలోనే ‘లార్గో వించ్’ ని దింపితే, అదికాస్తా ‘సాహో’ అనే శాండ్ విచ్ గా తయారయ్యింది – స్టఫ్ లేని మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేతో.
‘సాహో’ కేవలం భారీ యాక్షన్ థ్రిల్లరేనా? కాదు, ఇంత భారీ స్థాయిలో యాక్షన్ థ్రిల్లర్ తలపెడితే హై కాన్సెప్ట్ మూవీస్ వర్గంలో చేరుతుంది. హై కాన్సెప్ట్ జానర్ మర్యాదలు ఒనగూడుతాయి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోలేదు. మురగదాస్ సాధారణ సైకో థ్రిల్లర్ ‘స్పైడర్’ కథకి, క్లయిమాక్స్ లో హై కాన్సెప్ట్ జానర్ దృశ్యాలు అతికించినట్టు, సుజీత్ హై కాన్సెప్ట్ యాక్షన్ థ్రిల్లర్ కి లో- కాన్సెప్ట్ కథనం చేశాడు, అదీ మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేతో. ‘రన్ రాజా రన్’ మిడిల్ మటాష్ తో ఆడిందంటే తెలిసో తెలీకో సీన్ రివర్సల్ టెక్నిక్ తో కథనం చేయడం వల్ల.
‘సాహో’ లో మిడిల్ మటాష్ కి ఈ టెక్నిక్ బదులు, ట్విస్టుల మీద ట్విస్టులతో కథనం చేశాడు. ఇది బెడిసి కొట్టింది.
(అసంపూర్ణం. పూర్తిగా చదవాలనుకుంటే బ్లాగ్ సందర్శించండి)
-సికిందర్
(సికిందర్ సినిమా స్క్రిప్ట్ & బ్లాగ్ నుంచి)