టిఆర్ఎస్ కవితకు మింగుడుపడని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడిందే ఆట. పాడిందే పాట. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో ఆయనతోపాటు కొడుకు కేటిఆర్, కూతరు కవిత, అల్లుడు హరీష్ రావు, మరదలి కొడుకు సంతోష్ రావు ప్రస్తుతానికి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. వీరందరూ కేసిఆర్ కుటుంబసభ్యులైనంతమాత్రాన వారికి అగ్రతాంబూలం దక్కిందనుకుంటే పొరపాటే. ఈ నాయకులందరూ హేమాహేమీలే అన్నట్లుగా పాలిటిక్స్ లో ఇమిడిపోయారు. విస్రృతమైన ప్రజా సంబంధాలు కలిగిన నాయకులైపోయారు. కుటుంబ రాజకీయాలతో దివినుంచి ఊడిపడ్డట్లుగా ఈ జాబితాలో ఎవరూ లేకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం నిజామాబాద్ ఎంపిగా ఉన్న కల్వకుంట్ల కవితకు మింగుడపడని అంశం ఒకటి ఉంది. అదేమంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి కవితకు ఎలా ఇబ్బందులు తెస్తున్నారబ్బా అని సందేహం ఉందా? అయితే చదవండి ఫుల్ స్టోరీ…
నిజామాబాద్ ఎంపిగా కవిత తన పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిలో పట్టు సాధించారు. ఒక్క జగిత్యాల తప్ప. ఎందుకంటే ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న అన్ని స్థానాల్లో టిఆర్ఎస్ శాసనసభ్యులే ఉన్నారు. కానీ జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న 2019 ఎన్నికల్లో ఎంపి కవిత కాస్తా ఎమ్మెల్యే కవిత, రాష్ట్ర మంత్రి కవిత గా రూపాంతరం చెందనున్నట్లు టాక్ నడుస్తోంది. అందుకోసం ఆమె ఇప్పటికే యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో కవిత జగిత్యాల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో టాక్ మొదలైంది. ఈ పరిస్థితుల్లో పక్కా పొలిటీషియన్, మాస్ లీడర్ గా పేరుగాంచిన జగిత్యాల జీవన్ రెడ్డి అలియాస్ తాటిపర్తి జీవన్ రెడ్డిని ఎదుర్కోవడం మామూలు విషయం కాదని టిఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పైగా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి జీవన్ రెడ్డిని ఢీకొట్టడం మామూలు విషయం కాదని చెబుతున్నారు. తెలంగాణ సిద్ధించిన వేళ టిఆర్ఎస్ హవా సాగిన నాడే జీవన్ రెడ్డి జగిత్యాలలో గెలిచారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకత సైతం జీవన్ రెడ్డికి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. దీంతో జీవన్ రెడ్డిని దెబ్బ కొట్టాలంటే ఎంపి కవిత శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయాల్సిందేనని క్యాడర్ భావిస్తోంది.
అందుకే ఆపరేషన్ జగిత్యాల స్టార్ట్ చేశారు ఎంపి కవిత. జిల్లాల విభజన తర్వాత జగిత్యాల జిల్లా కేంద్రంగా మారిపోయింది. జిల్లాల విభజనతో టిఆర్ఎస్ కు పెద్దగా ఒరిగిందేమీలేదన్న చర్చ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా జగిత్యాల జిల్లా కేంద్రంలో పాగా వేసేందుకు కవిత వలసలపై సీరియస్ గా కేంద్రీకరించారు. ప్రస్తుతం జగిత్యాల మున్సిపాలిటీలో టిఆర్ఎస్ కు అంతంతమాత్రంగానే పట్టు ఉంది. ఈ పరిస్థితుల్లో టిడిపి కౌన్సిలర్లందరినీ గులాబీ గూటికి గుంజుకోవడం ద్వారా జగిత్యాల పట్టణంలో పట్టు సాధించేందుకు కవిత స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే ఒక కౌన్సిలర్ కారెక్కేశారు. మరికొంతమంది కూడా టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక తాజాగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులపై టిఆర్ఎస్ వల వేస్తోందని టాక్ నడుస్తోంది. జగిత్యాల పట్టణంతోపాటు రూరల్ ప్రాంతాల్లో పట్టున్న నాయకులెవరు? ఎవరిని పార్టీలోకి గుంజుకోవాలన్న దానిపై కవిత కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు తన ఎంపి నిధుల నుంచి పెద్ద మొత్తంలో జగిత్యాలలో ఖర్చు చేసేందుకు సైతం కవిత వెనుకడుగు వేయడంలేదని చెబుతున్నారు.
గులాబీ కుంపట్లో గుబులు
జగిత్యాల టిఆర్ఎస్ లో రెండు వర్గాలున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్ కుమార్ ఒక వర్గంగా ఉండగా, మరో వర్గంగా పార్టీ సీనియర్ నేత జితేందర్ రావు ఉన్నారు. వీరిద్దరి మధ్య ఒకరంటే ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలే చేసుకుంటున్న పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో కవిత డాక్టర్ సంజయ్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. కేసిఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న జితేందర్ రావుకు ఈ అంశం మింగుడుపడడంలేదని టాక్. దీంతో ఈ రెండు వర్గాల సమన్వయం ఇప్పుడు కవితకు ఇబ్బందులు తెచ్చిపెడతాయని చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో జగిత్యాల నుంచే కవిత పోటీ చేస్తారని చెబుతున్న నేపథ్యంలో ముందుగా ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం సాధించిన తర్వాతే జీవన్ రెడ్డిపై పోరుసాగించాల్సిన అవసరం ఉందని జగిత్యాల పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి ఈ సవాళ్లను ఏరకంగా కవిత అధిగమించి విజయం సాధిస్తారన్నది తేలాల్సి ఉంది.