టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలని ఉత్తమ్ చేసిన విమర్శలను ఖండించారు. అంతేకాదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ ల పై విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద ఉంది చదవండి.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు ,రేగా కాంత రావు బాహాటంగా కెసిఆర్ విధానాలు నచ్చి టీఆరెస్ లో చేరుతామన్నారు. అవసరమైతే పదవులకు రాజీనామా చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలని ఉత్తమ్ చేసిన విమర్శలను ఖండిస్తున్నా. ఉత్తమ్ నాయకత్వం పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నే విమర్శలు చేశారు.
రాహుల్, ప్రియాంకల సమక్షంలో నిన్ననే యూపీ బీజేపీ ఎంపీ సావిత్రి భాయి పూలే కాంగ్రెస్ లో చేరారు. ఆమెను రాహుల్ గాంధీ ఎంతకు కొన్నారు? పార్టీలు మారడం, విధానాలు సమీక్షించుకోవడం సహజమే. ఇది కొత్త అన్నట్టు ఉత్తమ్ మాట్లాడుతున్నారు.
ఎన్నికల సమయం లో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితరులు కాంగ్రెస్ లో చేరారు వారిని ఎంతకు కొన్నారు? రేవంత్ రెడ్డిని ఎంతకు కొన్నారు? గతంలో మా పార్టీ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారు? అసలు కొనడం అనే మాట తప్పు. ఇది రాజకీయ వ్యవస్థను దిగజార్చడమే.
తమ మిత్ర పక్షం టీడీపీ… ఏపీలో 26 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నపుడు ఉత్తమ్ ఇలా ఎందుకు మాట్లాడ లేదు? ఇలాంటి చవక బారు విమర్శలు మానాలి. అడ్డంగా దొరికినపుడు చంద్రబాబు, లోకేష్ లు మిద్దె నెక్కి అరుస్తూ ఉంటారు.
ఏపీ ఓటర్ల సమాచారాన్ని టీడీపీ చోరీ చేస్తుందని హైదరాబాద్ నివాసి ఫిర్యాదు చేస్తే తెలంగాణ ప్రభుత్వం స్పందించదా? ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని? ఐటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పు చేయనప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడాలి.
ప్రజల్లో పరపతి కోల్పోయానని చంద్రబాబు భయపడి మాట్లాడుతున్నారు. ఏపీ లో బాబు చేసిందేమి లేదు. చంద్రబాబుకు సిగ్గుండాలి. దొంగే దొంగ అని అరుస్తున్నట్ట ఉంది. విచారణలో కడిగిన ముత్యాల్లా బయట పడండి.
చంద్రబాబు 18 కేసలలో స్టే లు తెచ్చు కున్నారు. ఈ కేసులోనూ స్టే తెచ్చుకోమనండి. ఎందుకు భయం? నకిలీ ఫేస్ బుక్ ఐడి లు సృష్టించి టీఆరెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ డ్రామాలను ప్రజలు నమ్మరు.