ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లో వీరు సమావేశమయ్యారు. సుమారు అరగంటసేపు వీరి భేటీ కొనసాగింది. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వీరి భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. భేటీ అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. నాగార్జున రాజకీయాల్లోకి రానున్నారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. కాగా వీరి భేటీపై గుంటూరు టీడీపీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త స్పందించారు.
నేను వైసీపీలో లేను. నాగార్జున, జగన్ ఎందుకు భేటీ అయ్యారో నాకు తెలియదు. ఆయన నాకు మంచి స్నేహితుడు. ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే నాకు ముందుగానే చెప్పేవారు. ఆయన నాటో ఏమి చెప్పలేదు. నాకు తెలిసి ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. 2014 ఎన్నికల్లో గుంటూరులో అయితే ఈజీగా గెలుస్తానని పోటీ చేయలేదు అన్న ఆయన ఇది తన మామగారి ఊరు కాబట్టి పోటీ చేశాను అన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ టఫ్ ఫైట్ ఉంటుంది, కానీ ఈసారి తనపై ఎవరు పోటీ చేసినా గెలుస్తాను అని ధీమా వ్యక్తం చేశారు.
ఎంపీ రవీంద్రపై గల్లా అనూహ్య వ్యాఖ్యలు
టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎంపీ రవీంద్ర పై ఆయన అనూహ్య వ్యాఖ్యలు చేశారు. గల్లా జయదేవ్ పార్లమెంటులో కాలేజీ పిల్లాడిలా పేపర్ చూసి చదువుతాడు, నేను ఒక నిమిషంలో అప్పటికప్పుడు మాట్లాడగలనంటూ రవీంద్ర చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు గల్లా. పార్లమెంటు అనేది అప్పటికప్పుడు, మనకి నచ్చినట్టు మాట్లాడే వేదిక కాదన్నారు గల్లా. అది నిజంగానే కాలేజీలాంటి వ్యవస్థే అని, మనం ఒక అంశం మీద మాట్లాడేటప్పుడు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, కచ్చితమైన లెక్కలతో మాట్లాడాలని అన్నారు.
ఆయన నేను పార్టీలో ఉన్నప్పుడు స్నేహంగానే ఉన్నామని, మామధ్య విబేధాలు లేవని అన్నారు. పార్టీ మారగానే ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలియదు అన్నారు. ఆయనకి జనరల్ నాలెడ్జ్ ఉందని, ఒక్క నిమిషంలో ఆయన మాట్లాడగలరేమో కానీ నాకు అంత నాలెడ్జ్ లేదని అందుకే ప్రిపేర్ అయ్యి మాట్లాడతాను అంటూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు గల్లా జయదేవ్.